వారు ఎడారిని జయిస్తున్నారు

రాజస్థాన్ అనగానే ఒక రాణాప్రతాప్, ఒక పృథ్వీరాజ చౌహాన్, ఒక పద్మినీ దేవి వంటి వీరులు, శూరులు, గొప్ప చారిత్రక వారసత్వం, పెద్ద పెద్ద కోటలూ, భారతీయ కళలూ గుర్తొచ్చేవి. కానీ పాలకుల ముందుచూపు లేని నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు రాజస్థాన్ అంటే రాళ్ళు, ఇసుక, నెత్తిన బిందెల దొంతరలు, నీటి కటకట, బీడు భూములు, పేదరికం, త్రాగునీటి ఎద్దడి, ఎడారులు మాత్రమే మన కళ్ల ముందు కదలుతున్నాయి.

               భౌగోళికంగా రాజస్థాన్ రాష్ట్రం భారత దేశ వాయువ్య ప్రాంతం లో ఉండటం వల్ల,  నైరుతి ఋతుపవనాల మార్గం లో చివరి మజిలీ రాజస్థానే అవడం వల్ల  ఆ రాష్ట్రం అతి తక్కువ వర్షపాతాన్ని పొందుతోంది. అంతేకాక రాష్ట్రం లోని ఆరావళీ పర్వత పంక్తులు కూడా నైరుతి ఋతుపవనాలను బలపర్చే దిశలో  లేక పోవడం కూడా రాజస్థాన్ ప్రజలకు శాపంగా మారింది. మొదలే తక్కువ వర్షపాతం పైనుండి నీటి సంరక్షణ పద్దతులను పూర్తిగా మరచిపోయి పరిపాలన సాగిస్తున్న పాలక వర్గాలు…. ఈ విధంగా అటు ప్రకృతి ఇటు మానవుడు రాజస్థాన్ ను చిన్నచూపు చూడటం వల్ల పెక్కు నష్టాలకు ప్రజలకు గురి అయ్యారు.   భూమి ఉత్తరార్ధ గోళం లో, కర్కాటక రేఖ ప్రాంతం లోని, అన్నీ దేశాలలోనూ ఎడారులున్నాయి . కానీ మన దేశంలో ఎడారి విస్తృతి అంతకంతకూ పెరిగి పోతూ ఉంది. రాజస్థాన్ కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే ఇజ్రాయెల్ వంటి దేశం మెరుగయిన జల సంరక్షణ పద్దతులతో గొప్ప వ్యవసాయోత్పత్తి సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్య పరుస్తూ ఉంటే, అంతకన్న ఎన్నో ఎక్కువ వనరులున్న రాజస్థాన్ మాత్రం ఎప్పటినుండో ఎడారి చూపులే చూస్తోంది.

రాజస్థానీ సంప్రదాయక మహిళలు
రాజస్థానీ చిత్రకళ
  • రాజస్థాన్ లో కళాకారులు ఎక్కువగా ఉంటారు. కళలు, సాంస్కృతిక అంశాల పట్ల జనానికి మక్కువ ఎక్కువ. అందుకే రాజస్థానీ చిత్రకళ, వస్త్రాలపై చిత్రకళ, శిల్పకళ, జానపద కళలు, ప్రధానంగా హిందీ భాషకు వన్నెలద్దిన రాజస్థానీ యాసలోని జానపద గీతాలు ……. ఇలాంటివెన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి.
  • ఎక్కడయితే జీవన విధానం లో విపరీతమయిన పోరాటం ఉంటుందో అక్కడ కళాకారులు ఎక్కువగా ఉంటారు. జీవన విధానం లోని వైవిధ్యాన్ని, ఎత్తు పల్లాలను ఈ కళాకారులు ఎక్కువగా తమ తమ కళల్లో ప్రతిబింబిస్తూ ఉంటారు.   రాజస్థాన్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తమ జీవనోపాధులకోసం కష్టించే సమయం కన్నా ఎక్కువ సమయం త్రాగు నీటిని సేకరించేందుకు వాడతారు.
  •  గత 60 సంవత్సరాలుగా ఏ నాయకులు గెలిచి అధికారం లోకి వచ్చినా ‘నీటి’ మాటలు చెప్పే అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. కానీ మొదటిసారిగా, వసుంధరా రాజే ప్రభుత్వం ‘నీటి’ మాటలను నీటి ‘మూటలు’ గా మార్చే ప్రయత్నం చేస్తోంది.

