75 సం|| భారత ఆర్థిక & దౌత్య చరిత్ర (సంక్షిప్తంగా)

పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతికా…. అంటూ దేశమంతా స్వతంత్ర్య సిద్ధి గూర్చి విజయోత్సవాలు జరుగుతూ ఉంటే, రాబోయే భవిష్యత్తు గూర్చి ప్రజలంతా రంగురంగుల బంగారు కలలను కంటూంటే, కొందరు దేశ నాయకుల ముందు మాత్రం ఎన్నో రకాల ప్రశ్నలు ఉండేవి. దేశాన్ని సమున్నతంగా నిలబెట్టాలంటే, పూర్వ వైభవం సాధించాలంటే, మూలాలను మరచిపోనివ్వకుండా, ఆధునికతను అంది పుచ్చుకుంటూ, ముందుకు సాగవలసిన పరిస్థితుల్లో, స్వతంత్ర భారత్ గా ఆవిష్కరించబడ్డ తరుణంలో ఆనాటి నాయకులకు  ఎదురైన ప్రధాన సవాళ్ళు.

 1. దేశాన్ని ఆర్థికంగా పుంజుకునేలా చేయడం తద్వారా ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు రావడం.
 2. దేశాన్ని రాజకీయంగా బలంగా తయారు చేయడం అంటే శాసనం ద్వారా పనిచేసే సుస్థిర పరిపాలనా వ్యవస్థ ను తయారు చేసుకోవడం .
 3. అంతర్జాతీయ యవనిక పై భారత్ తన పరిస్థితిని మెరుగు పరుచుకోవడం. అవసరమైన రోజు విదేశాలు ఆంక్షలు లేని సహాయాన్ని అందించే స్థితికి ఎదగడం.
స్వాతంత్ర్య సిద్ధి తరువాత, అప్పటి సోవియట్ యూనియన్ ప్రభావం నెహ్రు పై బాగా ఉండటం వల్ల, భారత ప్రభుత్వం, పూర్తి స్థాయి సామ్యవాద విధానమూ కాక, పూర్తి స్థాయి పెట్టుబడిదారు విధానం కాక, కలగూరగంప వంటి విదేశీ పారిశ్రామికీకరణ విధానం ఎంచుకున్నారు. అప్పటి ప్రధాని నెహ్రూకు యూరప్ అమెరికా దేశాలలోని పెట్టుబడిదారుల పట్ల ఉన్న సానుకూలత/ అభిమానం ఇటువంటి విధానాన్ని దేశం లో అమలు పరచేందుకు కారణమయ్యింది. 
ఈ మార్గం ఆశించిన స్థాయిలో దేశానికి మేలు చేయలేకపోయింది. ప్రణాళికా సంఘం మొదటి పంచవర్ష ప్రణాళికను హారర్డ్-డోమర్ నమూనా గా పరిచయం చేసి, ప్రతి ఏడు 3.6% వృద్ధి శాతాన్ని నమోదు చేసినట్టు చూపించింది. 
ద్రవ్యలోటు ను ఉంచుకుని, రెండవ ప్రణాళికలో భారీ పారిశ్రామికీకరణను ప్రతిపాదించింది నెహ్రూ ప్రభుత్వం. మౌలిక వసతులు పూర్తిగా అభివృద్ది చెందకుండానే పారిశ్రామికీకరణ కోసం వెంపర్లాడటం వల్ల అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలలో వచ్చిన పారిశ్రామిక విప్లవ ఫలితాలు భారత దేశంలో సాధ్యం కాలేదు. 
ఎప్పుడైతే ఈ విధానం పూర్తిగా మన దేశానికి పనికి రాదు అని అర్థమయ్యిందో, ఆలోపే కొంత నష్టం జరిగిపోయింది. ఈ లోపే ముంధ్రా స్కామ్ బయటకు వచ్చింది. దీనికి సూత్రధారిగా అప్పటి ఆర్థికమంత్రి కృష్ణమాచారిని చూపించడం జరిగింది. విశేషం ఏమిటంటే, నెహ్రూ అల్లుడు అయిన ఫిరోజ్ గాంధీ ఈ స్కామ్ గూర్చి పార్లమెంట్ లో లేవనెత్తడం. ముంధ్రా స్కామ్, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క డొల్ల నిజాయితీని ప్రజలకు పరిచయం చేసింది. 
