అవినీతి సర్వోపగతంబు

ఇందు గలదందు లేదంచు

సందేహంబు వలదు “అవినీతి” సర్వోపగతంబు

ఎందెందు వెతికి చూసిన

అందందు కలదు మానవాగ్రణి వింటేన్

          అవినీతి గత 50 సంవత్సరాల నుండి బర్నింగ్ టాపిక్ ఆఫ్ ది నేషన్, అయినప్పటికీ ఇంత వరకూ ఒక పరిష్కారం దిశగా అడుగు కూడా వేయలేకపోతున్నాం. అవినీతిని నిర్వచించాలంటే కొత్త పదాలు, కొత్త పరామితులు ఏర్పరుచుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

          అవినీతిని “నియమబద్దంగా చేయవలసిన పనిని నియమానుసారంగా చేయకపోవడమని” నిర్వచించవచ్చు. ప్రపంచ జనాభా పెరుగుదల సంఖ్యతో సమానంగా అవినీతి బాధితుల సంఖ్య మరియు అవినీతి పరుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి.

          మన దేశంలో అవినీతి అంటే చాలా మంది కేవలం లంచం తీసుకోవడం అనే భావిస్తారు. కానీ

 • తన విధులను, బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించకపోవడం
 • సమయానికి విధులకు హాజరు కాకపోవడం, సమయానికన్నా ముందే ఆఫీస్ నుండి వెళ్లిపోవడం
 • ట్రాఫిక్ సిగ్నల్స్ ను పాటించకపోవటం
 • విద్యుత్ ను అక్రమంగా వాడటం, ఇంట్లో కరెంట్ మీటర్ ను చట్ట వ్యతిరేక పద్ధతుల్లో తిరగకుండా చేయడం
 • బస్సులో, రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించడం (యూనివర్సిటీ క్యాంపస్ లలో బస్ లల్లో నెక్స్ట్ స్టాప్ పేరుతో టికెట్ తీసుకోకుండా ప్రయాణించడం)
 • టికెట్ల కోసం లేదా మరేదైనా అవసరం కోసం ఏర్పడిన క్యూలో అక్రమంగా చొరబడే ప్రయత్నం చేయడం, లేదా కౌంటర్ దగ్గరే నిలబడి ఏదొరకంగా తమ పని కానిచ్చే ప్రయత్నం చేయటం
 • కేబల్ టి‌వి వైర్ లను అక్రమంగా వాడటం
 • ఇంట్లోని మురికి నీటిని రోడ్లమీదకు వదిలివేయటం
 • ఇంట్లోని చెత్తను మురికి కలవలలో పడేసి వాటిని ప్రవహించకుండా చేయడం
 • పొల్యూషన్ చెక్ చేయని వాహనాలు వాడటం
 • ఇంట్లో ఫంక్షన్ ల పేరుతో రోడ్డుమీదనే టెంటు వేసి, రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగించడం…

          ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో మనం చేస్తూనే ఉంటాం. ఎవరైనా ఇటువంటి చర్యలను ప్రశ్నిస్తే దేశంలోని అవినీతి బాగోతాలను ఏకరవు పెట్టి మనమొక్కరమే సత్య హరిశ్చంద్రులమని, పెద్ద స్పీచు దంచేసి, ఈచిన్న పనిచేస్తే తప్పేమిటని వాదిస్తాం.

          ఎక్కడైనా నిజాయితీ పరుడైన ఉద్యోగి మనకు తారస పడితే ఆ ఉద్యోగి గూర్చి “వాడు తినడు మనను తిననీయడు” అని కామెంట్ చేస్తాం. అదే అవినీతి వలన మనకు ఏదైనా నష్టం జరిగితే మాత్రం నాయకులను దేశాన్ని తిట్టిపోస్తాం.

