క్రిప్టో కరెన్సీ : కథా కమామీషు

ప్రపంచమంతా డిజిటల్ కరెన్సీ వెల్లువలో కొట్టుకుపోతున్న ఈ తరుణం లో, క్రిప్టో కరెన్సీ పై ఒక సాధారణ అవగాహన కోసం ఈ వ్యాసం

క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి

Photo by Karolina Grabowska on Pexels.com

క్రిప్టో కరెన్సీ అనేది ఒక డిజిటల్ లేదా వర్చువల్ కరెన్సీ. క్రిప్టో గ్రఫీ ద్వారా రక్షణ ఏర్పాటు  చేయబడుతుంది. ఏ విధంగా అయితే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో వ్యక్తుల మధ్య సంభాషణ/ చర్చ అనేది  క్రిప్టో గ్రఫీ ద్వారా ఎన్ క్రిప్ట్ చేయబడుతుందో అదే విధంగా ఈ డిజిటల్ కరెన్సీ కూడా క్రిప్టో గ్రఫీ ద్వారా చలామణి అవుతూ రక్షించబడుతూ ఉంటుంది. ఎక్కువ శాతం క్రిప్టో కరెన్సీలు బ్లాక్ చైన్ సాంకేతికత మీద ఆధారపడి వికేంద్రీకరణ జరిగిన నెట్వర్క్ లు కలిగి ఉంటాయి.

క్రిప్టో కరెన్సీ  ప్రధాన లక్షణాలు

  1. ఈ కరెన్సీ ని నియంత్రించేందుకు, ముద్రించేందుకు ఒక ప్రధాన సంస్థ అంటూ ఏదీ ఉండదు.
  2. నకిలీలు లేదా ఒకే పద్దు మీద రెండు సార్లు ఖర్చు వంటివి క్రిప్టో గ్రఫీ సాంకేతికత వల్ల సాధ్యం కాకుండా ఉంటాయి.
  3. ఎలాంటి భౌతిక కరెన్సీ ఉండదు కాబట్టి పాడవడం, పునర్ముద్రించడం వంటి మెయింటెనెన్సు అంశాలు ఉండవు. 
  4. డిజిటల్ కరెన్సీ కాబట్టి ప్రధానంగా కంప్యూటర్లు, ట్యాబ్ లు, మొబైల్ ఫోన్లు వంటి వాటిలోనే కాబట్టి కొన్ని వేల కంప్యూటర్లను అనుసంధానం చేసే బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా నడుస్తుంది కాబట్టి ప్రభుత్వాలు లేదా ఇతర సంస్థలు ఇందులోకి చొచ్చుకు వచ్చే అవకాశం లేదు.  నియంత్రణలు విధించే అవకాశం కూడా లేదు.
  5. క్రిప్టో కరెన్సీల ప్రధాన బలం ఎన్ క్రిప్షన్. డేటా సమగ్రతకు ముప్పు రానీయకుండా చూడటమే ఎన్ క్రిప్షన్. క్రిప్టో కరెన్సీ ఏ విధమైన లావాదేవీ అయినా సులభంగా జరపగలిగే లాగా ఇది రూపొందించబడింది.
  6. ఇప్పటివరకు క్రిప్టో కరెన్సీ కి ఉన్న ప్రధాన బలహీనత మార్కెట్ రిస్క్. ఎక్స్ ఛేంజ్ రేటు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండటం కూడా క్రిప్టో కరెన్సీ ని ఎక్కువ మంది నమ్మకపోవడానికి ఒక కారణం.  
  7. క్రిప్టో కరెన్సీలో పూర్తి సురక్షిత పేమెంట్స్ అవికూడా టోకెన్/కాయిన్ పేర్లతో జరుగుతాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీ వల్ల ప్రతీ ఇద్దరి మధ్య జరిగే లావాదేవీ అంతర్గత లెడ్జర్ లో రికార్డ్ అవుతుంది. ఎలిప్టికల్ కర్వ్ ఎన్ క్రిప్షన్, పబ్లిక్ ప్రైవేట్ కీ జంటలు, హాష్ తో కూడిన లావాదేవీలు…. మొదలైనవి ఇందులో ఉంటాయి.

