స్వాతంత్ర సిద్ధి తరువాత గ్రామీణాభివృద్ధి

తధా కర్మ్యజన ప్రాయా: సుసమృద్ధ కృషీబలా : క్షేత్రోపయోగ భూమధ్యే వసతిగ్రామ సంజ్ఞాతా : — మార్కండేయ పురాణం 49వ అధ్యాయం, 47వ శ్లోకం.

గ్రామం అంటే, ఎక్కడైతే చేతి వృత్తులవారు, కర్షకులు, కార్మికులు జీవిస్తూ ఉంటారో, ఎవరి సంపదైతే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుందో, ఎక్కడైతే చుట్టూ వ్యవసాయార్హత గలిగిన భూములుంటాయో ఆ ప్రదేశాన్ని గ్రామం అంటారు. —

భవేతక్త్రోశాత్మకో గ్రామో రూప్యకర్ష సహస్రక:

గ్రామార్ధకం పల్లి సంజ్ఞాం పల్యర్ర్ధ కుంభ సంజ్ఞకం — శుక్రనీతి సారం 1వ అధ్యాయం, 192 వ శ్లోకం.

గ్రామం అంటే కనీస వైశాల్యం ఒక క్రోసు (2250 చదరపు గజాలు) కలిగి 1000 వెండి క్రాశాల ఆదాయం ఇచ్చే భూమిని గ్రామ అనీ, దానిలో సగం ఉన్నదానిని పల్లి అని , పల్లి లో సగ భాగాన్ని కుంభ అని పిలుస్తారు.

భారత దేశం ఆత్మ పల్లెటూళ్ళలో ఉంది – మహాత్మా గాంధీ

ఊళ్ళోకి వస్తూ ఉంటే కనపడే పచ్చని పంట పొలాలు, పొలాలకు పారుతున్న నీటి గలగలలు, అద్దం వంటి ఊరి చెరువు, ధాన్యపు బస్తాలను తీసుకెళ్తున్న బండి, ఎద్దుల మెడలల్లో కట్టిన చిరుగంటల సవ్వడి, ప్రతీ ఇంటి ముందు కళ్ళాపి చల్లి అలికి ముగ్గులేసిన వాకిళ్ళు,  వడ్రంగి ఇంటిముందు సిద్ధంగా ఉంచిన నాగళ్ళు, బండి చక్రాలు, కమ్మరి కొలిమిలో తయారవుతున్న నాగలి కొర్రు, కొలిమికి దగ్గరగా రాకుండా ఓ పక్కగా దారిమీద మేకల మందను తోలుకెళ్తున్న పిల్ల గొల్ల కాపరి, కుండల దొంతరనే ప్రహరీ గోడ లాగా పేర్చిన కుమ్మరి ఇల్లు, రంగు రంగుల దారాలు అన్నీ వరుసగా కట్టబడి అందమైన చీరకు ముందు మాటలా ఉన్న నేతన్న ఇల్లు…… రచ్చబండ దగ్గర పెద్ద మర్రి చెట్టు, చెట్టుకొమ్మకు కట్టబడ్డ తాళ్ల ఊయల….. ఇరుకిరుకు దారులు, విశాలమైన మనసులు, అచ్చమైన అమాయకులు, స్వచ్చమైన మనుషులు…….ఒకప్పుడు పల్లెటూరు అంటేనే ఒక అందమైన రంగుల చిత్రం…..

  • ప్రాచీన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ – పెనుమార్పులు

బ్రిటిష్ పరిపాలన కంటే ముందు అంటే ఇస్లాం పాలకుల సమయంలో, చోళుల పరిపాలనా కాలంలో  కూడా గ్రామ పంచాయతీ వ్యవస్థ, న్యాయ పంచాయతీ వ్యవస్థ, గ్రామీణ వృత్తులకు సంబంధించిన పెద్దల వ్యవస్థ ఏర్పడి ఉండేది.  గ్రామంలో అన్ని విధాల సమస్యలకు ఈ వ్యవస్థల వద్ద సుమారుగా పరిష్కారం దొరికేది.  ఆ సమయంలో ప్రతీ గ్రామం ఒక ప్రత్యేక వ్యవస్థ గా విరాజిల్లుతుండేది. రాజులు గ్రామ వ్యవస్థల్లో జోక్యం చేసుకునేవాళ్ళు కాదు. అటువంటి స్వతంత్ర గ్రామీణ వ్యవస్థ నిర్మాణం కావాలని గాంధీజీ కూడా స్వాతంత్ర్యానంతరం చెప్పారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, ఇక రావాల్సింది గ్రామ స్వరాజ్యమే అన్నారు గాంధీజీ.  అరవింద మహర్షి కూడా అసలు దేశం పరిపాలన గ్రామ పంచాయితీ వ్యవస్థ నుండి ప్రారంభం కావాలని అంటే వ్యవస్థ అట్టడుగు స్థాయి నుండి పైకి వికసించాలని అని చెప్పారు.  