          “ఎక్కడైనా సరే అవినీతిని ప్రజలే ప్రోత్సహిస్తారు” అని ఎవరైనా ఒక వ్యక్తి వ్యాఖ్యానిస్తే,  మనలో చాలామందిమి విభేదిస్తాం! ఆ మాట అన్న వ్యక్తిని పురుగుకన్నా హీనంగా చూస్తాం. నిజాన్ని ఒప్పుకునే ధైర్యం మాత్రం చేయం. ఒక్క ఉదాహరణ పరిశీలిద్దాం! సాధారణంగా రిజిస్ట్రేషన్స్ కార్యాలయంలో, భూములు, ఇళ్ళు, వంటివాటి అమ్మకాల, కొనుగోళ్ల రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి. మనం గమనించవలసిన అంశం ఏమిటంటే, దస్తావేజులలో వ్రాయబడిన ప్రభుత్వధరకు టాక్స్ చెల్లించి, రిజిస్ట్రేషన్ చేయించి, ప్రభుత్వధరకన్నా పదిహేను, ఇరవై రెట్ల ఎక్కువ మొత్తానికి క్రయ  విక్రయాలు చేస్తాం. ప్రభుత్వానికి ఎక్కువ పన్ను కట్టవలసివస్తుందని, ప్రజలందరూ కలిసికట్టుగా, తక్కువధరకు అమ్మకం జరిగినట్టుగా, దస్తావేజులలో వ్రాసి ప్రభుత్వానికి నివేదిస్తాం. ఇది అవినీతి కదా అని ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం నోరు మెదపం! ఎవరైనా గట్టిగా ఈ విషయంపై రెట్టిస్తే, ఆ వ్యక్తిని లోకం తీరు తెలియని వాడిగా, సత్తెకాలపు వాడిలాగా, పిచ్చివాడిగా జమకట్టేస్తాం.

          అయితే అవినీతిని మనం వర్గీకరించి, ఏయే విధమైన అవినీతి రకాలున్నాయో గమనిస్తే, అవగాహన పెంచుకుంటే, అవినీతిని ఏ విధంగా నిరోధించాలనే ఆలోచనలు రేకెత్తుతాయి. స్థూలంగా దేశంలోని మొత్తం అవినీతిని 2 రకాలుగా వర్గీకరించవచ్చు.

 1. సంఘటిత రంగ అవినీతి.
 2. అసంఘటిత రంగ అవినీతి.

1) సంఘటిత రంగ అవినీతిలో: ప్రధానంగా ప్రభుత్వం నుండి ప్రజలకు అందవలసినదానిని సరిగ్గా అందజేయకపోవడానికి  సంబంధించిన అవినీతి. దీన్ని మనం

 1. రాజకీయ అవినీతి
 2. ప్రభుత్వ విధాన పరమైన అవినీతి
 3. న్యాయ అవినీతి గా వర్గీకరించవచ్చు.

2) అసంఘటిత రంగ అవినీతి: ప్రజలనుండి ప్రభుత్వానికి చెల్లించవలసిన దానిలో జరిగేది మరియు ప్రజలమధ్య జరిగే కార్యకలాపాలలో చోటుచేసుకునే అవినీతి. దేనిలో

 1. ప్రజలనుండి ప్రభుత్వానికి జరిగే చెల్లింపులలో/ కార్యకలాపాలలో అవినీతి
 2. ప్రజలమధ్య జరిగే కార్యకలాపాలలో అవినీతి.

సంఘటిత రంగంలోని విభాగాల గూర్చి కొద్దిగా వివరంగా చూద్దాం.

