నేటి మధ్యప్రదేశ్ లోని మాహో (MHOW) గ్రామంలో 1891 ఏప్రిల్ 14న భీంరావ్ అంబేడ్కర్ జన్మించారు. ఎన్నో ఆటంకాలు సమస్యలు దాటి, ఈ ఆణిముత్యం, దేశ విదేశాలలో చదువు అభ్యసించి, జీవితాంతం అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడి, ఒక దార్శనికుడిలా హిందూ సమాజం లో రావలసిన సంస్కరణలను సూచించారు. మరాఠీ సంఘ సంస్కర్త & రచయిత కేలూస్కర్ మరియు బరోడా మహారాజుల సహాయంతో 1913 లో అధ్యయనం కోసం అమెరికా వెళ్లారు అంబేడ్కర్. అక్కడ బుకర్.టి.వాషింగ్టన్ అనే సంఘ సంస్కర్త జీవితం, అంబేడ్కర్ ఆలోచనలపై అధ్యయనంపై పెను ప్రభావం చూపింది. “నీది నాదీ ఒకే దేశమయినప్పుడు, నీకు, నాకు అవకాశాలల్లో తేడా ఎలా ఉంటుంది…?” అని ప్రశ్నించిన బుకర్.టి.వాషింగ్టన్ ఆలోచనాధార, అదే సమయంలో అంబేడ్కర్ అధ్యయనం చేసిన అమెరికా రాజ్యాంగ 14వ సవరణ ఆయన ఆలోచనా విధానం పై విశేషమైన ప్రభావం చూపింది.
ఒక దేశ విధానాలలో రాజ్యాంగం పాత్ర, ఒక స్వేచ్చాయుత దేశం లో రాజ్యాంగం నిర్దేశించే మార్గాలు, ఆ దేశప్రజల ఆర్థిక స్తితి గతులలో ఎంతటి తీవ్ర మార్పునకు కారణమవుతాయో అంబేడ్కర్ ప్రత్యక్షంగా చూసి అర్థం చేసుకోగలిగారు. ఇదే సమయంలో “భారత దేశపు కుల వ్యవస్థ – పుట్టు పూర్వోత్తరాలు ” అనే అంశం పై అమెరికాలో జరిగిన ఆంత్రోపాలజీ సదస్సులో పరిశోధన వ్యాస పత్రం సమర్పించారు.
ఏ వ్యక్తులయితే దళితులను వారి అభివృద్ధిని వ్యతిరేకిస్తారో, తిరస్కరిస్తారో అటువంటి వ్యక్తుల పాలనలో, దళితులు ఎన్నటికీ ఎప్పటికీ ఉన్నతిని సాధించలేరని, భారతదేశం అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధిని సాధించాలంటే, హైందవ సమాజాన్ని సమూలంగా ప్రక్షాళన చేయడమే మంత్రమనీ అంబేడ్కర్ బలంగా విశ్వసించారు.