ఇటువంటి మార్కెట్ ఆధారిత, కంపెనీ ఆధారిత నష్టాల నుండి దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజలను కాపాడాలంటే స్వదేశీ వ్యవసాయాన్ని, వ్యవసాయాధారిత గ్రామాలను, నీటి పారుదల సౌకర్యాలను అభివృద్ది చేయడం ఒక్కటే మార్గం అని ఎస్‌కే డే, పి‌సి మహలనోబిస్ వంటి వాళ్ళు చెవిలో ఇల్లు కట్టుకుని పోరు పెట్టిన తరువాత గాని అప్పటి భారత ప్రభుత్వ పెద్దల కళ్ళు తెరచుకోలేదు. 

ఆహార ధాన్యాల కొరతను అధిగమించడం కోసం అమెరికా ను ఆశ్రయించింది ఆనాటి భారత్ ప్రభుత్వం. పి‌ఎల్ -480 అనే కార్యక్రమం కింద అమెరికా, భారత్ కు నిబంధనలతో కూడిన సహాయాన్ని అందించింది. నాన్ అలైన్డ్ మూవ్ మెంట్ పేరిట 1955 లో బాండుంగ్ లో జరిగిన సమావేశంలో అమెరికా, రష్యా కూటములలో లేని దేశాలతో కొత్త సంస్థను ప్రారంభించటంలో భారత్ కీలక పాత్ర పోషించటం కూడా అమెరికాకు రుచించలేదు. దీనితో పాకిస్తాన్ ను ప్రేరేపించి SEATO (South East Asian Treaty Organisation) లో చేర్పించింది. అంతేకాక పాకిస్తాన్ తో బాగ్ధాద్ పాక్ట్ పై సంతకం చేయించి పాకిస్తాన్ మిలిటరీకి సహాయాన్ని అందించే ప్రయత్నాలు ప్రారంభం చేసింది. భారత్ పాకిస్తాన్ ల మధ్య పెరిగిన ఈ వైరం, అమెరికా రష్యాలకు తమ యుద్ద సామాగ్రి, ఆయుధాలు, విమానాలు అమ్ముకోవడానికి కొత్త మార్కెట్ ను సృష్టించినట్టు అయ్యింది. 
	ఆర్థికంగా పారతంత్ర్య విధానాలు ఎంచుకోవడమే కాదు, దౌత్య విధానాలలో సైతం అప్పుడే ఏర్పడ్డ ఐక్యరాజ్య సమితి లో వ్యక్తిగత పేరు ప్రతిష్టల కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి దేశానికి ఎంతో నష్టం కలుగచేసే చర్యలు చేపట్టడం జరిగింది. ఒక వైపు పాకిస్తాన్, మరోవైపు చైనా దాడులను ఎదుర్కునేందుకు సమర్థమైన వ్యూహాన్ని ఎంచుకోవడం లో విఫలమై, ఇంకోవైపు దేశ మార్కెట్ ను కబళించాలని అమెరికా చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టడంలో చేతకానితనం తో దేశాన్ని ఎన్నో సంవత్సరాలు వెనక్కి లాగేసే చర్యలు చేపట్టింది ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. చైనా దాడి తర్వాత సోవియట్ యూనియన్ కు మరింత దగ్గరైంది భారత్. ఈ చర్య అమెరికా, బ్రిటన్ లకు కంటగింపు కల్గించింది. 