క్రిప్టో కరెన్సీ రకాలు.

           క్రిప్టో కరెన్సీ లో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా అతి ఎక్కువగా విస్తృతమైన కరెన్సీ బిట్ కాయిన్. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ చలామణిలో ఉన్న దేశాలలో అత్యంత విలువ కలిగినది కూడా బిట్ కాయినే. బిట్ కాయిన్ విజయవంతమయ్యాక చాలా రకాల కరెన్సీలు పుట్టుకొచ్చాయి. వీటిలో ప్రధానమైనవి లైట్ కాయిన్, నేమ్ కాయిన్, ఏథెరం, కార్దానో, మరియు ఈఓఎస్. 2020 జనవరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిప్టో కరెన్సీ విలువ దాదాపుగా 214 బిలియన్ డాలర్లు. బిట్ కాయిన్ ను 2009 లో సతోషి నకమాటో అనే మారుపేరుతో లాంచ్ చేశారు. జనవరి 2020 నాటికి దాదాపుగా 1.8 కోట్ల బిట్ కాయిన్స్ చలామణిలో ఉన్నట్టు మార్కెట్ అధ్యయనాల ద్వారా తెలుస్తుంది.

            నిజానికి క్రిప్టో కరెన్సీ లో వాడుతున్న క్రిప్టో గ్రఫీ సాంకేతికత మిలిటరీ అవసరాల కోసం తయారు చేయబడినది కానీ, అమెరికాలో న్యాయ పరమైన అవకాశాల వల్ల సాధారణ జనం కూడా ఈ సాంకేతికతను వాడి క్రిప్టో కరెన్సీని వాడుకలోకి తేవడం జరిగినది.

బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏమిటి

        కంప్యూటర్లు, ట్యాబ్ లు, మొబైల్ ఫోన్లు వంటివాటి తో ఆన్ లైన్ లో జరిగే లావాదేవీలు క్రిప్టో కరెన్సీ లో భాగం కాబట్టి బ్లాక్ చైన్ టెక్నాలజీ కొన్ని వేల కంప్యూటర్లను అనుసంధానం చేసి, క్రిప్టో కరెన్సీ లో జరిగే ప్రతీ లావాదేవీ ని అనుసంధానిత కంప్యూటర్ లో మరియు ఆన్ లైన్ లో ఒక లెడ్జర్ ను క్రియేట్ చేస్తుంది.  ప్రతీ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలు లెడ్జర్ లలో నిక్షిప్తం చేయబడతాయి. మధ్యవర్తిగా ఒక బ్యాంక్ వంటి సంస్థ ఏదీ ఉండదు కాబట్టి కరెన్సీ వాడుతున్న వాళ్ళకు తప్ప ఏ లావాదేవీ ఇతరులకు తెలిసే అవకాశం లేదు. క్రియేట్ అయ్యే ప్రతీ బ్లాక్ కూడా వాడుతున్న వ్యక్తి కన్ ఫర్మ్ చేసిన తరువాతనే అమలు అవుతుంది కాబట్టి, లావాదేవీలను అత్యంత సురక్షితంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంచుతుంది.

            ఒక కొత్త వినియోగదారుడు క్రిప్టో కరెన్సీ లో కి వచ్చాడంటే, ఒక కొత్త రికార్డ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ లో క్రియేట్ అయిందన్నమాట. దానితో పాటే ఒక కొత్త బ్లాక్ క్రియేట్ అవుతుంది. దానిలో ఒక హాష్ పోయింటర్ ఉంటుంది. ఆ తరువాత క్రియేట్ చేయబడే ప్రతీ బ్లాక్ మొదటి బ్లాక్ తో హాష్ పాయింటర్ ద్వారా కనెక్ట్ చేయబడుతూ ఉంటుంది. వీటితో పాటే టైమ్ స్టాంప్, లావాదేవీల సమాచారం కూడా భద్రపరచబడతాయి.