               రాజస్థాన్ రాష్ట్రం 343 లక్షల హెక్టార్ల విస్తీర్ణం లో ఉంది. ఇందులో 168 లక్షల హెక్టార్లు మాత్రమే సాగుకు అనుకూలంగా ఉంటుంది.అదీ ఒక పంట వరకు మాత్రమే. జనావాసాలు, రోడ్లు , భవనాలు వంటి సెటిల్ మెంట్లను తీసివేస్తే, మిగిలిన భూభాగమంతా అంటే 101 లక్షల హెక్టార్ల భూమి పూర్తిగా ఎడారి గా మారిపోయింది.. జనావాసాలు ఉన్న భూమిలో కూడా ఇసుక శాతం పెరిగిపోయి, నీటి లభ్యత పూర్తిగా అడుగంటి పోయింది.

                మొత్తం రాష్ట్రం లో లెక్కిస్తే నీటి లభ్యత గలిగిన ప్రాంతం మొత్తంగా 168 లక్షల హెక్టార్లు మాత్రమే. మిగిలిన 175 లక్షల హెక్టార్లకు నీటి లభ్యత అంతంత మాత్రమే. దాదాపు రాష్ట్రం భూభాగం లో 60 % భూమికి నీటి లభ్యత మృగ్యం గా మారింది. రాజస్థాన్ లో ప్రతి 5 సంవత్సరాల కాలాన్ని  తీసుకుంటే అందులో 3 సంవత్సరాలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు తాండవమాడుతుంతాయి.

                నీళ్ళు లేకపోతే పంటలు పండవు, మూగ జీవాలకు గ్రాసం లభించదు గ్రామీణ జీవన వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమై పోతుంది. వ్యవసాయ రంగం మీద ఆధార పడ్డ మధ్యతరగతి, పట్టణ ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా చిన్నాభిన్నమై పోతాయి. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పేద ప్రజలు వలస వెళ్ళిపోయి పట్టణ పేదల మీద నగర పేదల మీద మరింత భారాన్ని పెంచుతారు. గ్రామీణ ప్రాంతాల నుండి వలసవచ్చే కూలీలు తక్కువ ధరలకే లభించడం వల్ల, పట్టణ ప్రాంత పేదలు తమతమ ఉపాధులను కోల్పోవడమో లేదా తక్కువ వేతనాలకే పని చేయాల్సి రావడమో జరుగుతుంది.         

                60 శాతం పైగా భూభాగం ఎడారి అవడం వల్ల , రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి లో వ్యవసాయ రంగం వాటా 27 % కన్నా దిగువకు పడిపోయింది. ఉన్న కొద్ది సాగుభూమి లో 90% భూమికి వాననీరే ఆధారం. ఆధునిక జల సంరక్షణ పద్ధతులకు దూరం గా ఉంటున్న రైతాంగం ఒకవైపు, అవగాహన లేని దిగువస్థాయి ఉద్యోగ వర్గం మరోవైపు   వీటన్నింటి మధ్య వసుంధర రాజే నాయకత్వం లోని రాజస్థాన్ ప్రభుత్వం ఎడారులపై యుద్ధమే ప్రారంభించింది. అతిపెద్ద సమస్యతో పోరాడేందుకు పరిమిత వనరులతోనే సిద్ధమైంది. అంకిత భావంతో ధృఢ చిత్తంతో ప్రారంభించబడ్డ తొలి అడుగు విజయం వైపు దూసుకెళ్తోంది. 