	అమెరికా పై ఆధారపడటం తగ్గించుకోవాలంటే, ఆహార ధాన్యాల దిగుమతులను తగ్గించుకోవాలి. అలా జరగాలంటే, వ్యవసాయ ఫలాలు వృద్ధి పొందాలంటే, ప్రాథమిక రంగం మీద ఆధార పడ్డ ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే సాగు సౌకర్యాలు పెంచడం ఒక్కటే మార్గం అని సాగునీటి ప్రాజెక్టులను పెద్ద ఎత్తున నిర్మించడం మొదలు పెట్టారు. కనీసం అప్పటినుండైనా స్వదేశీ విధానాల కోసం మనస్ఫూర్తిగా ప్రయత్నించకుండా, విదేశీ రసాయన ఎరువులు తప్పనిసరిగా వాడవల్సిన హరిత విప్లవాన్ని దేశం పై బలవంతంగా రుద్దడం జరిగింది. హరిత విప్లవం లో అధిక దిగుబడులనిచ్చే వంగడాలను వాడాలని, రసాయన ఎరువులు వాడాలని చెప్పిన MS స్వామినాథన్ & నార్మన్ బోర్లాగ్ ప్రస్తుతం వాతావరణానికి హాని చేయని వ్యవసాయం కావాలని ప్రచారం చేస్తుండటం విశేషం. 
అప్పుడప్పుడే ఆర్థిక వ్యవస్థ కుదుట పడుతున్న సమయంలో, చైనా పాకిస్తాన్ దేశాలతో చేసిన యుద్ధాలవల్ల ఆర్థిక స్థితి కుదేలయిపోయింది. రాజకీయంగా కూడా కుదుపులను దేశం అప్పుడే చవిచూసింది. వరుసగా నెహ్రు మరియు లాల్ బహద్దూర్ శాస్త్రీ వంటి పెద్ద నాయకులను కోల్పోవడం కూడా ఎంతో ప్రభావం చూపింది. అంతర్గతంగా దేశంలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చి రాష్ట్రాలలో పాగా వేసి కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలను ఏకరువు పెట్టడం ప్రారంభమయ్యింది. దేశీయంగా చెల్లింపుల సమస్య తలెత్తడంతో, జూన్ 1966 లో రూపాయి విలువను డాలర్ మారకం విలువలో 57% తగ్గింపచేస్తూ ఇందిర నిర్ణయం తీసుకున్నారు. 1966 నుండి 1969 వరకు అమలు చేసిన వార్షిక ప్రణాళికలు పెద్దగా ఫలితాలను ఇవ్వక పోవడంతో, దేశీయంగా మసకబారుతున్న పేరు ప్రతిష్ఠలను కాపాడుకునేందుకు, ముందస్తు ప్రణాళిక లేకుండా ఇందిరాగాంధి ప్రభుత్వం, బ్యాంకులను జాతీయం చేసేసింది. పైగా ఈ నిర్ణయం వల్ల బ్యాంకుల నుండి రైతులు రుణాలు పొందడం సులభతరమవుతుందని ప్రచారం చేశారు. రాజకీయ లబ్ది కోసం ఆర్థిక వ్యవస్థను ఇరుకునపెట్టే నిర్ణయాలు తీసుకోవడం దేశానికి అతి పెద్ద సమస్యగా మారింది. 
హరిత విప్లవం స్ఫూర్తి తో గుజరాత్ లో పాడి పశువుల పెంపకందారుల సహకార సమాఖ్యను ఏర్పరచి పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచిన వ్యక్తి వర్ఘీస్ కురియన్. ప్రస్తుతం ఆ సహకార సమాఖ్య దేశంలో అతి పెద్ద మార్కెట్ లీడర్ గా కొనసాగుతున్నది. ఆ సమాఖ్య పేరు అమూల్. పాడి పశువుల పెంపకందారుల సహకార సమాఖ్య దేశమంతటా వ్యాపించి, ప్రస్తుతం పాల ఉత్పత్తి లో ప్రపంచం లోనే మొదటి స్థానంలో భారత్ నిలబడి ఉంది.   
