నిన్ను చూస్తే, పిడుగుపాటుకు సిద్దంగా ఉన్న చెట్టు గుర్తొస్తుంది.
నిన్ను చూస్తే, కర్కశంగా ఉవ్వెత్తున ఎగసి పోటెత్తి వస్తున్న వరదను నిశ్శబ్దంగా ఆపుతున్న ఆనకట్ట గుర్తొస్తుంది.
నిన్ను చూస్తే, సైబీరియా చలిగాలుల నుండి కాపాడే సమున్నత హిమవన్నగం గుర్తొస్తుంది.
నిన్ను చూస్తే, తన గూర్చి కాక, మా గూర్చి ఆలోచించి కరిగిపోయే కొవొత్తి గుర్తొస్తుంది.
నిన్ను చూస్తే, చంటిబిడ్డలను తన చెంగుకింద దాచి రక్షించే అమ్మ గుర్తొస్తుంది.
మా కోసం పోరాడుతూ అలసిపోయి నేలపై ఒరిగిపోయేటప్పుడు…. నువు ఆసరాకోసం చేయి పెట్టిన నేల ఒక కంపమై… కంపనమై నన్ను కదిల్చి నా కర్తవ్యాన్ని గుర్తు చేస్తోంది .
మా కోసం పోరాడుతూ అలసిపోయి నేలపై ఒరిగిపోయేటప్పుడు…. చివరగా ఆకాశాన్ని విజయగర్వంతో నువ్వు చూసిన చూపు మెరుపులా మారి నన్ను తాకి నా కర్తవ్యాన్ని గుర్తు చేస్తోంది .
మా కోసం పోరాడుతూ అలసిపోయి నేలపై ఒరిగిపోయేటప్పుడు…. పంచభూతాలలో కలసి పోయిన నీ నిశ్వాసం, ఫెటిల్లుమని నా మొహాన్ని తాకి నా కర్తవ్యాన్ని గుర్తు చేస్తోంది .
మా కోసం పోరాడుతూ అలసిపోయి నేలపై ఒరిగిపోయేటప్పుడు…. నీ మోము మీద మిగిలిన చిరునవ్వు, నా గుండెల్లో దావానలమై రగిలి నన్ను నిలవనివ్వటం లేదు….
అవును …
వీరుడా…
శూరుడా…
ధీరుడా…
మా జీవితాలకు నువ్విచ్చిన భరోసాను వ్యర్థం కానివ్వను …
నీ జ్ఞాపకాన్ని వృధాగా పోనివ్వను….
నిన్ను… నిన్ను … నిన్నే ఆవాహన చేసుకుంటాను…
నువ్విచ్చిన స్ఫూర్తిని ని నరనరానా నింపుకుంటాను…..
నీ త్యాగ జ్యోతిని నా హృదయంలో వెలిగించుకుంటాను…..
…
ఇక క్షణక్షణం నీ బాటలోనే నడుస్తాను..