నే….!
నేను మాట్లాడకపోతే ఈ ప్రపంచం మూగవోతుంది నేను కదలకపోతే ఈ జగం నిశ్చలమవుతుంది నేను వినకపోతే ఈ లోకం వేదన అరణ్యరోదనవుతుంది నేను చూడకపోతే వెలుగు చీకటయిపోతుంది నేను శాసించకపోతే గాలులు స్తంభించిపోతాయి నేను అనంతాన్ని...నేను దిగ్దిగంతాన్ని నేను తరంగాన్ని... నేను కీమ్మీరపు గాలి తెమ్మెరను నేను రేణువును... గోపగోపికా కోపతాప స్వాంతనపు వేణువును నేను భావాన్ని... పక్ష్యాదుల కిలకిలారావాన్ని నేను జగత్తును... నేనే మహత్తును నేను మరచిపోబడ్డ గతాన్ని.... నేను దద్దరిల్లుతున్న ఉద్యమకారుడి స్వగతాన్ని నేను మరీచిని... నేను లోక పునర్నిర్మాణం కోసం వెన్నెముకనిచ్చిన దధీచిని నేను చేతస్సును… నేను ప్రజా శ్రేయస్సుకోసం ఆవిష్కృతమవుతున్న హవిస్సును నేను కుసుమపేశల శిరీషను ...నేను జిగీషను... నేను కవిత్వపు వస్త్వైక్యాన్ని ... నేను కవి భావనలోని ఏకాత్మతను నేను ప్రపంచపు చైతన్యాన్ని.... నేను మానవ హృదయాశావధి నిండిన భావనాత్మక ఔన్నత్యాన్ని నేను భీకర ఆయుధాన్ని... నేను తండ్రి యెదపై ఆడే చిన్నారి నవ్వుల శీకరాన్ని... నేను భీరువును... నేను ధీరుడిని... నేను బలవంతుడి ధాష్టీకానికి తెగిపడ్డ మెడను... నేను చలిచీమలచే కట్టబడ్డ దుర్భేద్యపు గోడను నేను యుద్ధసేనాని రథ కేతనాన్ని... నేను అధిపత్యవాదులచే కుంచించబడుతున్న గౌరవమనే వేతనాన్ని.... నేను మానవాంతర్గత సంద్రపు కల్లోలాన్ని .... నేను తిమిరలోకపు గుండెలు చీల్చిన ఉదయశరాన్ని నేను మనిషి గుండెలో విరుస్తున్న వాత్సల్యపు శిల్పాన్ని నేను బండరాళ్లను చీల్చుకుని మొలకెత్తుతున్న వికసిత పుష్పాన్ని 2015