స్త్రీ – మనుధర్మం: ఒక విశ్లేషణ

మనువు స్త్రీకి శత్రువా ? 

Sri  Mvr Sastry గారి రచన.


ముందుగా మనుధర్మం మీద కొందరు అపర మేధావుల అభిప్రాయాలు… 
“మనువు దుష్ట మేధావి. ‘న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి ‘ అంటూ స్త్రీని ఏ దశలోనూ స్వేచ్ఛ లేని కట్టుబానిసగా ప్రకటించాడు. అది స్త్రీ జాతి అభ్యుదయానికి గొడ్డలిపెట్టు” …. మల్లాది సుబ్బమ్మ.
“ఎట్టిపరిస్థితుల్లోనూ స్త్రీలు స్వేచ్ఛగా ప్రవర్తించటానికి వీల్లేదు అని మనువు ఖండితంగా చెప్పాడు.. భారతచరిత్రలో హిందూ స్త్రీల అధోగతికీ, వారి పతనానికీ మూలకారకుడు మను ధర్మ శాస్త్రకారుడే ”  …. సి.వి.
ఈ అభిప్రాయాలు చదివితే…ఇదేదో సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే అనిపిస్తుందా? లేదా?
ఆధునికులం, అభ్యుదయవాదులం అనుకునేవారందరికీ మనువు పేరు చెపితే కంపరం.’మనుస్మృతి’ అంటే అర్జెంటుగా తగలబెట్టేయాలన్నంత కోపం.ఈ కాలంలో ముఖ్యంగా స్త్రీ జాతిని అణగదోక్కేస్తున్న సకల చెడుగులకూ, పాపాల భైరవుడు మనువేనని తిరుగులేని నమ్మకం.
       అంత మహా పాపం మనుస్మృతికారుడు ఏమి చేశాడు ?
      యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః      యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియాః   ( మనుస్మృతి 3 -56 ).
అంటే అర్ధం:ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు దయ కలిగి ఉంటారు. స్త్రీలకు గౌరవం లేని చోట జరిగే దేవతా పూజాది క్రియలన్నీ వ్యర్థం – అంటే  స్త్రీలను నెత్తిన పెట్టుకున్నట్టా? కాళ్ళ కింద వేసి తొక్కినట్టా యువరానర్?
     శోచంతి జామయో యత్ర వినశ్యత్యాసు తత్కులం      న శోచంతి తు యత్రైతా వర్దతే తద్ది సర్వదా  ( 3 – 57  )అంటే అర్ధం:     స్త్రీలు దుఃఖిస్తే వారి దుఃఖానికి కారణమైన వారి వంశమంతా నశించిపోతుంది. స్త్రీలు సంతోషంతో ఉంటే ఆ ఇల్లు, వారి వంశం సదా కళకళలాడుతూ వర్ధిల్లుతుంది – అన్నవాడు మహిళల మేలు కోరినట్టా ? కీడు కోరినట్టా యువరానర్!?
    సంతుష్తో భార్యయా భర్తా  భర్త్రా భార్యా తథైవ చ    యస్మిన్నేవ  కులే నిత్యం కల్యాణం తత్ర వై ధృవం  ( 3 -60 )
అంటే అర్ధం:భర్త భార్యను, భార్య భర్తను సంతోషపెడుతూ ఉంటే ఆ ఇంట నిత్య కళ్యాణముగా సంపద నిలుస్తుంది  అని హితవు చెప్పటం అతివను ఆదరించడమా ? అణచి వేయడమా యువరానర్?
     ప్రజనార్థం మహాభాగాః పూజార్హా గృహ దీప్తయః      స్త్రియః శ్రియశ్చ గేహేషు  న విశేషోస్తి కశ్చన   ( 9-26 )
అంటే అర్ధం:సంతతి పొందటానికి కారణమైన స్త్రీలు మిక్కిలి గౌరవించదగినవారు. వారు ఇంటికి కాంతుల వంటి వారు. శ్రీ (సంపద) లేని ఇల్లు ఎలా శోభాయమానంగా ఉండదో స్త్రీ లేని ఇల్లు కూడా కాంతి హీనమే – అన్నవాడు నారీలోకం ఔన్నత్యాన్ని పెంచినట్టా? తుంచినట్టా యువరానర్??