                2015 లో ప్రారంభించిన ముఖ్యమంత్రి జల స్వావలంబన యోజన పథకం ప్రధానంగా గ్రామాల్లో నీటి సంరక్షణ పద్ధతులను ప్రోత్సహిస్తూ, నీటి సంరక్షణ గూర్చి అవగాహన కలిగిస్తూ, ప్రజల భాగస్వామ్యం ఎంత అవసరమో, ఎంత ఆవశ్యకమో తెలియజేసే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున స్పందించి ఇప్పటివరకు 37 కోట్ల రూపాయలు విరాళాలుగా ప్రభుత్వానికి అందించి తమ ఉదారతను చాటుకున్నారు.

                రాజస్థాన్ ప్రభుత్వం మొదటి దశలో 33 జిల్లాలలో, 3529 గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జల సంరక్షణ పద్దతులలో ప్రతీ దశను చాలా జాగ్రత్తగా అమలు పరచే విధంగా యంత్రాంగాన్ని సిద్ధం చేశారు.  ఈ కార్యక్రమం లో భాగంగా ఫోర్ వాటర్ సిస్టమ్ ను అభివృద్ధి చెందించాలని ప్రధాన లక్ష్యం గా పెట్టుకున్నారు.

  • వర్షపు నీరు ,
  • నేలలోని తేమ
  • భూగర్భ జలం
  • ఉపరితల నీరు

                వీటన్నింటిని సమర్థవంతం గా వాడుకోవాలంటే ఒక్కొక్క దశలో పనులను పకడ్బందీగా అమలు చేయాలి. ఇందులో భారీ నిర్మాణాలు ఉండవు. చిన్న చిన్న కందకాలు తవ్వడం, గట్ట్లు వేయడం, మట్టి కట్టలు తవ్వడం, వాలుకు అడ్డంగా కాంటూర్ కందకాలు తవ్వడం, సమతల ప్రాంతాలలో ఫారం పాండ్స్ తవ్వడం, ఊట కుంటలు తవ్వడం వంటి చర్యలు నీటిని ఇంకేవిధంగా చేస్తాయి. వర్షపు నీరు ఎక్కడ పడితే ఎటువైపు ప్రవహిస్తోందో చూపే శాటిలైట్ టోపోలోజికల్ మ్యాపులను సిద్ధం చేసి వాటి ఆధారంగా రాక్ ఫిల్ డ్యాముల నిర్మాణం వాటి తరువాత పైన చెప్పుకున్న నిర్మాణాలు ఒకటి తరువాత ఒకటి సరయిన దూరాలలో నిర్మించి స్టాగ్గర్డ్ తవ్వకాల నుండి అనేక కోణాల్లో నీటిని నిల్వ చేస్తారు.

                గ్రామాల్లో కమిటీలు వేసి, జరుగుతున్న పనులను పర్యవేక్షించటం, NRV (నాన్ రెసిడెంట్ విలేజర్స్) క్లబ్బులను ఏర్పాటు చేసి గ్రామస్తులకు సహకారం అందించటం, జరుగుతున్న పనుల నివేదికలను  ఎప్పటికప్పుడు బ్లాక్ స్థాయి అధికారులకు చేరవేయటం, జరిగిన పనులకు వెంటవెంటనే నిధులు మంజూరీ చేయించటం వంటి వాటివల్ల పనులు మరింత మెరుగ్గా జరిగే అవకాశం కలిగింది.   