గ్రామాలలోని అన్ని వృత్తులవారు ఒకరికి ఒకరు పరస్పర పూరకంగా పనులు చేసుకుంటూ ఉన్నంత కాలం, గ్రామాలలో పెద్దగా ఆర్థిక అసమానతలు, వలసలూ ఉన్నట్టు ఎక్కడా మనం చరిత్రలో చదవలేదు. ప్రతీ గ్రామం ఒక స్వతంత్ర ఆర్థిక వ్యవస్థ గా పరిఢవిల్లేది. వస్తుమార్పిడి ఆర్థిక వ్యవస్థ వల్ల పెద్దగా ఆర్థిక అంతరాలు లేని సమయం లో, నిర్బంధ ద్రవ్య వినిమయ ఆర్థిక వ్యవస్థ ను బ్రిటీషు వారు ప్రవేశ పెట్టడం తో స్వతంత్ర గ్రామ ఆర్థిక వ్యవస్థలు పతనమవడానికి బీజాలు పడ్డాయి. 

            వస్తు మార్పిడి ఆధారిత స్వయం సంచాలిత గ్రామీణ ఆర్థిక, సామాజిక వ్యవస్థ లో పెను మార్పులకు కారణమయిన విషయాలు ప్రధానంగా వర్గీకరించి చూస్తే రెండు అంశాలు కనబడతాయి. ఒకటి కాన్వెంట్ విద్య, రెండవది అల్లోపతీ వైద్యం. ఎప్పుడైతే భారత దేశపు ఆధునిక మానవ జీవనం లో పై రెండింటికీ పెద్ద పీటవేస్తూ కార్యకలాపాలు సాగాయో, అప్పటినుండి ఆర్థిక అంతరాలలో విద్యా, వైద్యం కూడా ప్రధాన భూమిక పోషించడం ఆరంభమయింది. బ్రిటీషు పరాయి పాలనలో కేవలం తమ మాటకు లోబడి పనిచేసే జమీందార్ల, జాగీర్దార్ల ప్రాంతాలలో మాత్రమే రైల్వే స్టేషన్లు, ఆస్పత్రులు, పాఠశాలలు ఏర్పరచడం వల్ల, ఒకేసారి పెద్ద ఎత్తున కరువులూ, అంటు వ్యాధులు పెరిగినప్పుడు, వ్యవసాయం లేక, పనుల కోసం పట్నాలకు వలసలు ప్రారంభమయ్యాయి.  ఎప్పుడైతే వలసలు ప్రారంభమయ్యాయో, అప్పుడే అందమైన గ్రామీణ ముఖచిత్రం మెల్లగా బీటలువారడం ప్రారంభమయ్యింది. 

            గ్రామీణ ఆర్థిక వ్యవస్థ లో కుంగుబాటు ప్రధానంగా 18వ శతాబ్దిలో ప్రారంభమై,  19వ శతాబ్దంలో పెరిగి, 20వ శతాబ్ది వచ్చేసరికి తిరిగి బాగుపరచలేని స్థితికి చేరుకుంది. బ్రిటీషు పరిపాలన వల్ల అసమతౌల్య అభివృద్ధి ఊడలు దిగి గ్రామాలను కోలుకోలేని దెబ్బతీసింది.

సంవత్సరంమొత్తం జనాభాగ్రామీణ జనాభాశాతంపట్టణ జనాభాశాతం
190123,83,96,32721,25,44,45489.212,58,51,87310.79
1951    36,10,88,09298,644,38182.7062,443,70917.30
2001    1,02,87,37,43674,24,90,63972.1728,61,19,68927.83
2021(అంచనా)1,36,63,76,05089,53,86,22665.3547,09,89,82434.65
భారత దేశ జనాభా

1901 నుండి 1951 వరకు పట్టణీకరణ శాతం కేవలం 6.5% మాత్రమే, అదే 1951 నుండి 2021 వరకు 17.35% శాతం పట్టణీకరణ జరిగింది. దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం బ్రిటీషు వారి కాలం లో జరిగిన అసమతుల్య అభివృద్ధి మరీ ముఖ్యంగా గ్రామాల పట్ల వివక్ష ఇప్పటికీ ఇంకా ఎక్కువ మొత్తం లో కొనసాగుతుండటమే… పట్టణీకరణ జనాభా శాతం పెరగడం అంటే కేవలం గ్రామాలు పట్టణాలుగా మారడం అని మాత్రమే కాదు, ఉపాధి లేక, గ్రామాల వనరుల పట్ల నమ్మకం సన్నగిల్లి పట్టణాలకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న వలస పక్షుల జనాభా పెరుగుతుండటం.

