మహానటి సినిమా చూసిన తరువాత నా స్పందనను తెలియ పరచాలని అన్పించింది. అయినా నేనేమిటి, సినిమాల గూర్చి రాయడమేమిటి అని మనసేందుకో లాగింది…. కాని మరేదో బలమైన భావం రాయడానికే ఉసిగొల్పింది …. అందుకే వ్రాస్తున్నాను.
“మహానటి” కుటుంబ సభ్యులందరితో కలసి చూడదగ్గ సినిమా… ఒక మనోహర సెల్యులాయిడ్ దృశ్య కావ్యం.ముందుగా నిర్మాతలకు, ఇంత గొప్ప అద్భుతమైన సినిమా అందించిన దర్శకుడు మరియు ఆయనకు సహాయ సహకారాలందించిన వ్యక్తులకు అభినందనలు. కేవలం అభినందన చెబితే సరిపోదు అంతకు మించి చెప్పాలి అందుకే ఈ నా ప్రయత్నం.
ముఖ్యంగా కీర్తి సురేశ్ గారు మరియు సల్మాన్ దుల్కర్ గారి నటన కు ఎన్ని చప్పట్లు కొట్టినా తక్కువే…. భవిష్యత్తులో ఇంతకన్నా బాగా వాళ్ళు నటించలేరేమో అనిపించేంత బాగా వాళ్ళు తమ పని చేసారు. భవిష్యత్ లో సావిత్రి అంటే కీర్తి సురేష్ నే చూపిస్తారేమో అన్నంతలా నటించింది కథానాయిక. సావిత్రి ఎంత గొప్ప నటీమణి అనే విషయాన్ని జనానికి అర్థం చేయించాలంటే, ఆమె లానే నటించాలి…. కాదు కాదు, ఆమెకన్నా బాగా నటించాలి…. అలా నటించడం సాధారణ విషయం మాత్రం కాదు. గొప్పదనమంతా దర్శకుడిదే ……… అన్నీ నిజ జీవిత పాత్రలే అయినా, తెలుగు వారందరికీ సుపరిచితురాలైన పాత్ర గూర్చి చెబుతూ సినిమా తీస్తున్నపుడు, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. స్క్రిప్టు రాసుకున్న విధానం, స్క్రీన్ ప్లే, పాత్రల కు నటీ నటుల ఎంపిక… ఇవన్నీ అద్భుతం….ప్రధాన కథకు సమాంతరంగా నడిచే ఓ ఔత్సాహిక యువ రచయిత్రి జీవితం… 80ల నాటి పత్రికలూ.. జర్నలిజం… ఆడవాళ్ళ పైన రుద్దబడుతున్న కట్టుబాట్లు….. 1940 నుండి 1980 వరకూ గల సమాజ పోకడలను కూడా ఎన్నోజాగ్రత్తలు తీసుకుని చిత్రీకరించాడు. ఏ వొక్కటీ మిస్ కాకుండా చాలా అందంగా చెప్పాడు దర్శకుడు.సావిత్రి వ్యక్తిత్వం… ఆమెలోని హుషారైన, అచ్చమైన, అమాయక పల్లెపడుచును, వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లను పర్ ఫెక్ట్ గా ఆవిష్కరించాడు దర్శకుడు. తండ్రి లేని లోటు, ఆలోటు మనసులో సృష్టించిన పూడ్చలేని అగాధం…., కనపడని తండ్రిపట్ల కొండంత పెంచుకున్న ఎలక్ట్రా కాంప్లెక్స్, యుక్తవయస్సులో తొందరగా ప్రేమలో పడటానికి కారణమయిన అదే ఎలక్ట్రా కాంప్లెక్స్ ను చాలా బాగా మన గుండెలోతుల్లో గుచ్చుకునేలా దించేస్తాడు దర్శకుడు. ఒక హుషారైన జలపాతంలా ప్రారంభమయి, అడవుల్లో, వాగుల్లో వంకల్లో సంచరించి నదిగా మారి, ఎందరికో ప్రాణదాయిని అయ్యి, కృత్రిమ ఆనకట్టల వద్ద బలవంతంగా ఆగి, ఎవరెవరికో కడుపు నింపుతూ, ఎన్నో కలుషితాలను, ఇంకెన్నో మురికి కాలువలను తనలో మౌనంగా కలిపేసుకుని… చివరకు ఎవరికీ తెలియకుండా, పట్టకుండా మౌనసముద్రంలో కలిసిపోయినట్టుగా ఆమె జీవితంలోని ఆటుపోట్లను ఎంతో హృద్యంగా తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు. సావిత్రి వ్యక్తిగత జీవితంలో వ్యసనాలకు బానిస అవడానికి గల కారణాలను చాలా బాగా వివరిస్తాడు. ఎంతలా అంటే, తనకెదురైన అనుభవాలకు మరి వేరే అల్టర్ నేట్ లేదు అని మనకూ అనిపించేంత బాగా వివరించాడు. ఆరోజుల్లో నటీనటులకు ఉన్న గౌరవాన్ని, నిర్మాతల దర్శకుల ఔన్నత్యాన్ని చాలాబాగా చూపిస్తాడు. పనిలో పనిగా #క్యాస్టింగ్.కౌచ్ అంశాన్ని సున్నితంగానే లాగి చెంప దెబ్బ కొడతాడు. కొంచెమయినా అశ్లీలత లేకుండా సినిమా తీస్తే జనం చూడరండీ అని దీర్ఘాలు తీసే వారి గూబ గుయ్యిమనిపించేలా…. అశ్లీలత లేకుంటేనే జనం అంతా పిల్లా పాపలతో కలిసి 80, 90 దశకాల్లో లాగా సినిమా థియేటర్లకు విచ్చేస్తారని నిరూపించాడు. అసలు కేథారిసిస్ తో కూడిన సినిమాలు ఒకప్పుడు చాలా వచ్చేవి….. ఈ మధ్య కాలంలో నా దృష్టికి వచ్చింది మాత్రం మహానటి సినిమానే….. జనాలందరినీ కదిలించేది…. మనసుల్ని బరువెక్కించేది…. సావిత్రి దాతృత్వమే…. సైనికుల నిధి కోసం నిలువుదోపిడీ ఇచ్చిన దేశభక్తి, సావిత్రి వ్యక్తిత్వాన్ని హిమవన్నగమంత ఎత్తులో కూచోబెడుతుంది. కేథారిసిస్ తో బయటకు వచ్చే ప్రేక్షకుడి గుండె మొత్తం బరువెక్కి విషాద భరితమయి సావిత్రి గారిపట్ల ప్రేమ, అభిమానం వందల రెట్లు పెరిగి కొండ లా మారుతుంది. మహానటి ని హృదయంలో కొలువయ్యేలా చేస్తుంది. నిజంగా ఈ సినిమా, మహానటి సావిత్రి గారికి సినీ ఇండస్ట్రీ అందరూ కలిసి సమర్పించే ఒక గొప్ప నివాళి. ఈ నా భావనను మీరెవరైనా సినిమా దర్శకుడు నాగ అశ్విన్ కు చేరవేస్తే నేను మరింత ఆనంద పడతాను.
June 2018