 1. రాజకీయ అవినీతి: ప్రభుత్వ విధానాల రూపకల్పనలో, పారదర్శకత పాటించకుండా, రాజకీయపార్టీల, నేతల, అనుచరుల ప్రయోజనాలకు అనుగుణంగా తయారుచేయించటం, ప్రభుత్వాన్ని తమ తమ ప్రయోజనాలకు అనుకూలంగా విధానాలు తయారు చేసేలా ప్రభావితం చేయటం. అధికారులపై , ఉద్యోగులపై వత్తిడి కలుగచేయటం. విస్తృత ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకోకుండా సంకుచిత భావజాలంతో , పార్టీలన్నీ కుమ్మక్కై విధానాలు రచించటం.
 2. ప్రభుత్వ విధానపరమైన అవినీతి: అవినీతి వ్యతిరేక విభాగాల పనితీరును మెరుగు పర్చకపోవటం, అవసరమైన మేరకు నిధుల కేటాయింపు జరపాక పోవటం, ఒక వర్గం ఒక ప్రాంతం వారికే లబ్ది చేకూరేలా నిర్ణయాలు తీసుకోవటం ప్రభ్యత్వం లోని అవినీతి పట్ల నిష్క్రియాపరత్వం ప్రదర్షించటం…. వంటివి.
 3. న్యాయపరమైన అవినీతి: న్యాయం జరుగవలసిన వారి తరపు న్యాయవాదులు ప్రతివాదులతో కుమ్మక్కై కక్షిదారులకు అన్యాయం చేయటం. సమున్నతమైన న్యాయమూర్తి పదవిలోకి వచ్చిన తరువాత కూడా రాగ ద్వేషాలను జయించలేక, అవినీతి పరులను, నిందితులను కాపాడే ప్రయత్న చేయడం… వంటివి.

అసంఘటిత రంగం లోని అవినీతిని గమనిస్తే …… 

ప్రజల నుండి ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులవంటి వాటి విషయం లో, తప్పుడు లెక్కలు చూపించటం, తప్పుడు ధృవపత్రాలు  సమర్పించటం, తద్వారా తక్కువ పన్ను చెల్లించే ప్రయత్నం చేయటం, ఇటువంటివణ్ణి ఒక రకమైతే, ప్రజల మధ్య జరిగే కార్యకలాపాలలో అవినీతిని ప్రోత్సహిస్తూ ఉండటం, అంటే నిత్యావసర వస్తువులను గోడౌన్లలో దయచేసి కృత్రిమ కొరతను సృష్టించటం, తద్వారా వాటి ధరలను విపరీతంగా పెంచేయటం, బ్రాండెడ్  వస్తువులను అనుకరించి నాణ్యత లేని చౌక వస్తువులను సృష్టించటం , టాక్సీలలో దొంగ మీటర్లు అమర్చి ఎక్కువ వసులు చేయటం, వ్యక్తులను బ్లాక్ మెయిలింగ్ ద్వారా భయపెట్టి తమ ప్రయోజనాలు కాపాడుకోవటం, షాపులలో తప్పుడు కొలతల ద్వారా ప్రజలను మోసగించటం,  అధిక వడ్డీల ఆశ చూపి డిపాజిట్లు వసులు చేసి, బోర్డులు తిప్పేయటం, ఎన్.ఎఫ్ బి.సిలు , అధిక వడ్డీల ఎం.ఎఫ్ ఐ లు, తక్కువ ధరకే టెండర్లు కోట్ చేసి నాసిరకం పనులు చేసి డబ్బులు దండుకోవటం, తిరిగి అదే పనులకు మరమ్మత్తుల పేరుతొ మళ్ళి  నిధులు రాబట్టుకోవటం, దొంగ సర్టిఫికెట్లు సృష్టించటం…. ఇట్లా వ్రాస్తూ పొతే,…. కొండవీటి చాంతాడంత లిస్టు…. …. ఎన్నెన్నో మార్గాల్లో జరుగుతుంది అవినీతి. 

                  ఇటువంటి అవినీతికి రెండు రకాల కారణాలుంటాయి. 

 1. వ్యక్తిగత కారణాలు,
 2. సామాజిక కారణాలు. 

1. వ్యక్తిగత కారణాలు,

 1. డబ్బుతోనే సమస్తం నడుస్తుందనే భావన నెలకొని ఉండటం,
 2. వ్యవస్థ పట్ల చులకన భావన 
 3. సమాజంలోని ధనవంతులు అనుభవిస్తున్న సౌఖ్యాలను రాత్రికి రాత్రే అందిపుచుకోవాలనే పేరాశ 
 4. అవినీతి పరులు శిక్షలు తప్పించుకుంటూ అందలాలెక్కటం మిగతా తటస్తులకు  అవినీతి వైపు ప్రేరణ కలిగించడం  
 5. వ్యక్తుల ఆర్ధిక స్థితిగతులు 
 6. మనను పట్టించుకునే వారెవరు…. అనే ధీమా 
 7. సామాజిక బాధ్యత గుర్తెరగక పోవటం 