  • 1951 లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గ్రామీణాభివృద్ధి & వ్యవసాయ రంగాలకు కలిపి కేటాయించబడిన బడ్జెట్ 32 కోట్లు (11.4%) కు, 2021 లో ఇవే రంగాలకు కేటాయించబడిన బడ్జెట్ 3,26,164 కోట్లు (9.3%).
  • ఈ సంఖ్యలు దేశం లో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నిర్ణయాలు తీసుకునే పాలకులు మరియు అధికారులలో వ్యవసాయ & గ్రామీణాభివృద్ధి రంగాల పట్ల ఉన్న ప్రాధాన్యతను పట్టి చూపిస్తుంది కానీ క్షేత్ర స్థాయిలో కనబడుతున్న నిజాలు వేరుగా ఉన్నాయి. స్వయం సంచాలిత ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న గ్రామాలను బ్రిటిష్ వారు నాశనం చేస్తే, స్వతంత్ర భారత ప్రభుత్వాలు మొన్న మొన్నటిదాకా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరులూదే ప్రయత్నాలు అరకొరగా చేస్తూనే వచ్చాయి.

ఈరోజుకీ ఎన్నో గ్రామాల్లో మురుగు కాలవలు, వీధి దీపాలు, వైద్యశాలలు వంటి కనీస సదుపాయాలు సమగ్ర రీతి లో కల్పించబడలేదు కానీ దాదాపు 98% గ్రామాలకు ఏదో విధమైన రోడ్డు సౌకర్యం, విద్యుత్తు, త్రాగునీరు మరియు ప్రాథమిక విద్య మాత్రం కల్పించబడ్డాయి. కల్పించబడ్డ సౌకర్యాలలో నాణ్యత కూడా తక్కువే. ఇవన్నీ గ్రామీణాభివృద్ధి లో లోపించిన చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తున్నాయి.

            పారిశ్రామిక విప్లవం ఫలితాలు పూర్తిగా అందకుండానే, సమాచార సాంకేతిక విప్లవం గ్రామాలను ముంచెత్తి వేయటం వలన ఎన్నోరకాల ప్రాచీన కళలు, చేతి వృత్తులు, జీవనోపాధులు గ్రామాల్లోనుండి మాయమైపోయాయి. చేతివృత్తులకు ఆదరణ తగ్గిపోయి సంపాదన శూన్యమవడంతో, అన్నీ రకాల సామాజిక వృత్తులవాళ్లు కూడా వ్యవసాయం వైపే మొగ్గు చూపారు. ఫలితంగా కమతాల పరిమాణం బాగా తగ్గిపోయింది…. దానివల్ల దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోయింది.  కేవలం  కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన సాగు నీటి సౌకర్యాలు, మార్కెటింగ్ అవకాశాలు, నిత్యమూ పలకరిస్తున్న కరువు కాటకాల లాంటివి పల్లె జనాన్ని పట్నపు బాట పట్టిస్తున్నాయి. 

1951 నుండి ప్రధానంగా అమలు చేయబడిన గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు

  • 1952 వ సంవత్సరం నుండి అమలు చేయబడిన కమ్యునిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం. గ్రామీణ ప్రాంతాల్లో మొదటి దశలో ముఖ్యంగా బ్లాక్ కేంద్రాల్లో, రెవెన్యూ సర్కల్ కేంద్రాల్లో  విద్యా, వైద్యం, పారిశుధ్యం, త్రాగునీరు వంటి నిత్యావసరాలను అభివృద్ధి పరచేందుకు ఉద్దేశ్యించినదీ కార్యక్రమం. ప్రజల మనస్సులలో జీవన ప్రమాణాల అభివృద్ధి కి అంకురం వేయడం.  వ్యవసాయ మరియు ఆహార ప్రమాణాలను వృద్ధి చేయడం వంటివి లక్ష్యంగా పెట్టుకున్నారు.
  • 1956 లోఇంటెన్సివ్ వ్యవసాయ జిల్లాల కార్యక్రమాన్ని ఏర్పరచారు.
  • ఖాదీ విలేజ్ & ఇండస్ట్రీస్ ప్రోగ్రాం
  • యునిసెఫ్ మద్దతు తో న్యూట్రిషనిస్ ఫుడ్ కార్యక్రమం
  • 60 వ దశకంలో ప్రవేశపెట్టబడిన హరిత విప్లవం దేశంలో వ్యవసాయ స్వావలంబన ను సాధించడం లో చాలా వరకు సఫలమైనప్పటికీ, వ్యవసాయం లో పెట్టుబడి ఖర్చును చాలా పెంచేసింది.   జమీందారీ చట్టాల రద్దు వంటివి కూడా కొంత వరకు గ్రామీణ పేదలకు  స్వావలంబన కల్పించింది.
  • కనీస అవసరాల కార్యక్రమం (ఎం‌ఎన్‌పి)
  • కరవు పీడిత ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం (డి‌పి‌ఏ‌పి)
  • గరీబీ హఠావో నినాదం కింద తీసుకున్న గ్రామీణ ఉద్యోగితా పథకం
  • గ్రామీణ యువత స్వయం ఉపాధి కోసం ట్రైజమ్
  • డెసర్ట్ డెవెలప్ మెంట్ ప్రోగ్రాం (డి‌డి‌పి)
  • అంత్యోదయ కార్యక్రమం.
  • సమీకృత గ్రామీణాభివృద్ధి కార్యక్రమం (ఐ‌ఆర్‌డి‌పి)
  • మహిళా & శిశు అభివృద్ధి కార్యక్రమం (DWACRA)
  • జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం (ఎన్‌ఆర్‌ఈ‌పి)
  • జవహర్ రోజ్ గార్ యోజన
  • ఇందిరా ఆవాస్ యోజన
  • కమ్యూనిటీ వెల్స్ కార్యక్రమం
  • పౌర సరఫరాల బలోపేతం
  • ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన
  • స్వర్ణజయంతి రోజ్ గార్ యోజన
  • మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం
  •  స్వచ్చ భారత్ మిషన్  
  • వ్యవసాయం తగ్గుముఖం పడుతున్నా పట్టించుకోని ప్రభుత్వాలు