‘ఎర్ర’ కామెర్లో, ‘తెల్ల’ కామెర్లో కమ్మిన మేతావుల కళ్ళకు ఎలా కనపడ్డా ప్రపంచంలో స్త్రీ విశిష్టతను గుర్తించి, ఆమె డిగ్నిటీని పెంచి, సమాజంలో సముచిత గౌరవ స్థానం కల్పించిన మొట్టమొదటి ధర్మవేత్త మనువు.
ఆస్తి హక్కుల విషయంలో “పుత్రేణ దుహితా సమా” కొడుకూ, కూతురూ ఇద్దరూ సమానులే అని ప్రాచీనకాలంలోనే ఘంటాపథంగా చాటిన మహనీయుడు మనువు.  అదీ ఎంత చక్కగా ?!
     యథైవాత్మా తథా పుత్రః పుత్రేణ దుహితా సమా      తస్యామాత్మని  తిష్థన్త్యాం కథ మన్యో ధనం హరేత్  ( 9- 130 )     తానెంతో కొడుకంత. కొడుకెంతో  కూతురంత. కొడుకులు లేకపోతే తండ్రి ధనం కూతురికి కాకపోతే ఇంకెవరికి వెళుతుంది ? అలాగే –
    మాతుస్తు యౌతకం యత్స్యాత్ కుమారీ భాగ ఏవ సః     దౌహిత్ర ఏవచ హరేదపుత్ర స్యాఖిలం ధనం   ( 9- 132 )
     జనన్యాం సంస్థితాయాం తు సమం సర్వే సహోదరాః     భజేరన్మాతృకం రిక్థం భగిన్యస్చ  సనాభయః  ( 9- 192 ).
తల్లి చనిపోతే ఆమె స్త్రీ ధనం ఆమె కూతుళ్ళకే వెళ్ళాలి. కొడుకులకు చెందకూడదు. తల్లి చనిపోయాక ఆమె పుత్రులు, పెళ్లి కాని కుమార్తెలు  తల్లి ధనాన్ని సమానంగా పంచుకోవాలి. పెళ్లి అయిన కూతుళ్ళకు తండ్రి ధనంలాగే తల్లి ధనంలోనూ నాలుగవ పాలు పంచి ఇవ్వాలి .. అని చెప్పిన మనువు స్త్రీలకు శత్రువా యువరానర్?
  మనుస్మృతిలో బోలెడు ప్రక్షిప్తాలు వచ్చి చేరాయని అంటున్నారు కదా !ఇదీ ఆ బాపతుదే అయి ఉంటుంది ;మనుధర్మాన్ని పైకెత్తడం కోసం తరవాతెప్పుడో ఈ శ్లోకాన్నీ ఇరికించి ఉంటారు – అని వాదించటానికీ    వీల్లేదు.ఎందుకంటే ఎన్నో వేల ఏళ్ళ కిందటి వేదాంగమైన నిరుక్తంలోనే యాస్కాచార్యుడు ఇలా చాటాడు :
     అవిశేషేణ పుత్రాణామ్ దాయో భవతి ధర్మతః     మిధునానాం విసర్గాదౌ మను స్వయంభువోబ్రవీత్   ( iii-1-4 )    (పారంపర్యం గా వస్తున్న ఆస్తిలో కుమారులకు, కుమార్తెలకు సమాన హక్కు ఉండాలని సృష్టి ఆరంభంలో స్వాయంభువ మనువు చెప్పాడు. )  
   కుటుంబ ఆస్తిలో ఆడపిల్లలకు కూడా సమానహక్కు ఇచ్చినంత మాత్రాన సరిపోదు. అబలలన్న అలుసుతో తోడబుట్టిన ఆడపడుచులకు అన్యాయం చేసి న్యాయంగా వారికి చెందాల్సిన ఆస్తినీ కాజేసే వాళ్ళు …  కాగితం మీద ఎన్నో చట్టాలు, న్యాయరక్షణలు కొడిగట్టిన ఈ కాలంలోనే ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి దుర్మార్గాలను ముందే ఊహించే స్త్రీలకు ఆస్తిలో ఆన్యాయం చేసే వారిని ఆత్మబంధువులు, సహోదరులయినా సరే మామూలు దొంగల వలెనే కర్కశంగా శిక్షించాలని మనువు అన్నాడు.
స్త్రీ ధనాన్ని అపహరించటం, స్త్రీలకు అన్యాయం చేయటం మహాపాపమని హెచ్చరించాడు. రిఫరెన్సులు ( 2-52 ) , ( 8 -29 ) , ( 9-213 ) .