బొంబాయి లోని సీడెమ్ కాలేజీలో ఆచార్యుడిగా పనిచేస్తున్నపుడు సైతం అంబేడ్కర్ ను అస్పృశ్యతా భూతం వెంటాడుతూనే ఉండేది. వృత్తిపరంగా సమాజంలో గౌరవప్రదమైన అత్యున్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ, కొలంబియా విశ్వవిద్యాలయం చేత డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టా పుచ్చుకున్నప్పటికీ, ఒక మేధావి పట్ల, భారతదేశం లోని కులవ్యవస్థచే ప్రభావితం చేయబడ్డ సమాజం, కళ్ళు మూసుకునిపోయి అత్యంత అజ్ణానంతో కఠినంగా ప్రవర్తించింది. నిర్దయగా వ్యవహరించింది. పోలిటికల్ ఎకానమీ ప్రొఫెసర్ గా అత్యద్భుతంగా బోధించే అంబేడ్కర్ ను, సాటి విద్యాధికులైన ప్రొఫెసర్లు కూడా దగ్గరకు రానిచ్చేవారు కాదు. తమ పక్కన కూర్చినిచ్చేవారు కాదు. కనీసం మంచినీళ్ళను స్టాఫ్ రూమ్ లో తాగనిచ్చేవారు కాదు. అటెండర్లు సైతం మాట వినేవారు కాదు. … … రాను రాను … తరగతి గదుల్లో విద్యార్థులముందు ఆవిష్కృతమవుతున్న అంబేడ్కర్ మేధాశక్తి, వాక్పటిమ, వాగ్ధాటి, ఎంతోమంది విద్యార్థులను ఆకర్షిస్తూ వచ్చింది. కొద్దికాలం తరువాత, పక్క కళాశాలల విద్యార్థులు సైతం ప్రత్యేక అనుమతులతో అంబేడ్కర్ పాఠాలు వినేందుకు వచ్చేవారు….. ఇంత జరుగుతున్నా…. కులవ్యవస్థ కంపు నరనరాన జీర్ణించుకుని పోయిన సమాజం ఆయనను స్వేచ్చగా బ్రతకనీయలేదు. కనీసం అద్దెకు ఒక గదిని దొరకనివ్వని స్తితిని కల్పించింది.
ఇదే సమయంలో మూక్ నాయక్ పత్రిక లో తన అనుభవాలను, అధ్యయనాన్ని రంగరించి హిందూ సమాజంలో పేరుకుని పోయిన అనాచారాలపై అంబేడ్కర్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. “ హిందూ సమాజం అనేది ఒక బహుళ అంతస్తులున్న భవనం, ఇందులో ఒక అంతస్తు నుండి మరొక అంతస్తు కు నిచ్చెనలు, మెట్లు ఏవీ ఉండవు, ఏ అంతస్తులో పుట్టినవాడు ఆ అంతస్తులోనే చావాల్సిందే..! కింది అంతస్తులవారు చేసే వృత్తులమీదే ఎన్నో సౌకర్యాలు అనుభవించే పై అంతస్తులవారు ఆధారపడ్డప్పటికీ కర్మ సిద్దాంతం అనే పదాన్ని అడ్డుపెట్టి, జన్మతః వచ్చే కులమే అన్నిటికన్నా గొప్పదని వాదిస్తారు… ” అంటూ హిందూ సమాజాంలోని స్తితిగతులను ప్రతీకాత్మకంగా, కళ్ళకు కట్టినట్టు వివరించారు.
దళితులు, అణగారిన జాతుల వారు కేవలం సంపద సంబంధిత వృద్ధిలోకి మాత్రమే కాక, గౌరవప్రదమైన జీవనం గడపాలంటే రాజకీయాధికారం మాత్రమే బలమైన సాధనంగా అంబేడ్కర్ కు గోచరించింది. అదేసమయంలో భారతదేశం లో బడుగుల, బలహీనుల అభ్యున్నతికి కృషి చేస్తున్న మున్నత్తు పద్మనాభ పిళ్ళై, భాగ్యరెడ్డి వర్మ వంటి వారితో సమాలోచనలు చేసి, ‘ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్’ సమావేశాన్ని 1930 లో లక్నో లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశం లో లండన్ లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశాలలో దిగువకులాల ప్రతినిధిత్వం ఉండాలని, దేశంలోని అణగారిన జాతుల వాణిని, భారతదేశం లో స్వీయ పాలన అనే అంశం పై భవిష్యత్ భారతం లో తమ హక్కుల గురించి బలంగా తమ వాదన వినిపించాలనీ అంబేడ్కర్ ను కోరడం జరిగింది.
లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలు మూడింటిలోనూ పాల్గొని, అణగారిన జాతుల అభ్యున్నతికై ప్రత్యేక నియోజకవర్గాల ఆవశ్యకతను, శాస్త్రీయ దృక్పథంతో ప్రతిపాదించారు. అంతేకాక, మత ప్రాతిపదికన జరిగే నియోజకవర్గ విభజనను వ్యతిరేకించారు.