దేశ జీడీపీ లో వ్యవసాయ మరియు అనుబంధ రంగాల వాటా 2019-20 లో 21.82% మాత్రమే. దాదాపు 65% మంది గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ 21.82% ఆదాయం మాత్రమే  ఆధారం అవుతున్న విషయం మనమంతా ఆలోచించాలి.

ప్రధానంగా వ్యవసాయ సంబంధిత రంగాలలో ఉత్పాదన పెరిగినప్పటికీ, ఉత్పాదకత పెరగకపోవడం, ఉత్పాదనకు సరైన ధర లభించకపోవడం, లభించినా అందులో విపరీతమైన జాప్యం జరగడం, ఉత్పత్తికి ధర నిర్ణయించడంలో రైతాంగానికి ఎటువంటి పాత్ర లేకపోవడం, బహిరంగ విపణిలో ధరలను నిర్ణయించడంలో రైతాంగం నిర్లిప్తత, అనైక్యత  వంటివన్నీ అన్నదాతలను తీవ్రమైన నైరాశ్యం లోకి నెట్టేశాయి. అంతేకాక నవీన వ్యవసాయ పద్ధతులకు మళ్ళకుండా అడ్డుకుంటున్నాయి.  

       హరిత విప్లవం పేరుతో పెరిగిపోయిన రసాయన ఎరువుల వాడకం, ఆధునిక జీవన సరళి గ్రామీణ వ్యవస్థలో తీసుకొచ్చిన పెను మార్పులు, ఉమ్మడి కుటుంబాల విఘటనం తద్వారా, కమతాల పరిమాణం తగ్గిపోవడం, సాగునీటి సౌకర్యాల కల్పనలో ప్రభుత్వాలు విఫలమవడం, రైతులు స్వంత బోర్లు వేయించుకుని నీటి పారుదల కోసం ప్రయత్నాలు చేయడం, ఎకరానికి అవసరమైన సగటు పెట్టుబడి విపరీతంగా పెరిగిపోవడం, వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో యంత్రాలు పెద్ద ఎత్తున ప్రవేశించడం, నైపుణ్యం లేని నిరుద్యోగుల సంఖ్య పెరిగి పోవడం, పెట్టిన ఖర్చుకు సమానగా కూడా వ్యవసాయం లో దిగుబడి రాకపోవడం, పైగా చాలా సందర్భాలలో మద్ధతు ధర లభించక పోవడం, వ్యవసాయాన్ని దండగగా భావించే వ్యక్తుల సంఖ్యను పెంచింది. గ్రామీణ ప్రజలు వ్యవసాయానికి దూరం కావడం ప్రారంభమయింది.  ఫలితంగా వలసలు మొదలయ్యాయి.

       నూతన వ్యవసాయ చట్టాలు రాకముందు వరకు ఇలాంటి పరిస్తితులు దేశమంతా కళ్ళముందు కదలాడేవి. నూతన వ్యవసాయ చట్టాలు ఇకముందు దేశ రైతులను ఏ తీరాలకు చేరుస్తాయో వేచి చూడాలి. 

  • చిత్రకూట్ ఉద్యమం – అన్ని రాష్ట్రాలకు దిక్సూచి 

గ్రామీణ భారత దేశానికి అవసరమైన విధానం స్వదేశీ పరిశ్రమలు, స్వదేశీ విధానాలు మరియు అధికార వికేంద్రీకరణ. అంతే తప్ప విదేశీ భావజాల మార్గాలు కావు.

– శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ.

దేశం లో అందరూ పేదరికం నిర్మూలన గూర్చి, గ్రామీణుల జీవన వికాసం గూర్చి గరీబీ హఠావో అనే మాటలు మాత్రమే  మాట్లాడుతుంటే, గ్రామీణాభివృద్ధిని కార్యరూపం లోకి తీసుకొచ్చిన ఘనత మాన్యులు శ్రీ నానాజీ దేశ్ ముఖ్ గారిదే

గ్రామీణ జీవనం వ్యవసాయం మరియు అనుబంధ రంగాలతో ముడి వేసుకుని ఉంటుంది కాబట్టి, వ్యవసాయ సంబంధిత అంశాలలో గ్రామాలను బలోపేతం చేయడం మరియు సుస్థిర ఆదాయమార్గాలను గ్రామీణులకు అందించడం అనే లక్ష్యాలతో చిత్రకూట్ ఉద్యమాన్ని ప్రారంభించారుమొదలు 1979-80 వ సంవత్సరం లో మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని చిత్రకూట్ ప్రాంతంలో 80 గ్రామాలను లక్ష్యంగా చేసుకుని, సుస్థిర గ్రామీణాభివృద్ధి సాధించేందుకు చెక్ డ్యాములు కట్టి నీళ్ళు నిల్వ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు నానాజీ దేశ్ ముఖ్.  అత్యల్ప సమయంలోనే ఇది ఎందరినో ఆకర్షించింది. ఇటువంటి కార్యక్రమమే శ్రీ అన్నా హజారే కూడా రాలేగావ్ సిద్ధి లో ప్రారంభించారు.

  • చిత్రకూట్ క్యాంపెయిన్ అంశాలు.
  • చెక్ డ్యాములు నిర్మాణం:  నీటి పరీవాహక మార్గం లో చెక్ డ్యాములు నిర్మించి నీటిని నిల్వ చేయడం ద్వారా పరిసర ప్రాంతాలలోని  సంప్రదాయ వ్యవసాయ బావులలో, బోర్లలో భూగర్భజల రీ చార్జ్ జరగడం.
  • పొలాలలో ఉత్పాదకత పెంచడం:  కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తల సహాయంతో తక్కువ ఉత్పాదకత ఉన్న కమతాల నుండి ఎక్కువ ఉత్పాదకత వచ్చేలాగా చర్యలు తీసుకోవడం. రసాయన ఎరువులకోసం ఎక్కువ ఖర్చు చేయకుండా, తక్కువ ఖర్చుతో సస్యరక్షణ పద్ధతులు చేపట్టి ఎక్కువ దిగుబడి వచ్చేలా రైతులను చైతన్య పరచడం.  తద్వారా స్వయం సమృద్ధి వైపు సాగడం.
  • పట్టణాలు పల్లెల మధ్య పరస్పరాధారిత వ్యవస్థను నెలకొల్పడం: పల్లెల్లో జరిగిన ఉత్పత్తులకు మార్కెటింగ్ కోసం పట్టణాల మీద ఆధారపడటం, అదే సమయం లో పట్టణాలకు మౌలిక  అవసరాలైన కూరగాయలు, పాలు, పళ్ళు, ఇతర ఆహార సంబంధిత వస్తువులకై పల్లెలపై ఆధారపడేలా చూడటం.
  • పశుగణాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టడం: వ్యవసాయానికి మరియు ఇతర అనుబంధ రంగాలకు కీలకమయినది పశుగణాభివృద్ధి. పశువుల పెంపకానికి అవసరమైన అవగాహన కార్యక్రమాలు ఏర్పరచడం, వాటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను వెటేరినరీ డాక్టర్ల సహాయంతో అందరికీ తెలియ చేయడం.
  • చేతివృత్తులవారికి అవసరమైన ఆసరా అందించడం: వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన చేతి వృత్తులవారికి బ్యాంకుల ద్వారా రుణాలు అందించి వారి జీవనోపాధికి చేయూతనివ్వడం. ఆయా రంగాలలో వారు నిలదొక్కుకునేలా పంచాయతీల ద్వారా సహాయం చేయడం.
  • గ్రామోదయ ప్రాజెక్ట్ : గోండా జిల్లా

        ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాలో 1977వ సంవత్సరం లో, శ్రీ నానాజీ దేశ్ ముఖ్ ఆలోచనలతో దీన దయాళ్ రీసెచ్ ఇన్స్టిట్యూట్  గ్రామోదయ ప్రాజెక్ట్ ప్రారంభించింది. ముందుగా ఆర్థిక స్వావలంబనను, ఆరోగ్యాన్ని, విద్యా వసతులను కల్పించడం ద్వారా గోండా జిల్లా ప్రజలలో చైతన్యాన్ని పెంచాలనే లక్ష్యంతో,  సాగు నీటి సౌకర్యాలను మెరుగు పరచేందుకు జిల్లా వ్యాప్తంగా 20 వేల గొట్టపు బావులకోసం ప్రణాళికలు రూపొందించి,కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ద్వారా బోర్ వేల్స్ ను వేయించి వ్యవసాయానికి ఊతమివ్వడం జరిగింది.సాగునీటి సౌకర్యం మెరుగు పడగానే వ్యవసాయం ఊపందుకుంది. ప్రతీ చేతికి పని పేరుతో, పెద్ద ఎత్తున గ్రామీణ చేతి వృత్తులను ప్రోత్సహించి పాక్షిక నిరుద్యోగితను తగ్గించడం జరిగింది. పాడి పశువులను పెంచడం ద్వారా పాల ఉత్పత్తి మరియు వ్యాపారాన్ని ప్రోత్సహించి 100 పాల సహకార సంఘాలను ఏర్పరచడం జరిగింది మరియు ఫైజాబాద్ డైరీ కి అనుసంధానించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ గోండా జిల్లా నుండి వలసలను పెద్ద ఎత్తున అరికట్టడం జరిగింది.

  • పల్లెల్లో అవసరాలే ఆవిష్కర్తలు

       ఒక అన్నా హజారే, ఒక సుందర్ లాల్ బహుగుణ, ఒక  పోపట్ రావ్ పవార్ వంటి వారు గ్రామాల అవసరాలే లక్ష్యంగా కొత్త పద్ధతులను ముఖ్యంగా పార్టీసిపేటరీ అప్రోచ్ (అందరి భాగస్వామ్యం) అనే విధానాన్ని పరిచయం చేసి గ్రామాలలో ఐక్యతే ఆధారంగా ఉండే అభివృద్ధి మార్గాలను ఆవిష్కరించారు. 

       గ్రామీణుల వృత్తుల వల్ల, వారి జీవనోపాధి మార్గాల వల్ల సరైన ఆదాయం లభించాలంటే, బహిరంగ విపణికి, గ్రామీణ ప్రజలకు మధ్య ప్రభుత్వమే వారధిగా మారాలి. వ్యవసాయము, అనుబంధరంగాల్లో వస్తున్న నూతన ఒరవడులను, సాంకేతికతను అందుపుచ్చుకునేటటువంటి శిక్షణ గ్రామీణ యువతకు కరవైంది. ప్రత్యామ్నాయ మార్గాలు, నూతన పద్ధతుల ఆవిష్కరణలకు ఊతమిచ్చే వ్యవస్థను నిర్మించవలసిన అవసరం ఉంది. ఉదాహరణకు ట్రాక్టర్ తో పొలం దున్నడం ఖరీదైన వ్యవహారంగా మారుతుందనుకుంటే, డీజిల్ ఖర్చులేకుండా. కేవలం ఒకటి రెండు సాధనాలు సైకిలుకి అమర్చి. సైకిల్ తొక్కడం ద్వారా పొలాన్ని దున్నగలిగే ఆవిష్కరణలకు ప్రచారం లభిస్తే, మరిన్ని రోటరీ వీడర్ లాంటి గ్రామీణ ఆవిష్కరణలు వ్యవసాయాన్ని గ్రామీణ జీవనాన్ని ఆకర్షణీయంగా మారుస్తాయి. ఆసుపోసే యంత్రం కూడా ఇలాంటి పరిస్తితుల నుండే ఆవిష్కరణకు నోచుకుంది. తద్వారా నేత కార్మికుల కష్టాలను ఎంతగానో తీర్చింది.

  • ఆదుకోని ప్రభుత్వ పథకాలు

          ప్రభుత్వం ‘’ట్రైజమ్” వంటి ఎన్నో రకాల పథకాలు ప్రారంభించినా వాటి ఫలాలు సంపూర్ణంగా లబ్దిదారులకు అందకపోవడం వల్ల, మధ్యవర్తుల ద్వారా అనర్హులు లబ్ది పొందటం వంటి కారణాల వల్ల ప్రజలు క్రమేణా ప్రభుత్వ పథకాలను నమ్మడం తగ్గించారు. ఒకవేళ ఏదైనా బ్యాంకు లింకేజీ తీస్కున్నా, ఆ రుణాలను ఏ విధంగా ఎగ వేయవచ్చో అనే మార్గాలు వెతకడం ప్రారంభమయ్యింది. అంతేకాక ఎన్నికల వేళ ప్రభుత్వాలు ఋణ మాఫీలు ప్రకటించే సంస్కృతి ప్రారంభం కావడం వల్ల, మెల్ల మెల్లగా బ్యాంకులు కూడా ప్రయారిటీ లెండింగ్ కు దూరమవుతూ వచ్చాయి. సగటు బ్యాంకు ఉద్యోగి ప్రయారిటీ లెండింగ్ ను, నిరర్ధక ఆస్థి గానే భావించే పరిస్తితులు ఉత్పన్నమయ్యాయి.      