ప్రధానంగా 70వ దశకంలో, ప్రజల దృష్టి మరల్చేందుకు, ప్రజలు పెట్టుకున్న నమ్మకం సడలిపోకుండా ఉండేందుకు, పేదరికం వల్ల, సామాజిక వ్యర్థ కట్టుబాట్లను కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తుండటం వల్ల పుట్టిన నక్సలిజాన్ని ఎదుర్కునేందుకు, అన్ని మతాలను సమదృష్టితో చూడక పోవడం, ఒకటి రెండు మతాలను నెత్తినెక్కించుకున్న విధానాల వల్ల ప్రజలలో ఏర్పడుతున్న అసహనాన్ని తట్టుకునేందుకు, గరీబీ హఠావో నినాదాన్ని తలకెత్తుకుని ప్రజల ముందుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. 
	బంగ్లా విమోచన లో ప్రధాన పాత్ర పోషించి, మిలిటరీ యుద్ధం గెలిచి, సిమ్లా ఒప్పందాన్ని చేసుకుని దౌత్య యుద్ధంలో ఓడి, 93,000 మంది పాక్ యుద్ధ ఖైదీలను బేషరతుగా వదిలివేయడమే కాక 5000 చదరపు కి.మీల పాక్ భూభాగాన్ని కూడా వదిలివేయవలసి వచ్చింది. భవిష్యత్తులో మానని గాయంగా మారబోయే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరికే బంగారం లాంటి అవకాశం చేజార్చుకుంది కాంగ్రెస్ నేతృత్వం. శ్రీలంక లో సిరిమావో బందారునాయకే ప్రభుత్వానికి కచ్చతీవు ను ధారాదత్తం చేసి తరువాత కాలంలో జయవర్దనే ప్రభుత్వ సమయం లో LTTE కి ఆజ్యం పోసింది ఇందిరే అనే అపవాదు మూటగట్టుకుంది. ASEAN దేశాలను వ్యతిరేకించి ఆ కూటమిలో చేరకుండా ఉండడం, చైనా ను వ్యతిరేకించిన సందర్భంలో జపాన్ స్నేహ హస్తం అందించినప్పటికీ జపాన్ ను విస్మరించటం వంటి చర్యలు అతి పెద్ద తప్పిదాలుగా చరిత్రలో నిలచిపోయాయి . 
అణుపరీక్షలు చేయడం, దేశ కరెన్సీ విలువను పెంచడం వంటి చర్యలతో అతివాదులను ఆకట్టుకునేందుకు విఫలయత్నాలు చేసింది ఇందిర కానీ ఎన్నికలలో చేసిన అక్రమాలను కోర్టు అభిశంసించడంతో, ప్రజల దృష్టిలో దోషిగా నిలబడే ధైర్యం లేక, 1975 లో ఎమర్జెన్సీ ని ప్రకటించి దేశాన్ని ఇరవై ఏళ్ల వెనక్కి తోసేసింది ఇందిరాగాంధీ. 
ఎమర్జెన్సీ తరువాత వచ్చిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పరాభవాన్ని రుచి చూపించారు ప్రజలు. విపక్షాలన్నీ కలసి జనతా ప్రభుత్వాన్ని మొరార్జీ దేశాయి నేతృత్వం లో ప్రభుత్వం ఏర్పరచారు. ఎంతోమంది కాంగ్రెస్ లీడర్లు, సంఘ విద్రోహ శక్తులు కలసి అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారని, 1000 అంతకన్నా ఎక్కువ విలువ కలిగిన బ్యాంకు నోట్లను రద్దు పరచింది ఆనాటి జనతా ప్రభుత్వం. కోక్, పెప్సి వంటి విదేశీ కంపెనీలను బయటికి పంపించేసింది. కానీ నిత్యం అంతః కలహాల వల్ల, అనుకున్న లక్ష్యానికి దూరంగా జరిగిపోయి, ప్రజల దృష్టిలో దేశానికి అవసరమైన ఏ పని చేయలేదన్న అపప్రథ ను మూటగట్టుకుని తర్వాతి ఎన్నికలలో జనతా ప్రభుత్వ నేతలంతా ముఖ్యంగా వాజపేయీ తప్ప మిగతా వారు ఓటమి పాలయ్యారు. 