             బ్లాక్ చైన్ టెక్నాలజీ  లో టైమ్ స్టాంప్ అంటే, లావాదేవీల యొక్క కచ్చితత్వాన్ని/ చెల్లుబాటును చూపించేందుకు వాడబడేటటువంటిది. క్రిప్టో కరెన్సీ లో మూడవ వ్యక్తి/సంస్థ ప్రమేయం ఉండకుండా వేరే ఎవరూ చొచ్చుకురాలేని విధంగా రూపొందించబడింది కాబట్టి, క్రిప్టో కరెన్సీలు అన్నీ ప్రూఫ్ ఆఫ్ వర్క్, ప్రూఫ్ ఆఫ్ స్టేక్ వంటి టైమ్ స్టాంప్ స్కీమ్ లను విధిగా వర్తింప చేస్తాయి. వీటికోసం SHA 256, SCRYPT, CryptoNight, SHA-3 మరియు X11 వంటి అల్గారిథం లను వాడతాయి.

డిజిటల్ బ్యాంకింగ్ మరియు క్రిప్టో కరెన్సీ

            చాలామంది భావిస్తున్నట్టుగా డిజిటల్ బ్యాంకింగ్ ప్రక్రియ ద్వారా జరిగే ఆర్థిక లావాదేవీలు,  క్రిప్టో కరెన్సీ లావాదేవీలు రెండూ ఒకటే కావు. వీటి మధ్య చాలా అంతరం ఉంది.

            డిజిటల్ బ్యాంకింగ్ లో ఆర్థిక లావాదేవీలు బ్యాంక్ ద్వారా జరుగుతాయి. వ్యక్తుల మధ్య లేదా సంస్థల మధ్య లేదా ఏ విధంగా అయినా జరిగే లావాదేవీలను సంబంధిత బ్యాంకు/లు పర్యవేక్షిస్తూఉంటాయి. బ్యాంకుల మధ్య జరిగే లావాదేవీలను ప్రభుత్వం/రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. డిజిటల్ లావాదేవీలలో అవసరమయినప్పుడు బ్యాంకు ద్వారానో, ఏటిఎం ద్వారానో డబ్బులు వినియోగదారుడు తీసుకోవచ్చు. అంటే డిజిటల్ లావాదేవీ ఫిజికల్ లావాదేవీగా మారే అవకాశం ఉంది.

            క్రిప్టో కరెన్సీ ద్వారా జరిగే లావాదేవీలలో బ్యాంకులకు గానీ ఏ సంస్థకు గానీ  ప్రభుత్వానికి గానీ ఏ ఒక్కరికీ ఎటువంటి పాత్ర ఉండదు. కేవలం ఏ వ్యక్తులు సంస్థలు ఆ లావాదేవీని జరుపుతున్నారో వారు మాత్రమే పర్యవేక్షించుకుంటారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ లో వారికి సంబంధించిన బ్లాకులు క్రియేట్ అవుతాయి. అవికూడా గోప్యంగా ఉంటాయి. క్రిప్టో కరెన్సీలో ఫిజికల్ కరెన్సీ గా మార్చుకునే వెసులుబాటు ఇప్పటివరకు లేదు అంతా డిజిటలే.. అదికూడా మన దేశానికి చెందిన కరెన్సీ కాదు.. ఏదేశానికి కూడా చెందని ఒక డిజిటల్ / వర్చువల్ కరెన్సీ మాత్రమే.  

క్రిప్టో కరెన్సీ  లాభాలు నష్టాలు

          లాభాలు

  • క్రిప్టో కరెన్సీ ఇద్దరు వ్యక్తుల మధ్య /సంస్థ ల మధ్య ద్రవ్య వినిమయాన్ని అత్యంత సులభతరం, సురక్షితం చేయగలుగుతుంది.
  • ఏ ఇతర సంస్థ కానీ , బ్యాంక్ గానీ, క్రెడిట్ కార్డ్ కంపెనీ వంటి మూడవ పార్టీ ప్రమేయం లేకుండా వ్యక్తుల/ సమాచార గోప్యత తో డబ్బు వినిమయం జరుగుతుంది.
  • ఈ ద్రవ్య వినిమయం పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ ల సహాయంతో ప్రూఫ్ ఆఫ్ వర్క్, ప్రూఫ్ ఆఫ్ స్టేక్ వంటి టైమే స్టాంప్ ల ద్వారా సురక్షితంగా సమయం వృధా అవకుండా జరుగుతుంది.
  • ద్రవ్య బదిలీ అనేది తక్కువ ప్రాసెసింగ్ ఫీజు తో, అతి తక్కువ వ్యవధిలో, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వేసే ఏ ఛార్జీలు లేకుండా జరిగిపోతుంది. 