2. సామాజిక కారణాలు

 1. అవినీతిని నిరోధించే సమగ్ర వ్యవస్థ లేక పోవటం…. 
 2. సమాజంలో అవినీతి పరులకు లభించే గౌరవం, హోదా …. నిజాయితీపరులకు దక్కక పోవటం… 
 3. అవినీతి నిరోధక విషయాలలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించక పోవటం 
 4. సమాజంలోని ఆర్ధిక అంతరాలలో మార్పు రాకుండా అదేవిధంగా కొనసాగటం …… 

      ఇటువంటివన్నీ గమనిస్తే మన సమాజంలో ఆదర్శప్రాయమైన వ్యక్తులే లేరా అని అనిపిస్తుంది. కానీ  మంచి ఆదర్శాలు గల  వ్యక్తులు, ఆదర్శప్రాయమైన నడవడిక కలిగినవారు సమాజంలో ఎప్పుడు ఉంటూనే ఉన్నారు నిజానికి వీరెవరూ గుర్తింపబడరు…. సాధారణ వ్యక్తులు, సంస్థలు,మీడియా, వీరెవ్వరు నిజాయితీపరులను గుర్తించేందుకు ఇష్టపడరు. ఎందుకంటే మంచి కన్నా చెడు  ఎప్పుడు తొందరగా వ్యాపిస్తుంది మరియు ఆకర్షణీయంగా ఉంటుంది. 

          సమాజంలోని వ్యక్తులలో 80% మంది వ్యక్తులకు ఎటువంటి అభిప్రాయాలు ఉండవు, వీరు ఆరోజున సమాజంలోని ప్రభావం ఆధారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక 10% మంది వ్యక్తులు మంచిపనులు చేయడానికే పుడతారు మంచి చేస్తారు, మరణిస్తారు….. మరో 10% వ్యక్తు చెడు  చేయడానికే పుడతారు, చెడు  చేస్తారు చనిపోతారు…..  కానీ ఒక సమాజంలో, ఆ సమయంలో  ఏ రకం వ్యక్తులు ఎక్కువగా ఉంటే మిగతా 80% సమాజమంతా అటువైపే ప్రభావితమవుతూ ఉంటుంది.  ఒక గౌతమ బుద్ధుడు, ఒక గాంధీజీ, ఒక డాక్టర్జీ, ఒక గురూజీ,….. లాంటి ప్రభావశీలురు సమాజంలో అధికంగా ఉన్నప్పుడు, సమాజంలోని వ్యక్తులంతా  ఆ రకమైన ఆలోచనా ధోరణికి ఆకర్షింపబడతారు. 

          దావుద్ ఇబ్రహీం,  హర్షద్ మెహతా,  ఏ.రాజా,  సురేష్ కల్మాడీ,రామలింగరాజు, లాలూప్రసాద్, గాలి జనార్దన్ రెడ్డి  వంటి వ్యక్తులు, నాయకుల ముసుగేసుకున్న దోపిడీదారులు, సమాజంలో ఎక్కువగా కనబడుతుంటే, సమాజం పై పౌరులపై ఈ ప్రభావమే ఎక్కువగా ఉంటుంది.


           ప్రపంచంలోని 168 దేశాలకు సంబంధించి,  ప్రభుత్వ యంత్రరంగం లో ఉన్న అవినీతి గురించి ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ నిర్వహించిన  సర్వే జరిపి దేశాలలోని అవినీతిని బట్టి ర్యాంకులు  ఇచ్చ్చింది.  ఆ ర్యాంకుల ప్రకారం డెన్మార్క్, ఫిన్లండ్   అతితక్కువ అవినీతి తో మొదటి రెండు స్థానాల్లో నిలువగా… సోమాలియా, ఉత్తర కొరియా ఆఫ్ఘనిస్తాన్ లు చిట్టా చివరి స్థానాల్లో నిలిచాయి. మన దేశం 76 వ స్థానంలో, చైనా 83 వ స్థానంలో, పాకిస్థాన్ 117 వ స్థానంలో నిలిచాయి. దీన్నిబట్టి అవినీతి జాఢ్యమ్ ప్రపంచంలోని అన్ని దేశాలను పట్టి పీడిస్తుందని  తెలుస్తోంది.  