  • స్వయం సహాయక బృందాలు – పొదుపు విప్లవం.

            1980వ దశకం తొలినాళ్లలో ప్రారంభించబడ్డ మహిళా & శిశు అభివృద్ధి కార్యక్రమం (DWACRA) 1990 వ దశకంలో దక్షిణ భారత దేశం లో అతిపెద్ద విజయం సాధించింది. ప్రధానంగా గ్రామీణ మహిళలను చిన్న మొత్తాల పొదుపు వైపు ప్రోత్సహించి, ఆర్టిక స్వావలంబన వైపు తీసుకెళ్ళే ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంత ప్రజలను వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాలనుండి విడిపించింది. అంతేకాక గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టడం లో అపూర్వమైన విజయం సాధించింది. ప్రస్తుత పరిస్తితుల్లో వాణిజ్య బ్యాంకులలో అత్యధిక రికవరీ రేటు (99.6%) ఉన్న ఏకైక లబ్దిదారుల వ్యవస్థ స్వయం సహాయక బృందాలవారే.    

  • ఉపాధి హామీ పథకమే దిక్కు

            నిత్యం కరవు పలకరిస్తున్నప్పుడు, ఏదో ఒక విధంగా ప్రజలకు తాత్కాలిక లబ్ది చేకూర్చాలనే ప్రయత్నాలే తప్ప, ఒక శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయలేక పోయాయి. ఎన్నోరకాల ప్రయోగాల తరువాత, మహారాష్ట్ర ప్రభుత్వం 70వ దశకం లో అమలు పరచిన పథకానికి మరికొన్ని మెరుగులు దిద్ది జాతీయ ఉపాధి హామీ పథకం 2006 లో ప్రారంభించారు. ఉపాధి హామీకి నేపథ్యం ఒకవైపు నిరంతర కరవు, మరోవైపు ఇబ్బడి ముబ్బడి గా పెరిగిపోతున్న పాక్షిక నిరుద్యోగిత. ఈ పథకం చాలావరకు పట్నాలకు వచ్చే వలసలను ఆపగలిగింది. ఉన్న ఊళ్లోనే గౌరవంగా బతకగలిగే అవకాశాన్ని కల్పించింది. కానీ,కూలీలకు ఇవ్వాల్సిన కనీస వేతనం పెరగడంవల్ల, వ్యవసాయదారుల పెట్టుబడి ఖర్చును ఈ పథకం అమాంతంగా పెంచేసింది.

                                    ఉపాధి హామీ పథకం లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అకౌంట్లలోకి డబ్బులు రావడం, స్త్రీ పురుషులిద్దరికీ సమాన వేతనం ఇవ్వడం వల్ల గ్రామీణ కూలీ కుటుంబాల కొనుగోలు సామర్థ్యం కూడా పెరిగింది. నేరుగా కూలీల అకౌంట్లలో డబ్బులు జమ చేయడం వల్ల మల్టీ నేషనల్ కంపెనీలు గ్రామీణ ప్రాంతాలలో తమ ఉత్పత్తులను ఎక్కువగా అమ్ముకోవడానికి కూడా ఈ పథకం పనికి వచ్చింది.

  • అసలైన అభివృద్ధి గ్రామీణాభివృద్ధే

            అసలు గ్రామాలను అభివృద్ధి చేయడం అంటే ఏమిటి…? గ్రామాలను గ్రామాలలాగే అభివృద్ధి చేయడమా…? గ్రామాలను పట్టణాలలాగా అభివృద్ధి చేయడమా…? పట్టణాలలాగా అభివృద్ధి చేస్తే, మరి మూలాధారమైన వ్యవసాయమూ, వృత్తులు అన్నీ ఏమైపోతాయి…? మరి గ్రామాలలాగే ఉండిపోతే వారి అవసరాలను అర్థం చేసుకుని సదుపాయాలను కల్పించడం ఎలా…?

            దేశ జి‌డి‌పి లో ప్రాథమిక రంగం పూర్తిగా తగ్గిపోయిందని అన్నీ రకాల నివేదికలూ వేలెత్తి చూపిస్తున్న ప్రస్తుత తరుణంలో, వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు ఊతం ఇచ్చే కార్యక్రమాలను, ఆర్థిక, సామాజిక స్వావలంబన కలిగించే కార్యక్రమాలను, గ్రామీణుల అవసరాలకు తగ్గట్టుగా గ్రామీణాభివృద్ధి పథకాలను రూపొందించడం ప్రస్తుత ప్రధానమయిన అవసరం.

