॥ సుషుప్తాత్మలు … ॥
నాకొక టివి ఉన్నది
క్రికెట్ మ్యాచ్ వస్తున్నది
అడ్వర్ టైజు మెంటు చూస్తే
చాలులోకంలోని వృద్ధి అంతా తెలిసిపోతూనే ఉన్నది
పేపర్లు , చానళ్ళు రిపోర్టర్లు,
మేధావులు నాయకులు, అధికారులు …
ఎవ్వరికీ అందకుండ
మానవాభివృద్ధి జరిగి జరిగి పోతున్నది
ఎవరిమట్టుకు వారికి
ప్రపంచమంతా బాగానే ఉన్నది
నాకు మాత్రం గుండె లోతుల్లో
ఎక్కడో మండుతున్నట్టనిపిస్తున్నది.. ..
నీడలే సోకనట్టి సంపూర్ణపు వెలుగొకటి
అందరు చేతులు వేసిన
అబివృద్ధి సౌధమొకటి
ప్రయత్నిస్తే ప్రయత్నిస్తే
సాధ్యమనే అనిపిస్తున్నది.. ..
అందరినీ కలుపుకుని
వెళదామని ప్రయత్నిస్తే
తక్కెడలో కప్పలన్ని
దుమికి దుమికి పోతున్నవి .. ..
అందరూ బురదలోకి
రాళ్ళు కొడుతూ ఉన్నప్పుడు
బురద చిట్లుతున్న వైపు
నా వీపే ఉన్నట్టనిపిస్తున్నది .. ..
జాగృదావస్థా ..
కాదు కాదు
స్వప్నావస్థా …
అసలే కాదు
మానవ చైతన్యపు ఆత్మ
సుషుప్తావస్థ లోకి
జారి జారి పొతున్నది.. ..
March 2013