                రాజస్థాన్ లో ప్రధానమైన సమస్య “నీటి లభ్యత ఒక్కటే కాదు, సంవత్సరానికి ఒక్కసారే వచ్చే వర్షాన్ని, ఆ ప్రవాహాలను సంరక్షించుకోలేక పోవటం కూడా”…. అనే విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం నీటి సంరక్షణ పద్ధతులను ప్రజా భాగస్వామ్యం తో చేపట్టింది. ఒక్క భారీ వర్షం వచ్చినా సరే ఆ నీటిని భూమి ఇంకించుకునే పరిస్థితి లేక పోవటం గమనించింది. దీనికి మానవ తప్పిదమే  కారణమని గ్రహించి, ముందుగా ప్రవహించే నీటిని ఆగే లాగా, ఆగిన నీటిని ఇంకేలాగా, ఇంకిన నీరు తిరిగి ఆ పరిసర ప్రాంతాలలోని మొక్కలకు వృక్షాలకు చేరే లాగా ప్రణాళికలు రచించింది. భూమిలో ఇసుక శాతం పెరిగి పోవటానికి కారణమవుతున్న భూసార క్రమ క్షయాన్ని  గుర్తించి, దాని అరికట్టేందుకు అవసరమైన చర్యలను మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మరియు ముఖ్యమంత్రి జల స్వావలంబన యోజన పథకాల ద్వారా పనులను గ్రామ స్థాయి లో గుర్తించి ప్రజలౌ అందరూ కలిసి చేసే లాగా ప్రోత్సహించింది.

నీటిని మించిన నిధి ఇంకోటి లేదు అన్న విషయం అర్థమైన తరువాత, ఎడారిలో జలసిరులు పండించే క్రమం లో పర్యావరణానికి ఎక్కడా హాని కలుగ కుండా ప్రణాళికలు సిద్ధం చేయడం మరో పెద్ద విజయం. భారీ ప్రాజెక్టులు లేవు , నిర్వాసితులు లేరు ఉన్నవారంతా లబ్దిదారులే.

ప్రతీ చినుకును సద్వినియోగం చేసేందుకు అడుగులు వేశారు. పరుగెడుతున్న నీటిని ఆపే విధంగా యంత్రాంగం పరుగులు పెట్టారు. ఇజ్రాయెల్, సిరియా వంటి దేశాలలో అనుసరిస్తున్న విధానాలను కొద్దిగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుని విజయవంతం గా అమలు చేస్తున్నారు.      

                ప్రధానంగా కొండ ప్రాంతాలలో లోని వాలు కాల్వలకు అడ్డంగా కాంటూర్లను నిర్మింప చేసి, చిన్న నీటి ప్రవాహాలను స్థిరీకరించి, ప్రతీ గ్రామంలో 10-15 ఊట కుంటలను, చెక్ డ్యాములను, పర్కోలేషన్ ట్యాంకులను నిర్మించి నీరు ఇంకే లాగా చేశారు. ముందుగా భూమిలోకి నీరు ఇంకడం  ప్రారంభమయితే, భూగర్భ జలాల మట్టం పెరుగుతుంది. భూగర్భ జలాల మట్టం పెరిగితే నేలలోని తేమ శాతం పెరుగుతుంది. ఫలితంగా నేలలోని ఇసుక శాతం తగ్గిపోతుంది. తద్వారా ఉపరితల నీటి నిల్వ సామర్థ్యం పెరిగి చుట్టుపక్కల ప్రాంతాలలో నీటి లభ్యత పెరిగి పంటల ఉత్పాదకత పెరుగుతుంది అది అంతిమంగా ప్రజల స్థిగతుల మార్పునకూ రాష్ట్ర ఉన్నతికి కారణమౌతుంది.

                బాల్య వివాహాలు తగ్గిపోయాయి , వలసలూ తగ్గిపోయాయి , తక్కువ ధరకే కూలీలుగా మారవల్సిన అగత్యమూ తప్పిపోయింది, భవన నిర్మాణ కార్మికులుగా, కార్పెంటర్లు గా మారి దేశమంతా తిరగాల్సిన బాధలూ తప్పిపోయాయి. స్వాభిమానంతో, జల స్వావలంబనతో ఆత్మగౌరవంతో రాజస్థాన్ గ్రామీణులు ఇప్పుడు తలెత్తుకు జీవిస్తున్నారు. ఇప్పుడు గ్రామాల్లో మళ్ళీ షెహనాయీ లు వినిపిస్తున్నాయి , గ్రామాలలో  కళ్యాణ కళ ఉట్టిపడుతోంది.  