  • ఎన్నో రకాలైన పథకాలను ప్రవేశ పెడుతున్నప్పటికీ, ప్రభుత్వ విభాగాల నడుమ సహకారం కొరవడటం వల్ల, ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటూంది. ఒక ప్రభుత్వ విభాగం వల్ల జరిగిన అభివృద్ధిని మరొక విభాగం వారు కొనసాగించగలిగే ప్రణాళికలు రూపొందించడం.
  • వ్యవసాయ సంబంధిత/ గ్రామీణ వృత్తుల సంబంధిత పరిశ్రమలను ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున స్థాపించేలా ప్రైవేటు/కార్పొరేట్లను ప్రోత్సహించడం.
  • పట్టణ కేంద్రీకృత అభివృద్ధి నమూనా నుండి ఈ మధ్యే ఎన్‌డి‌ఏ ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామ కేంద్రీకృత అభివృద్ధి నమూనా ప్రారంభమయ్యింది. ఈ రకమైన అభివృద్ది నమూనా ను సుస్థిర పరచడం.
  • పంచాయతీ రాజ్ వ్యవస్థను ఈ మధ్య కొన్ని రాష్ట్రాలు బలోపేతం చేసుకున్నాయి. అన్ని రాష్ట్రాలలో పంచాయతీ రాజ్ వ్యవస్థ కిందకు వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి రంగాలను చేర్చి సమగ్ర అభివృద్ధికి బాటలు వేయడం.
  • గ్రామీణ ప్రాంతాలకు తరలే బ్యాంకులకు, కమర్షియల్ ఇండస్ట్రీలకు ప్రత్యేక రాయితీలిచ్చి ప్రోత్సహించడం తద్వారా గ్రామీణ ప్రాంతాలలో అందించ గలిగె సదుపాయాలను మరింత బలోపేతం చేయడం.           
  • గ్రామో రక్షతి రక్షితః

            సాధారణం గా నగరవాసుల జీవన శైలి ప్రభావం గ్రామీణులపై ఉంటుంది. పల్లీయులు తమ జీవన వృత్తులు తక్కువ స్థాయివేమో అని భ్రమిస్తూ, ఆత్మన్యూనత తో ఉంటారు. ఈ భావన పోవాలంటే, నగరాలలో ఉండే అధిక ఆర్థిక స్థాయి వారిని పెద్ద మొత్తం లో పల్లెటూర్లకు కదిలించేలా, వారిని గ్రామీణ వృత్తులు అవలంబించేలా/చేపట్టేలా ఉద్యమం నడపాలి. ఇదే జీవన శైలి గా మారాలి. దీనివల్ల గ్రామీణులకు తమ వృత్తులే గొప్పవి అనే భావన స్థిరపడి, ఆ వృత్తుల ద్వారా లాభాలు ఆర్జించే ప్రయత్నాలు చేస్తారు. దానివల్ల గ్రామీణుల ఆత్మ గౌరవం కూడా పెరుగుతుంది. నగర జీవనానికి ఆధారం గ్రామమే అనే భావన విస్తృతం కావాలి. నగరాల సొగసులన్నీ గ్రామాల పుణ్యమే అనే నినాదం, దేశమంతా మారుమోగాలి. గ్రామాలను, గ్రామాలలోని మానవ వనరులను కాపాడుకుంటేనే భారత దేశ నాగరికత, సంస్కృతి  కలకాలం నిలుస్తుందనే విషయం అందరికీ తెలియజేయబడాలి.  గ్రామో రక్షతి రక్షితః:

            దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలవుతున్న ఈ సందర్భం లో జరుపుకుంటున్న అమృతోత్సవాల శుభవేళలో నైనా గ్రామీణ భారతానికి నవ చైతన్యాన్నిచ్చే కార్యక్రమాలను రూపొందించుకుని, గ్రామాలను నవనవోన్మేషంగా మార్చుకునేందుకు కంకణబద్ధులమవుదాం. అందరం గ్రామాలకు తరలుదాం, నవభారతాన్ని గ్రామాలలో సమగ్ర సుందరంగా నిర్మించుకుందాం.  

ఆర్తులకు చేయందించడమే నిజమైన ధర్మం. ఎవరైతే అవసరం లో ఉన్నారో, ఎవరైతే విస్మరించబడ్డారో, వాళ్లందరి సంక్షేమం కోసం, వారందరికీ కనీస అవసరాలు అందేలాగా మనమంతా సేవ చేద్దాం. – శ్రీ గురూజీ. (బంచ్ ఆఫ్  థాట్స్ రెండవ ఎడిషన్ పేజ్ 472) 

Leave a Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s