ఏడవండి……
ఏడవండి…….
ఇంకా గట్టిగా ఏడవండి……..
సమాజంలో ఈ మనుషుల్లో మనసుల్లో,
చనిపోయిన నా నేస్తం కనబడటం లేదని
కనీసం ప్రతిబింబమయినా లేదని
ఏడవండి………..
……..
కోటలలో నిధులకోసం బంగారం కోసం
సముద్రాల్లో నూనెల నిక్షేపాల కోసం
పగడాల కోసం, రత్నాల కోసం
వెతకడం కాదు, దొరకలేదని
బాధపడటం కాడు……………
ఏడవండి…
……..
ఏ ఒక్కరూ ఏడ్వటం లేదు కదా……
పైగా నవ్వుతున్నారు………
————————-
ఎవరికి పట్టిందిలే నేస్తం
నువు కనబడకుండా పోతే
ఏ సీరియలూ ఆగలేదు
బ్రేకింగ్ న్యూసులు ఆగకుండా ఉండలేదు
20-20 లు , క్లబ్బులూ, పబ్బులూ,
బస్సులు మెస్సులూ, ఏవీ గమనించినట్టు
కూడా అనిపించలేదు………
______________________
నువ్వు కొంచెం కొంచెం
క్షీణిస్తున్నప్పుడే……..
కొంతమంది గమనించి అరచినా…..
నీ గురించి వేదికలెక్కి మాట్లాడే
వాడెవ్వడూ……..
పట్టించుకున్న పాపాన పోలేదు.
—————————-
నువ్వు మంచానపడి లేవలేని స్థితిలో
ఉన్నావని బాధపడే వాళ్ళే అందరూ నాతో సహా…
ఒక్కడు కూడా నువ్వు మామూలుగా
అవడానికి సహాయపడింది లేదు………
—————————
అయినా ఇప్పుడనుకుని ఏం లాభం…!
నువ్వు నాకు కనబడకుండా పోయినప్పుడూ……
పేపర్లో నీకు సంబంధించిన వార్తలు
అప్పుడప్పుడూ వస్తుంటే
ఎక్కొడొ ఒకదగ్గర
పదిలంగా ఉన్నావనుకునేవాణ్ణి
మనసు దిటవు చేసుకునేవాణ్ణి…..
—————————–
చివరకు నాలో నైనా నిన్ను
బతికించుకుంటానని
నమ్మకం కలగట్లేదు……….
కనీసం ఇప్పుడైనా నిన్ను
పునరుజ్జీవింప చేసుకుని అందరిలో
నిన్ను చూసుకుంటానని…….
నాకు నేను కూడా ధైర్యం చెప్పుకోలేక పోతున్నాను.
——————————
ఇన్ని ఉద్యమాలు జరిగినా
ఒక్క ఉద్యమకారుడైనా నిన్ను
హృదంతరాళం లో బలంగా నమ్మి
నిన్ను బతికించుకోడానికి ఉద్యమం
చేసి ఉంటాడనుకోను.
—————————–
—————————-
సరే….
సరే….
అయినా సరే..
నేస్తం నేను నిన్ను నమ్మటం ప్రారంభిస్తున్నాను…
నిన్ను మాత్రమే యెదలో నిల్పుకునె ప్రయత్నమ్ చేస్తాను
నీ గూర్చి పదిమందికీ చెప్పి
కొంతలో కొంతైనా ఆశలు నిల్పుకుంటాను.
అవును
నమ్మితే సాధ్యం కానిదేదీ లేదు
ఎడారిలో మొక్కలు మొలుస్తాయ్….
సముద్రం లో మంచినీళ్ళు దొరుకుతాయ్…..
కక్షలు, కార్పణ్యాలు లేని మనుషులూ పుడతారు,
రసాయనాల్లేని పంటలు పండుతాయ్…..
అవినీతి లేని సమాజం సాధ్యమవుతుంది……
డబ్బుకన్న, మనుషులే మిన్న అనే నిజం బోధపడుతుంది…..
అవును
నిన్ను నమ్మితే
మనుషుల్లా ఉన్నవాళ్ళు నిజంగా మానవుల్లాగా మారతారు……
చచ్చిపోయిన మానవత్వం అనే నా నేస్తం తిరిగి బతుకుతుంది.
January 2014