        మనదేశంలో అవినీతికి వ్యతిరేకంగా సమాజం స్పందన అంతంత మాత్రం గానే ఉంటుంది. దాదాపు 80% ప్రజలు, అవినీతి నిరోధం లో  తమ పాత్ర కీలకమయిందని భావించరు. అవినీతి నిరోధమనేది తమకు సంబంధించిన విషయం కానేకాదని  భావిస్తారు.  

 • ఒక రాష్ట్రం లో అవినీతికి అవకాశమివ్వలేదని ఒక ఐఏఎస్ అధికారిని రాళ్లతో కొట్టి చంపితే కూడా మన సమాజం స్పందించదు…. 
 •  అదే రాష్ట్రం లో   నేషనల్ హైవే పనులలో అక్రమాలు భారీగా జరుగుతున్నాయని ఒక అధికారి ఆ అక్రమాలకు  అడ్డుపడి, విషయాన్ని ఆ నాటి ప్రధానమంత్రికి నివేదిస్తే కూడా చలనం లేని సమాజం, అధికారం మనవి. ఆలేఖ రాసిన విషయం తెలిసి, అవినీతి మాఫియా ఆ అధికారిని క్రూరంగా చంపేస్తే కూడా మనం పట్టించుకోము.  
 •  అధికారం కోసం, హక్కులకోసం ఉద్యమించిన గిరిజనులను, ఊచకోత కోసిన వ్యక్తులను మనం ముఖ్యమంత్రిగా కేంద్రమంత్రి గా ఎన్నుకుంటాం….. 
 • ముఖ్యమంత్రి పదవిలో ఉన్న తండ్రిని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలోని వనరులను నిలువు దోపిడీ చేసిన వ్యక్తులగూర్చి దేశమంతా కోడై కూసినా,  మనం మాత్రం సానుభూతి పేరుతొ ఎన్నికల్లో గెలిపిస్తాం. పైగా ఆ వ్యక్తి పార్టీలోనే చేరి అవినీతి వ్యతిరేక ఉద్యమాలు చేస్తాం…. 
 •  దేశం కోసం బలిదానాలు చేసిన సైనికులకు కేటాయించబడ్డ హౌసింగ్ ఫ్లాట్లలో సైతం అవినీతి వ్యవహారాలూ చేసిన నాయకులకు జై కొడతాం…. 
 •  ఎవరు డబ్బులిచ్చినాతీసుకోండి కానీ మా పార్టీకే ఓటెయ్యండి అని బహిరంగంగా పిలుపిచ్చిన నాయకులను మేధావులుగా భావించి మనం ముఖ్యమంత్రులను చేస్తాం….. 

ప్రజల  సామాజిక బాధ్యతను మరచి పోయి అవినీతి గూర్చి వేదాలు వల్లించే దయ్యాలం మనమందరం….  ఎవరెవరో వచ్చి ఏదేదో చేసేయాలని కలలుగానే సమాజం మనది…. 

“ఆ ఎవరో వ్యక్తి” మనలో ఉన్నాడనే సత్యాన్ని గ్రహించలేని శక్తి మనది. మన యువత కూడా మహోత్సాహంతో అవినీతి వ్యతిరేకోద్యమంలో పాల్గొంటారు. ఉత్సాహంతో ఎస్సెమ్మెస్ లు, వాట్సాప్ మెసేజులు తండోపతండాలుగా పంపించేస్తారు. బైక్ ర్యాలీలు చేస్తారు, జెండాలు పట్టుకుంటారు, జై కొడతారు,…సాయంత్రమవగానే ఏ బైక్ తో ర్యాలీలో పాల్గొన్నారో, అదే బైక్ మీద ముగ్గురు ముగ్గురు కూర్చుని, రోడ్ల మీద ప్రమాదకర విన్యాసాలు చేస్తూ,ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆపకుండా, లైసెన్స్ లేకుండా సిగ్నల్స్ వద్ద దూసుకుపోతుంటారు . తమ వ్యక్తిగత విషయంలో మాత్రం, నీతి నిజాయితీలతో ప్రవర్తించవలసిన అవసరం వచ్చినపుడు మాత్రం….. అన్ని మరచిపోయి అవినీతి పరులకు సహకారం చేసేందుకే మొగ్గు చూపుతారు….   అవినీతి వ్యతిరేక ఎస్సెమ్మెస్ లు, వాట్సాప్ మెసేజులు మాత్రం ఆపకుండా పంపిస్తూనే ఉంటారు.  అవినీతి వ్యతిరేక ఉద్యమంలో తమ బాధ్యత కేవలం మెసేజెస్ పంపడం వరకే అని భావించి చేతులు దులిపేసుకుంటారు. 