నష్టాలు :

  • ఇందులో సమాచారం పూర్తి గోప్యత మరియు పాక్షిక గోప్యత అనే రెండు విధాలుగా ఉంటుంది. గోప్యతా ఎక్కువైతే, అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఎక్కువ ఉంటుంది.
  • మనీ లాండరింగ్, పన్ను ఎగవేత వంటి చట్ట వ్యతిరేక చర్యలకు అవకాశం ఎక్కువ. 
  • బిట్ కాయిన్ లో పాక్షిక గోప్యత పాటిస్తారు. బిట్ కాయిన్ లోని రికార్డ్స్ వల్ల గతంలో కొందరు నెరగాళ్లను పట్టుకోవడం కూడా జరిగినది. కానీ, నేరం జరిగే అవకాశం వచ్చింది ఈ క్రిప్టో కరెన్సీ వల్లనే. డ్యాశ్,మోనేరో, జడ్ క్యాష్ వంటి క్రిప్టో కరెన్సీలలో, పూర్తి గోప్యత ఉండటం వల్ల నష్టాలకు దారితీసే అవకాశం ఎక్కువ.
  • సప్లై – డిమాండ్ ఆధారంగా మార్కెట్ ధరల హెచ్చు తగ్గులపై ఆధారపడినందువల్ల, క్రిప్టో కరెన్సీ రేటు ఎప్పుడూ స్థిరంగా ఉండదు.
  • అన్నిటికన్నా ముఖ్యంగా, ఇది పూర్తిగా అంతర్జాలం ఆధారంగా నడుస్తుండటం వల్ల, ఏదో ఒకరోజు ఎవరైనా ఆగంతకులు సమాచార తస్కరణ చేసినా, లేదా సమాచారం నిలవ ఉంచే సర్వర్లు, బెలూన్లు, సూపర్ కంప్యూటర్లు ఏదైనా కారణం చేత మొరాయించినా.. ఈ క్రిప్టో కరెన్సీ సంపద మొత్తం ఒక్క క్షణ కాలంలో హరీమంటుంది.     
  • బిట్ కాయిన్ కు సంబంధించి నడిచే ఆన్ లైన్ ఎక్స్ చేంజీలలో ఎన్నో సార్లు హాకింగ్ జరగడం, సమాచార తస్కరణ జరగడం, కాయిన్ల తస్కరణ వంటివి చోటు చేసుకున్నాయి.

క్రిప్టో కరెన్సీ ప్రపంచ దేశాలు

          ప్రపంచ దేశాలలో  క్రిప్టో కరెన్సీ పై ఒకే రకమైన అభిప్రాయం లేదు. కొన్ని దేశాల ప్రభుత్వాలు క్రిప్టో కరెన్సీని వ్యాపారాలలో మరియు వాడకం లో అనుమతించగా, కొన్ని దేశాలు పూర్తిగా నిషేధించాయి. నిషేధించినవాటిలో అల్జీరియా, బొలీవియా, ఈజిప్ట్, ఇరాక్, మొరాకో, నేపాల్, పాకిస్థాన్ మరియు అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. పాక్షికంగా నిషేధించిన దేశాలలో బంగ్లాదేశ్, చైనా, కువైట్, సౌదీ అరేబియా వంటి దేశాలున్నాయి.

            అమెరికా, కెనడా వంటి దేశాలలో అప్పుడే, బిట్కాయిన్ కుంభకోణాలపై, ICO (ఇనిషియల్  కాయిన్ ఆఫరింగ్స్) లపై సెక్యూరిటీస్ అడ్మినిస్ట్రేటర్స్ తో కమిటీలనుకూడా వేశాయి.