                 తొలి దశలో రెండు వేల కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు. ప్రతీ పనిని స్వచ్ఛంద సంస్థల ద్వారా సామాజిక తనిఖీలు చేయిస్తూ పారదర్శకతను చాటుకుంటుండటం వల్ల  ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం లో భాగస్వాములు కావడానికి ముందుకు వస్తున్నారు.

                 త్రాగునీటి తో పాటు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించటం లో రాజస్థాన్ ప్రభుత్వం సఫలమైంది.   ఝలావర్ జిల్లాలోని రూప్ పురా బర్దీయా, అసల్ పురా, రోజియా సరోద్ వంటి గ్రామాల్లో ఎక్కడ చూసిన పచ్చని పైరులు కనువిందు చేస్తున్నాయి. ఒకప్పుడు ఒక్కొక్క నీటి చుక్క కోసం ఆకాశం వైపు చూసిన రాజస్థాన్ నేలలు స్వయం సమృద్ధిని సాధించుకుంటున్నాయి.  

                ఎడారిని ఓడించాలన్న లక్ష్యం ఒకవైపు, ఈ మహదాశయాన్ని ఓడించేందుకు వ్యక్తులు, వ్యతిరేక ప్రచారం చేసే సంస్థలు, పార్టీలు, సమర్థవంతం గా పనిచేసే అలవాటు లేని ఉద్యోగులు అవగాహన లేమి వంటి వన్నీ ఇంకోవైపు……..    ఇన్నిరకాల ప్రతికూలతల మధ్య ప్రభుత్వం 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమంలో దశల వారీగా సఫలమవుతూ ఉండటంతో, ప్రజలూ స్వచ్ఛంద సంస్థలూ, పారిశ్రామిక వేత్తలూ, ఎన్‌ఆర్‌ఐ లు, పోలీసు అధికారులూ ఇలా అన్నీ వర్గాల వారూ ఎడారిపై యుద్ధానికి ప్రభుత్వం తో చేతులు కలిపారు. ఒక మహా యజ్ఞం లో సమిధలయ్యేందుకు ముందుకు వచ్చారు. ఇక ఎంత మాత్రమూ రాజస్తాన్ “బీమారు” (BI,MA,R,U) రాష్ట్రం కాదనీ వారు ప్రపంచానికి చాటి చెప్పేందుకు సిద్ధమయ్యారు.

                రెండవ దశ 5200 గ్రామాల లో సర్వే ప్రారంభమయ్యింది. ప్రజల స్పందన, సహకారం చూసి ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ముక్కున వేలేసుకునే పరిస్తితి తలెత్తింది. ఎడారి గుండెల్లో గంగమ్మను పొంగులెత్తించేందుకు ప్రజలు ప్రభుత్వమూ కలసి కట్టుగా కదలుతున్నారు….. …..  వారి వజ్ర సంకల్పం ముందు ఎడారి గొంతు తడారిపోతోంది……  దేశంలో ఎక్కడ కరువు పై చర్చ జరిగినా ఇక రాజస్థానే గుర్తొస్తుంది ….. వారి కర్తవ్య దీక్ష గుర్తొస్తుంది …….. ఎడారి కొంచెం కొంచెం తగ్గిపోతూ నేలంతా పచ్చగా మారి పంటలు పండిచటం గుర్తొస్తుంది ………..  అందరూ ఐకమత్యం తో ఊహించనలవి కాని లక్ష్యాన్ని సాధించటం గుర్తొస్తుంది ……………. చివరగా వారు ఎడారిని జయించటం గుర్తోస్తుంది.            

October 2016 

Leave a Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s