ఎమెర్జెన్సీ నేర్పిన పాఠాల తరువాత వచ్చిన భారత ప్రభుత్వాలు ఆర్థిక విధానాలను కొద్దికొద్ది గా మార్చుకోవడం 
మొదలుపెట్టాయి. 
పరిశ్రమల వ్యవస్థాపనను లైసెన్స్ రాజ్ చట్రాల నుండి బయటకు తీసుకువచ్చే మార్గాలను వెతకడం ప్రారంభించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం తో నెలకొల్పిన మారుతీ సుజుకి కార్ల కర్మాగారం గొప్ప ఫలితాలను ఇచ్చింది. అంతేకాక, భారత దేశం లో అప్పుడప్పుడే వృద్ధిలోకొస్తున్న నయా అప్పర్ మిడిల్ క్లాస్ ప్రజలకు గుర్తుగా ఈ కార్లు నిలిచాయి. 
యువ భారత్ కు సంకేతం గా నిలచిన రాజీవ్ గాంధీ కంప్యూటర్ ఆధారిత టెక్నాలజీ భారత్ లో ఎదిగేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు కానీ సాంప్రదాయిక కాంగ్రెస్ భావజాలమైన ఆశ్రిత పక్షపాతం, అవినీతి వంటి రోగాలను వీడలేక పోవటంతో, గొప్ప ఫలితాలనివ్వవలసిన సంస్కరణాత్మక అడుగులు వృధాగా మారాయి. తరువాతికాలం లో బోఫోర్స్ కుంభకోణం, భోపాల్ గ్యాస్ దుర్ఘటన కారకులు భారత్ విడిచిపోవడానికి సహకారం వంటి సంఘటనలు రాజీవ్ ప్రభను పూర్తిగా మసకబార్చాయి. 
పూర్వ ప్రభుత్వాల చర్యల వల్ల, ఒక దశలో దిగుమతుల చెల్లింపుల కోసం (బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్) భారత్ తన గోల్డ్ రిజర్వ్ నుండి కొంత బంగారాన్ని తనఖా పెట్టె పరిస్థితులు తలెత్తడంతో, నర్సింహారావు ప్రభుత్వం, నష్టాలలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ సంస్థలలో పేరుకుపోయిన ప్రభుత్వ నిల్వలను బయటకు తెప్పించడం, లిబరలైజేషన్, ఆర్థిక విధానాలలో సంస్కరణలు వంటి సాహసోపేతమైన విప్లవాత్మక అడుగులు వేసింది. అంతేకాక రెండురోజుల వ్యవధిలో రూపాయి మారకం విలువను 20% తగ్గించి వేసింది. మొదట 1966 లో ఇందిర 57% తగ్గిస్తే, నర్సింహారావు ప్రభుత్వం 20% తగ్గించింది. ఇటువంటి కొన్ని చర్యలు ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోకుండా ఆపగలిగాయి.... కొంత మేరకు గాడిన పెట్టగలిగాయి.  
తర్వాత వచ్చిన ఎన్‌డి‌ఏ ప్రభుత్వం భారత ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కలిగించే ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ కు చోదక శక్తి అయిన రవాణా రంగాన్ని బలోపేతం చేశారు. స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం ద్వారా నాలుగు ప్రధాన నగరాలను కలిపే ఎక్స్ ప్రెస్ హైవే రోడ్ నెట్వర్క్ ను అభివృద్ధి చేశారు. 
మరోవైపు రోడ్డు కనెక్టివిటీ లేని గ్రామాలకు ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పేరుతో అన్నీ కాలాలలో పనికొచ్చే రోడ్లను వేయించారు. సర్వ శిక్షా అభియాన్ కార్యక్రమం ద్వారా డ్రాప్ అవుట్ పిల్లల శాతాన్ని 60% మేర తగ్గించగలిగారు. బి‌ఎస్‌ఎన్‌ఎల్ అనే కొత్త ప్రభుత్వ రంగ టెలికాం సంస్థను దేశానికి పరిచయం చేశారు. ఇంటర్ నెట్ రంగం లో వి‌ఎస్‌ఎన్‌ఎల్ కు ఉన్న ఏక చత్రాధిపత్యాన్ని తొలగించి నాణ్యతా గల టెలికాం సేవలకు మార్గం సుగమం చేశారు. 