రాజకీయ నాయకుల అవినీతి గురించి మాట్లాడే ఎంతోమందివ్యక్తులు కనీసం ఎన్నికల్లో ఓటు వేయరు…. పైగా పోలింగ్ రోజున పిక్నీక్ ప్లాన్ చేసుకుంటారు … వీరు ఓటు వేయని ఎన్నికల్లో ఎవడో గెలిస్తే వాడి అవినీతిని తలుచుకుని బాధపడి పోతుంటారు. స్వాతంత్ర దినోత్సవం రోజున, గణతంత్ర దినం రోజున కనీసం జాతీయ పతాకం ఎగురవేయాలని, లేదా ఏ మహనీయుల త్యాగఫలం వల్ల మనకు స్వాతంత్య్రం సిద్ధించిందో వారిని వారి సేవలను మననం చేసుకుని స్ఫూర్తిని నింపుకుని, మన రోజువారీ పనులలో నిష్పాక్షికత ప్రతిబింబించేలా పనిచేయాలనే భావాలు ఏ ఒక్కరిలో కానరావు.  అసలు ఆగస్టు 15, జనవరి 26 రోజులలో కార్యాలయాలకు హాజరయ్యేవారు సం ఖ్య చాలా తక్కువ.

          బాగా చదువుకున్న వాళ్లెవరూ ఓటింగ్ లో పాల్గొనకపోతే, చదువు రానివారు అత్తెసరు చదువులు చదివినవారు రకరకాల ప్రలోభాలకు లోనై ఓట్లు వేస్తె, మొత్తం ప్రజలలో 50% మంది కూడా పాల్గొననో పోలింగ్ ద్వారా గెలిచినవాడు నాయకుడెలా అవుతాడు…? మంచివాడు ఎలా అవుతాడు… ?  అవినీతిని నిరోధించాలంటే సమాజం కలసికట్టుగా పనిచేయాలి. ముందు మనలో అవగాహన పెరగాలి ఏరకమైన అవినీతి మానవ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకుంటే అవినీతిని ఎలా నిరోధించవచ్చో ప్రణాళికలు సిద్ధం చేయవచ్చు. 

          ప్రజలందరిని ప్రభుత్వ ఆడిటింగ్ లో పాలుపంచుకునేలా చేసే  సోషల్ ఆడిట్ ప్రక్రియ ను మరింత విస్తృతం చేయాలి. అన్ని విభాగాలకు సామాజిక తనిఖీ నిర్వర్తించాలి. ఈ ప్రక్రియ వల్ల ప్రభుత్వం నుండి అందవలసిన సమస్త సేవలలో పారదర్శకత నెలకొల్పగలిగే అవకాశం ఉంది. సమాచార హక్కు చట్టం గురించి విస్తృత చర్చ జరిగేలా అవగాహన పెరిగేలా చర్యలు చేపట్టాలి. అవినీతి వల్ల ప్రజలు ఎంతగా మోసాగించబడుతున్నారో అర్థం చేయించగలిగితే, అవినీతి పై పోరాటం విషయం లో ప్రజలకు ఐక్యత వస్తుంది. గుడ్డిగా ఉద్యమం చేయకుండా ప్రజలను అవగాహనా పరులను చేస్తూ ఉద్యమించాలి. అప్పుడే ప్రజల భాగస్వామ్యం పెరుగుతుంది. సచ్ఛీలురు మాత్రమే పారదర్శకమైన ఆదర్శప్రాయమైన నాయకత్వం అండించగలరు. కాబట్టి శీల నిర్మాణం జరిగే కార్యక్రమాల ద్వారా సుశిక్షితులైన కార్యకర్తలను తయారు చేయాలి.