            చైనా సెంట్రల్ బ్యాంక్ 2014 నుండి బిట్ కాయిన్ ను నిషేధించింది. రష్యా లో క్రిప్టో కరెన్సీ చట్టబద్దమే అయినప్పటికీ, ఏ రకమైన కొనుగోళ్లు చేయడానికి వీల్లేదు. కొనుగోళ్లు, అమ్మకాలకు కచ్చితంగా రూబుల్ (రష్యన్ రూపీ) నె వాడాలని నిబంధన ఉంది.  క్రిప్టో కరెన్సీ ని ఉపయోగించి వెనిజువెలా  లో పెట్రో బావులపై అమెరికా గుత్తాధిపత్యానికి రష్యా గండి కొట్టిందనే ఆరోపణలూ ఉన్నాయి.

 క్రిప్టో కరెన్సీ భారత్ విధానం

        క్రిప్టో కరెన్సీ పై మొదటినుండీ భారత్ కొంచెం జాగ్రత్తగానే వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఉండే మార్పులతో ఈ కరెన్సీ విలువ మార్పు చెందడం అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, భారత్ క్రిప్టో కరెన్సీ పట్ల ఆచి తూచి అడుగులేస్తోంది. అయితే, భారత్ బ్లాక్ చైన్ టెక్నాలజీని మాత్రం అనుమతించింది. ఈ టెక్నాలజీని కరెన్సీ బదిలీ అవసరాలకు కాక, ఇతర సర్వోపయోగకర అవసరాలకు వాడుకోవాలనే ఆలోచనలో భారత్ ఉంది.

            మనీ లాండరింగ్, బ్లాక్ మార్కెటింగ్, హవాలా వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఈ కరెన్సీ ఊతమిస్తుందని భారత్ ఆందోళన చెందుతోంది. డిజిటల్ బ్యాంకింగ్ పైన ఇంకా పూర్తిగా  అవగాహన లేని ప్రజలు ఇటువంటి డిజిటల్ కరెన్సీల వల్ల మోసపోతారనే భయాలల్ని భారత్ వ్యక్తీకరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకీ పెరిగిపోతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని భారత్, దీనిపై ఒక బిల్లుని తీసుకురావలనే యోచనలో ఉందని, థాయిలాండ్ దేశం మాదిరిగా తన స్వంత డిజిటల్ కరెన్సీని తేవాలనే ఆలోచనలో ఉందని ఒక ఇంటర్వ్యూ లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.   ఈ విషయం లో ఆర్బిఐ ఇంటర్నల్ గ్రూప్ ఒక మానేటరీ పాలసీ ఫ్రేమ్ వర్క్ కూడా చేస్తోందని ఆర్బిఐ గవర్నర్ చెప్పారు.

ఉపసంహారం :

భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా సంపూర్ణ స్వయం సంచాలిత స్తితికి చేరుకోలేదు. ప్రజలు ఇంకా ఫిజికల్ మనీ నుండి డిజిటల్ మనీకి అలవాటు పడలేదు. దేశంలో చాలా మంది ప్రజలకు ఇంకా ఆర్థిక వ్యవస్థ అంటే ఇప్పటికీ ప్రభుత్వం నుండి రావలసిన సబ్సిడీలు, ప్రోత్సాహకాలు, ధరల తగ్గింపులే.. .. ప్రజలలో ఎక్కువ శాతం మంది రోజువారీ అవసరాలకే సంపాదిస్తున్నవారు తప్ప పెట్టుబడులకై సంపాదిస్తున్నవారు తక్కువ. ఇలాంటి పరిస్తితులలో, సురక్షితంగా ఉండే ఆర్థిక విధానాలవైపే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, క్రిప్టో కరెన్సీ వంటి సాహసోపేత చర్యలకు పూర్తిస్థాయి మద్దతు ఇవ్వవద్దనీ సగటు భారతీయుడు కోరుకోవడంలో తప్పేం లేదు. 

Leave a Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s