అలాంటి నేరాలకు విధించిన దండనలు తీవ్రంగా ఉంటే, అవి క్రూరమనీ, అనాగరికమనీ, అమానుషమనీ మహానాగరికులమైన మనమే  మళ్ళీ తిట్టిపోస్తాం అనుకోండి !
ఆకాశంలో సగం అంటూ నంగిరి కబుర్లు చెబుతూనే .. మహిళా సాధికారత, స్త్రీ విమోచన, స్త్రీ స్వేచ్చ, స్త్రీ హక్కులు అంటూ పోచుకోలు మెరమెచ్చులతో కడుపు నింపుతూనే … ఆడవాళ్ళపై దారుణమైన అఘాయిత్యాలు, అత్యాచారాలు, అన్యాయాలకు ఒడిగట్టే మన కాలపు ధూర్తత్వం మనువుకు లేదు లెండి.
స్త్రీవాదులమని, వీర ఫెమినిస్టులమని వీధిలో వీరంగాలు వేస్తూనే సొంత ఇంట్లో కోడళ్ళను, ఆడపడుచులను, అత్తగారిని కాల్చుకుతినే ఈ కాలపు హిపోక్రసి నాటి మనుధర్మంలో లేదు.
అర్ధరాత్రి ఆడది అందాలన్నీ ఆరబోసుకుని అర్ధనగ్నంగా పబ్బులకూ, మందు పార్టీలకూ   విచ్చలవిడిగా తిరిగితేనే స్త్రీలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం  ఉన్నట్టు – అంటూ  పిచ్చి పిచ్చి ఉద్ఘాటనలు!వాస్తవానికి వచ్చేసరికి పరువుగా, హుందాగా వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు చేసుకునే మహిళలకు వారు పనిచేసే చోట, తిరిగేదారిలో, ఎక్కే వాహనాల్లో ప్రాణానికి, మానానికి, మర్యాదకు కనీస రక్షణే కరవు.
ఇంటాబయటా మానవతులకు భద్రత లేకుండా  బరితెగిస్తున్న  నీఛ, నికృష్ట మదాంధుల స్వైర విహారాలను అరికట్టలేని, ఘోర దురాగతాలకు లోనైన మహిళలకు సరైన న్యాయం ఏ నాటికీ చేకూర్చలేని ఇప్పటి అమానుష, అవ్యవస్థ కంటే మను ధర్మం ఎంతో నయం.
  ఎందుకంటే అతివలను ఎత్తుకుపోయేవారికి, చంపే వారికి, మరణ దండన విధించాలని మనువు చెప్పాడు. ( 8 -323 , 352 ) , ( 9- 232 ).
స్త్రీలను చెరిచిన వారిని ముక్కు, చెవులు కోయటం…కాలే పెనం మీద మాడి పోయేట్టు చేయటం… వంటి  చిత్రహింసలు పెట్టి చంపాలనీ చెప్పింది “స్త్రీలకు శత్రువు” అని మనం ఈసడించే మనువే. ( 8-364 , 372 ).
మనమేమో దేశ రాజధాని నడివీధిలో నడుస్తున్న బస్సులో ఒక మహిళను దారుణంగా చెరిచి చంపిన నరపిశాచాలను ఉరి తీయాలంటే .. అది అనాగరికం ; నేరస్థులను పందుల్లా మేపి ,  మనసు మార్చి మెల్లిగా సంస్కరించాలే తప్ప ప్రాణం తీయకూడదని మీడియా నిండా నీతుల వాంతులు చేసుకున్న సుకుమారులం !
సాధారణంగా స్త్రీలు ఎదుర్కొనే సమస్యలకు , లోనయ్యే అన్యాయాలకు పరిష్కర మార్గాలను చూపాడు మనువు.వారిపై నిరాధారమైన నిందలు, అభాండాలు మోపేందుకు ఎవరూ సాహసించలేని రీతిలో శిక్షలు ఎలా ఉండాలో కూడా చెప్పాడు.వారి తప్పేమీ లేకపోయినా, భార్యలను వదిలిపెట్టేవారిని ఎలా దండించాలో నిర్దేశించాడు.
ఇన్నిన్ని విధాల స్త్రీల యోగక్షేమాలకు గట్టి రక్షణలు సూచించి , “ఇంతి ఇంటికి కాంతి ” అని ఘోషించిన మనువును భయంకర నారీద్వేషిగా శాపనార్థాలు పెట్టటం సబబేనా యువరానర్?