ద్రవ్య లోటును నియంత్రించే (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ చట్టం) బిల్లును తీసుకువచ్చి ద్రవ్యలోతుకు కళ్ళెం వేశారు. 2004 లో మన్మోహన్ ప్రభుత్వం వచ్చేనాటికి స్థిరీకరించబడ్డ ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దారు. అన్నింటికన్నా ముఖ్యంగా భారత్ చేసిన అణు పరీక్షలు, ప్రపంచానికి భారతదేశం యొక్క శక్తిని చాటాయి. అణు పరీక్షల దరిమిలా ప్రపంచం విధించిన ఆంక్షలను భారత్ ఎదుర్కొన్న తీరును, దేశ ఆర్థిక స్థితిగతులపై, ప్రజల శక్తి యుక్తులపై దేశ నాయకత్వానికి ఉన్న నమ్మకాన్ని, అత్యున్నత నాయకత్వం తీసుకున్న నిర్ణయాలకు దేశ ప్రజానీకం కట్టుబడ్డ తీరును చూసి ప్రపంచం నివ్వెరపోయింది. 
ఒక దిశా నిర్దేశం లేని చిన్నా చితకా పార్టీలన్నింటినీ కలుపుకుని, ఎప్పుడూ ఏదో ఒక పేచీ పెట్టె నాయకులను సముదాయించుకుంటూనే, అరకొర మెజారిటీతోనే ప్రభుత్వాన్ని నడిపిన వాజపేయి ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకుని దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరులూదారు. 
2004 లో వచ్చిన మన్మోహన్ ప్రభుత్వం పై దేశ విదేశాల్లో ఎన్నో ఆశలుండేవి. కానీ మొదటి విడత ప్రభుత్వం చివరినాళ్ళకు వచ్చేసరికి మన్మోహన్ వంటి గొప్ప ఆర్థిక మేధావిని కేవలం ఒక పప్పెట్ గా మార్చివేసి ఆడిస్తున్నారనే నిజం ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్లింది. అయినా మన్మోహన్ ప్రభుత్వం కొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకుంది. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తెచ్చి పల్లెల నుండి పట్నాలకు కొనసాగుతున్న వలసలను పెద్దఎత్తున అరికట్టగలిగింది తద్వారా నగరాలపై పడుతున్న అదనపు భారాన్ని చాలా వరకు తగ్గించగలిగింది. ప్రత్యేక ఆర్థిక మండళ్ళ బిల్లును(SEZ) తెచ్చి విదేశీ ఎగుమతులకు ఊతం ఇచ్చింది. వాజపేయీ ప్రభుత్వం వేసిన పునాదులమీద జాగ్రత్తగానే నడచిన మన్మోహన్ సింగ్ దేశ జి‌డి‌పి వృద్ధి రేటును పట్టాలెక్కించారు. జి‌డి‌పి వృద్ధిరేటు అత్యధికంగా 9% దాటింది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వృద్ధి రేటుగా నమోదయ్యింది. కానీ రెండవ దఫా మన్మోహన్ ప్రభుత్వాన్ని కుంభకోణాలు, అపవాదులు, అవినీతి ఆరోపణలూ చుట్టుముట్టాయి... టైమ్ మ్యాగజైన్ సైతం మన్మోహన్ ను అండర్ అఛీవర్ అంటూ పేర్కొనడం కూడా ప్రపంచ వ్యాప్తంగా మన్మోహన్ ప్రభుత్వం మీద పెట్టుకున్న ఆశలు ఆవిరైనాయని చెప్పడానికి ఒక నిదర్శనంలా నిలచింది.  
