శ్వేత కాంతి విడిపోయి హరివిల్లుగా మారినట్టు
ధ్వానాలను గుదిగుచ్చిన చిరుహారం నా మౌనం
అంతర్లీన వాయులీనం నా మౌనం
నమక చమకాల ఢమరుకం నా మౌనం
ఉగ్ర నరసిహుడి భీకర గర్జన నా మౌనం
మన్మధుడిని దగ్ధం చేసిన నిటలాక్షాగ్ని నా మౌనం
రాముడి ధనుష్ఠంకారం నా మౌనం
గజాననుడి ఘీంకారం నా మౌనం
అంతరాళ ప్రయాణపు అంతరంగానికి అందనిది
ఊహలకు దొరకకుండా మూర్తీభవించినది
నా మౌనం కర్ణభేది
నా మౌనం శబ్ధాంబుధి
నా మౌనం స్వప్నావస్తావధి
నా మౌనం నిర్వికల్ప స్థితి సారథి
నా మౌనం భావనల సమాధి
నా మౌనం పరమాత్ముడి సన్నిధి