కవిత్వమ్..
మనస్సు లోని మూలల్లోన, లోతుల్లోని పొరలల్లోన ఏదో జ్వాలా చలనం, ఇంకేదో ఏదో సంచలనం .. ..
కవిత్వమొక సంవేదన, కవిత్వమొక ఆవేదన కవిత్వమొక సంఘర్షణ,కవిత్వమొక సత్యాన్వేషణ కవిత్వమొక బోధన, కావ్య సృజన ఒక ప్రసవ వేదన .. .. ॥ మనస్సు లొని॥
కనిపించిన సంఘటనో, మైమరపించిన నటనో,ఎదురొచ్చిన సంకటమో, చుట్టుకున్న లంపటమో .. .. ॥ మనస్సు లొని॥ మది మలయానిలమో, హృది దాగిన బడబానలమో,భూమి పొరలలో జర్రున అలజడులో, సాగర తెరలో గిర్రున తిరిగే పెను సుడులో.. ॥ మనస్సు లొని॥
దారిపక్క గుక్క పట్టిఏడ్చే ఒంటరి పిల్లాడో, చెట్టు కింద నిదురించే అలసిన రిక్షా వాడో వర్షపు బిందువు స్పర్శలతో కర్షక నగవో, ఒంటరి రాత్రులలో గుర్తొచ్చే ప్రేయసి తనువో.. .. ॥ మనస్సు లొని॥
అంతర్నేత్రపు గమనపు దారిలో, మెరిసీ మెరవని సినివాలిలోఅస్పష్ట రూపాల రేఖా చిత్రం, అగమ్యగోచర జీవన తత్త్వం,.. .. ॥ మనస్సు లొని॥
మనసాంతర్గత జ్వలనం,అంతర్ముఖ లోచన గానం,హృదయపు నిశ్వాసల నమకం, మనసు పలికే సరాగ గమకం
అవును….
కవిత్వమొక సంవేదన,
కవిత్వమొక ఆవేదన
కవిత్వమొక సంఘర్షణ,
కవిత్వమొక సత్యాన్వేషణ ..
కవిత్వమొక ఆగని తృష్ణ ….
కవిత్వమొక మిగిలిన ప్రశ్న… … …
కవిత్వమొక బో ధ న,
కావ్య సృజన
ఒక ప్ర స వ వే ద న .. ..
November 2013