	UPA ప్రభుత్వ హయాంలో ఇండియా పాకిస్తాన్ సంబంధాలు అత్యంత క్షీణ దశకు చేరుకున్నాయి. 2008 ముంబయి ప్రేలుళ్ళ కేసులో పాక్ జాతీయులు ప్రత్యక్షంగా పాల్గొనడం, తీవ్రవాదులతో పాక్ సంబంధాలు పూర్తిగా బయటపడ్డప్పటికీ, అంతర్జాతీయంగా పాక్ పై ఒత్తిడి తెచ్చి తీవ్రవాదులు భారత్ వైపు చూడకుండా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే చెప్పాలి. మన్మోహన్ హయాములో అత్యంత ముఖ్యమైనది ఇండో- అమెరికా అణు ఒప్పందం. ఈ ఒప్పందం భారత్ ను న్యూక్లియర్ దేశాల క్లబ్ లోకి చేర్చడమే కాక, పాకిస్తాన్ భారత్ రెండూ సమమైన దేశాలు కావు, భారత్ పాక్ కన్నా చాలా శక్తివంతమైనది అని ప్రపంచానికి చాటి చెప్పింది. 
ఢిల్లీ పీఠం పై నరేంద్ర మోడీ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత కేవలం ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాదు, దౌత్య, రక్షణ, పారిశ్రామిక, పర్యాటక, మౌలిక సదుపాయాల కల్పన వంటి ఎన్నో రంగాలకు జవసత్వాలొచ్చాయి. మొదటగా ఆర్థిక రంగంలో ఇబ్బడి ముబ్బడిగా చలామణిలోకి వచ్చి, ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్న నకిలీ నోట్లను, నల్ల ధనాన్ని నియంత్రించేందుకు తీసుకు వచ్చిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశ విదేశాల్లో ప్రకంపనలు రేపింది. సార్వభౌమ దేశపు కరెన్సీ నోట్ల మీద పంజా విసురుతున్న విదేశీ ముఠాలను ఒక్క దెబ్బతో నియంత్రించగలిగింది మోడీ ప్రభుత్వం. దేశీయంగా పన్నులు ఎగ్గొట్టేందుకు సహాయపడుతున్న 2 లక్షల షెల్ కంపెనీ(సూట్ కేస్ కంపెనీ) లను రద్దు చేసి నల్లధనాన్ని నియంత్రించే చర్యలు చేపట్టింది. ముద్రా యోజన పేరుతో అర్హత గల లబ్దిదారులకు పెద్ద ఎత్తున ఋణ సహాయాన్ని అందించింది. నగరాలల్లోని పేదలకు ఇళ్ళు నిర్మించుకోగలిగే సహాయాన్ని హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022 ద్వారా అందించింది. ఒకే దేశం ఒకే పన్ను పేర జి‌ఎస్‌టి ని తీసుకొచ్చి పన్నుల వ్యవస్థలో అతిపెద్ద సంస్కరణను రుచి చూపించింది. స్వచ్చ భారత్, మేకిన్ ఇండియా వంటి అనేక విధానాలతో దేశాన్ని ముందుకు నడిపించే గురుతర బాధ్యతను భుజాన వేసుకున్నారు మోడీ. 
దౌత్య, విదేశాంగ విధానాలలో ఇంతకూ ముందు భారత్ కు ఎన్నడూ తెలియని నూతన శకాన్ని ఆవిష్కరించారు మోడీ. గతంలో ఉన్న లుక్ ఈస్ట్ పాలసీ ను ఆక్ట్ ఈస్ట్ పాలసి గా మార్చారు. పాకిస్తాన్ తో తప్ప, దక్షిణాసియా దేశాలన్నింటితో అత్యంత సౌహార్ద్ర పూరిత వాతావారణాన్ని నెలకొల్పారు. అమెరికా, కెనడా, యురోపియన్ యునియన్, ఆసియాన్ కూటమి దేశాలతో మునుపెన్నడూ లేనంత దృఢమైన సంబంధాలను ఏర్పరచారు. చైనా అధ్యక్షుడి తో సైతం ద్వైపాక్షిక సంబంధాలు నెలకొల్పేందుకు రెండు మూడు సార్లు చర్చలు జరిపారు. ప్రపంచబ్యాంకు కు సమాంతరంగా BRICS ను అభివృద్ధి చేసే క్రమంలో, BRICS లో భారత పెట్టుబడులను పెంచారు. తీవ్రవాదుల పేరిట దాడులు చేస్తే, భారత్ చూస్తూ ఊరుకోదని సర్జికల్ స్త్రైక్స్ ను పాక్ కు రుచి చూపించారు. అత్యంత ముఖ్యంగా కరోనా వ్యాధి ప్రపంచాన్ని కుదిపేస్తున్నవేళ, హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను, కోవ్యాక్సిన్, కోవిశీల్ద్ వ్యాక్సిన్ లను అవసరమైన దేశాలకిచ్చి ప్రపంచ మానవాళి పట్ల భారత్ కు ఉన్న నిబద్ధత ను చాటి చెప్పారు.     