          అవినీతి అనేది రాత్రికి రాత్రే అంతమొందించబడే జాఢ్యం కాదు. దశలవారిగా పోరాటం చేయాలి.  సంవత్సరాల తరబడి పోరాడేందుకు, సహనం అలవర్చుకోవాలి. అలుపెరుగని పోరాటం, మడమ తిప్పని వ్యక్తిత్వం తో కూడిన సమరం చేయాలి.

          ప్రభుత్వం కూడా కొన్ని రకాల విశ్వాసం పాదుకోల్పే చర్యలు చేపట్టాలి.

 1. అవినీతి నిరోధానికి దేశమంతటా రెవెన్యూ డివిజన్ కు  ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేయాలి.
 2. అవినీతిపై పోరాడేందుకు, తద్వారా ఆదర్శవంతమైన సమాజం ఏర్పడేందుకు, న్యాయప్రక్రియ ను సరళా తరం చేయాలి. 6 నెలల లోపు కేసులను కొలిక్కి తెచ్చేందుకు వీలుగా టైమ్ లైన్ పద్ధతిని ఏర్పరచాలి.
 3. అవినీతి నిరూపించబడితే శిక్షలు కతినాతికఠినంగా ఉండాలి. ఉద్యోగాలనుండి తొలగించటం, యావజ్జీవ శిక్షలు విధించటం,వ్యాపారులైతే ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయడం, ఇతర రామ్గాల వారైతే వారి వారి జీవనోపాధులు స్తంభింప చేయటం, వంటి శిక్షలను అమలు పరచాలి.
 4. ఈ తరహా కోర్టుల చర్యలను, తీర్పులను సామాజిక తనిఖీ చేయించి పరదర్శకతను పెంపొందింపచేయాలి.
 5. తప్పుడు ఫిర్యాదులను చేసి కోర్టుల సమయాన్ని వృధా చేసేవారిని కఠినంగా శిక్షించాలి.
 6. అవినీతి నిరూపించ బడిన  నాయకుల ఆస్తులు జప్తు చేసి, వారిని ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలి. 
 7. ప్రజలు తమకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వానికి, కోర్టులకు సులభంగా నివెదించుకోగలిగే సుహృద్భావ వాతావరణాన్ని ఏర్పరచాలి.  
 8. అవినీతి నిరోధక శాఖలో కేవలం పోలీసు శాఖవారినే నియమించటం వల్ల, నయీమ్ లాంటి వారు ఎన్నో సందర్భాలలో తప్పించుకు తిరగగలుగుతున్నారు. ఈ శాఖలో అన్నీ ప్రభుత్వ విభాగాల వారికి, స్వచ్చంద సంస్థల వారికి అవకాశం ఇవ్వాలి. దాని వల్ల ప్రజలకు అత్యంత అన్యాయం చేస్తున్న ప్రభుత్వ శాఖలన్నింటిని సమూలంగా ప్రక్షాళన చేయవచ్చు.  

ఇవే కాకుండా ప్రతి స్వతంత్ర దినోత్సవం నాడు నిజాయితీ పరులను, సచ్చీలురను గుర్తించి గ్రామ గ్రామాన సన్మానింపచేయాలి. ఇటువంటి ఎన్నో చర్యలు, ప్రజా భాగస్వామ్యం కలిస్తేనే సుస్థిరమైన అవినీతి రహిత సమాజం సాధ్యమవుతుంది. పైన పేర్కొన్నవే కాకుండా ఇంకా ఎన్నో రకాల చర్యలను, విధానాలను అమలుపరచినప్పుడు అందరి సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుంది. అత్యంత స్వచ్చమైన పరిపాలనను , ధర్మ పరిపాలను ప్రజలకు అందించ గలుగుతాము. .

భారత్ మాతా కి జై.

September 2016

Leave a Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s