చుకు చుకు చుకు చుకు
తిరిగెర తిరిగెర జీవన చక్రం
దేశీ బతుకుల సజీవ చిత్రం
|| చుకు చుకు ||
సీటుకోసమే దేవులాటలు
సీటు దొరకక పీకులాటలు
దొరికిన వెంటనే పక్కవాడితో
సర్దుబాటుకై వాదులాటలు
|| చుకు చుకు ||
రణగొణ ధ్వనులు, గడబిడ సడులు
దడ దడ లాడే రైలు అడుగులు
మెతుకుల కోసం పరిగెడు బతుకులు
బతుకుల నిండా అతుకుల గతుకులు
|| చుకు చుకు ||
టిప్పుటాపుగా సూటుబూటుతో
కిటికీ పక్కన సారు ఒక్కడు
చిరిగిన అంగీ మాసిన లుంగీ
సారు పక్కనే కూలీ ఒకడు
ఇద్దరు పిల్లలు చంకన చంటిది
మూడు బ్యాగులతో అలసిన తల్లి
విద్యార్థోకరు, ఉద్యోగొకరు,
పనిలేకొకరు, అరగక ఒకరు
పిల్ల దొరకక, పెళ్లి ఆగిన
ఆశల చూపుల పిల్లోడొకడు
|| చుకు చుకు ||
ఇందరు మనుషులు ఒక చోటున్నా
ఫోనులో మాటలు దొర్లుతు ఉన్నా
తాకుతూ పక్కనే కూర్చుని ఉన్నా
అప నమ్మకమో చులకన భావమో
మనకెందుకనే నిర్లిప్తతనో
మాటలు కలవని దూరాలన్నా
|| చుకు చుకు ||
చిడుతల వంటివి చేతన పట్టి,
టపటప టప టపట్టపాయని
ఆకలి తాళక రూకల కోసం
బుడతడు పాడే సినిమా గేయం...
హృదయం తప్ప అన్నీ ఉండే
సమాజానికి మానని గాయం
|| చుకు చుకు ||
అల్లమొరబ్బా, చిన్న సమోసా,
ఛాయలు, కాఫీ, బొంగుల భేల్ పురి
ఉడికిన పల్లి వేపుడు శనగలు....
భేషజాలతో, అంతస్తులతో
చీలిపోయిన జనాలనంతా
సమాన దృష్టితో చూసే రుచులు...
|| చుకు చుకు ||
ఎంతోమందిని తీసుకు వెళ్తూ,
ఆశల గంపల మోసుకు వెళ్తూ
పచ్చని పొలాల ఎండిన బీడుల,
వాగుల వంకల ఎడారి దారుల
గుట్టల పుట్టల దాటుకు వెళ్తూ
మౌన సాక్షిగా పరుగులెత్తెరా
|| చుకు చుకు ||
చుకు చుకు చుకు చుకు
తిరిగెర తిరిగెర జీవన చక్రం
దేశీ బతుకుల సజీవ చిత్రం.
(ఉగాది సందర్భంగా 2015 లో వ్రాసుకున్న కవిత)
Like this:
Like Loading...
Related
Published by Behind the heartbeats
మనసున్న మనిషిని, సహృదయమున్న కవిని, రచయితను. అన్నిటికీ మించి బాధ్యత ఉన్న పౌరుడిని
View all posts by Behind the heartbeats