ప్రస్తుతం దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలవుతున్న శుభవేళ, ఒక పర్యాయం దేశ ఆర్థిక వ్యవస్థ చరిత్రను, దౌత్య సంబంధాలలో మైలురాళ్ళు అనదగ్గ సంఘటనలను అవలోకిస్తే, అప్పులు చేస్తే తప్ప నడవని స్థితి నుండి అప్పులు ఇచ్చే స్థితికి భారత్ ఇవాళ ఎదిగింది. ఐదు లక్షలకోట్ల పరిమాణం గల ఆర్థిక వ్యవస్థగా ప్రపంచం లో గుర్తింపు తెచ్చుకుంటోంది. అత్యంత సులభంగా దేశ భూభాగాలను కబ్జా చేసిన దురాక్రమణదారులందరికీ వెన్నులో చలి పుట్టే విధంగా శత్రు దుర్భేద్యంగా దేశ రక్షణ వ్యవస్థను భారత్ తయారుచేసుకోగలిగింది. అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇజ్రాయెల్, జపాన్, ఆస్ట్రేలియా, రష్యా, బ్రెజిల్, సౌతాఫ్రికా, ఈజిప్ట్, సౌదీ అరేబియా వంటి శక్తివంతమైన దేశాలు ఈరోజు భారత్ సాన్నిహిత్యం కోసం పాకులాడుతున్నాయంటేనే, దేశం యొక్క ఆర్థిక, దౌత్య మరియు రక్షణ రంగాలు ఎంత ప్రభావవంతంగా మారాయో మనం అర్థం చేసుకోవచ్చు. 
	సమాచార విప్లవాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ, భారత సమగ్రతను కాపాడుకుంటూ, దేశ అసలు పౌరుల ప్రయోజనాలు దెబ్బతినకుండా అందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా, వైద్య & ఔషధీ రంగాలలో ప్రపంచ మానవాళికి ప్రాణం పోసే నూతన ఆవిష్కరణలకు ఊతమిస్తూ, పరిణతి చెందిన దౌత్య విధానాలతో, ప్రపంచం లోని అన్ని దేశాల ప్రజలకు సౌహార్ధ్రతను పంచేలా, వసుధైక కుటుంబకం అనే అమృత భావనను పెంచుతూ, పంచుతూ విశ్వ వ్యాప్తం చేస్తున్నది భారత్. ప్రపంచానికి గురువై నిలుస్తున్నది భారత్. 
భారత్ మాతాకీ జై.

-
హసన్ముఖి 
ఆగస్ట్ 2021 

2 Comments

 1. రవీందర్ says:

  అవలోకనం బాగుందన్నా. కొత్త తరానికి మంచి అవగాహన కూడా…

  నిత్యం పని ఒత్తిడి ఉండే ఉద్యోగంలో ఉండి కూడా ఈ వ్యాపకాన్ని కొనసాగించడం గొప్ప విషయం. హృదయపూర్వక అభినందనలు…🌷

  Like

  1. అన్నా మీ ఎంకరేజ్ మెంట్ కు ధన్యవాదాలు

   Like

Leave a Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s