చిన్నతనంలో తండ్రి, పెళ్ళయ్యాక భర్త, పెద్దతనంలో కొడుకు స్త్రీకి రక్షణగా నిలవాలనీ,ఆ సురక్షిత వ్యవస్థను అతిక్రమించి స్త్రీ స్వతంత్రంగా వ్యవహరించటం తగదనీ వేల సంవత్సరాల కిందట  మనువు చెప్పిన హితవులో తప్పు పట్టాల్సింది ఏమిటి ?
     పితా రక్షతి కౌమారే  భర్తా రక్షతి యౌవనే!     రక్షన్తి స్థావిరే పుత్రా నస్త్రీ స్వాతంత్ర్య మర్హతి!! ( 9-3 )అని చెప్పిన శ్లోకంలో… చివరి మాటలను మాత్రం పట్టుకొని స్త్రీకి స్వాతంత్ర్యం అర్హత లేదు అని మనువు అన్నాడనీ … బతికినంతకాలం తండ్రికిందో, మొగుడికిందో, కొడుకు చేతికిందో బానిసలా పడి ఉండాలని, అతివకు తీరని శాపం పెట్టాడనీ మిడిమిడి జ్ఞానంతో దుమ్మెత్తిపోయటం ఏ రకమైన విజ్ఞత యువరానర్?
       ఇప్పటి నవ నాగరిక , అల్ట్రా మోడరన్ విశృంఖల  సంస్కృతిలో మాత్రం ఆడపిల్ల తండ్రి సంరక్షణలో  ఉండటంలేదా ? ఫెమినిజానికి జీవిత చందా కట్టిన వీర నారులు మాత్రం భర్త ఇంట్లో ఉండటం లేదా ? తమ జోలికి ఎవరన్నా వస్తే , ఏ మగ మృగమో వెంటపడి వేధిస్తుంటే ఆ సమస్యను ఎదుర్కోవటానికి తండ్రి సాయమో , భర్త సాయమో వారు ఇప్పుడు తీసుకోవటం లేదా ? నేను స్వతంత్రురాలిని , తండ్రీ భర్తల సంరక్షణ పొందే  ఖర్మ నాకు పట్టలేదు అంటూ వారు ఎకాఎకి పోలీస్ స్టేషన్ కు పోతున్నారా ? ఇంట్లోని తమ బిడ్డలు తమ సంరక్షణలో ఉండాలని కోరుకుంటున్నారా .. లేక, ఆడపిల్ల స్వతంత్రురాలు కనుక  ఇష్టమొచ్చినట్టు ఏ రాత్రి ఎక్కడైనా గడిపెయ్యవచ్చని బోధించి  , కండోముల పాకెట్ బిడ్డ చేతికిచ్చి పంపుతున్నారా ? ఇంటికొచ్చిన కోడలు తన కొడుకు చెప్పినట్టు వినాలని కోరుకుంటున్నారా .. లేక వాడి లేక్కేమిటి ; నువ్వు స్వతంత్రురాలివి , మొగుడూ మొద్దులూ పిల్లా పెంటా అని కూచోకుండా హాయిగా బాయ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్ అంటూ తమ కోడళ్ళకు స్త్రీ స్వాతంత్ర్య ఆవశ్యకతను నూరిపోస్తున్నారా ? వయసు మళ్ళాక  బిడ్డల దగ్గర ఉంటే బాగుంటుందని ఆశ పడుతున్నారా .. లేక వయసు మీరగానే కొడుకులకు బై చెప్పి పెట్టెబేడా సర్దుకుని ఏ వృద్ధాశ్రమానికో , ఉమెన్స్ హాస్టల్ కో వెళ్ళాలని ఉవ్విళ్ళూరుతున్నారా ?
        తమ వరకూ వస్తేనేమో పిల్లలు తమ చెప్పుచేతల్లో ఉండాలా ? తమ మంచీ చెడ్డా మొత్తం మొగుడు చూసుకోవాలా? ముసలితనం లో తమ అవసరాలన్నీ పిల్లలే కనిపెట్టాలా ? మరి మనువు చెప్పిందీ అదే కదా ? తనకో నీతి  .. లోకానికో నీతి అన్న కపటం లేనివాడు కనుక అందరికీ  శ్రేయస్కరంగా ఒకటే నీతి ని అతడు ప్రవచించాడు ! తప్పా ?