రాజకీయాధికారంలో భాగస్వామ్యం కోసం అంబేడ్కర్ చేసిన వాదనల్లో నేపథ్యంగా పలు వాస్తవిక అంశాలు మనకు గోచరిస్తాయి.
- నిమ్న జాతుల పట్ల తరతరాలుగా సవర్ణ హిందువులు అనుసరించిన పక్షపాత వైఖరి కొనసాగించబడటానికి ప్రధాన కారణం రాజాస్థానాలలో, బ్రిటీషు ప్రభుత్వంలో, జమీందారులవద్ద పనిచేసే ఉద్యోగులు మరియు ఉద్యోగస్వామ్యం. కాబట్టి, ఉద్యోగ వ్యవస్థ నియమకాలలో మార్పు రావాలి. పబ్లిక్ సర్వీస్ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన చెందాలంటే రాజకీయాధికారం అవసరం
- కేవలం ఉద్యోగ నియామకాలల్లో మాత్రమే అస్పృశ్యులకు ప్రాధాన్యత కల్పిస్తే, భవిష్యత్ లో, రాజకీయ, న్యాయ వ్యవస్థ లోని సంకుచిత దృష్టి గల సవర్ణులవల్ల ప్రమాదముండటం మరియు, దళిత ఉద్యోగులు కూడా డబ్బు, అధికారం వల్ల ఇతర దళిత ఉపకులాలలో అస్పృశ్యతను ప్రోత్సహించే అవకాశం ఉండటం కారణంగా, రాజకీయ & న్యాయ రంగాలలో కూడా, అస్పృశ్యతా నివారణా చర్యలు చేపట్టి నిమ్నజాతులకు జనాభా ప్రాతిపదికన అధికారం కల్పించటం.
- కేవలం అణగారిన జాతుల వారికి ఆలయ ప్రవేశం కల్పించినంత మాత్రాన, సవర్ణ హిందువులలో హృదయ పరివర్తన కలగదనీ, మూఢ భావజాలం కలిగినకొంత శాతం హిందువులలో సమూల మార్పు రావాలంటే, ప్రపంచ దేశాలలో అమలవుతున్న “సమానత్వం “ అనే భావన అధికారయుతంగా ప్రకటించబడాలి అందుకోసం రాజకీయాధికారం కావాలి.
ఈ విధమైన భావాలతో, రౌండ్ టేబుల్ సమావేశాలలో అంబేడ్కర్ శాస్త్రబద్ధంగా, తర్క బద్ధంగా, చేసిన వాదనలు, బ్రిటీషు ప్రభుత్వాన్ని ఆలోచింపజేసాయి, కదలించాయి. బ్రిటీషు ప్రధాని రామ్సే మెక్ డొనాల్డ్ ప్రకటించిన కమ్యూనల్ అవార్డ్, దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించింది. దీనిని వ్యతిరేకిస్తూ, పూణే లోని ఎరవాడ జైలులో గాంధీజీ నిరాహార దీక్ష ప్రారంభించారు.కాంగ్రెస్ నాయకులు వెంటనే రంగం లోకి దిగి, అంబేడ్కర్ పై వత్తిడి తెచ్చారు. గాంధీజీ తో నిరాహారదీక్ష విరమింప చేసేందుకు ఎరవాడ జైలుకు వెళ్ళి చర్చించారు అంబేడ్కర్. ఈ చర్చలే పూణే పాక్ట్ గా పేరు పొందాయి. . ఈ సందర్భంగా, దళితులపట్ల గాంధీజీ & కాంగ్రెస్ ల యొక్క రాజకీయ లాభాపేక్షిత ధోరణిని చూసి హతాశులయ్యారు అంబేడ్కర్. దళితులపట్ల కఠిన వైఖరి వీడి, న్యాయం చెయ్యమని గాంధీజీని కోరవలసి వచ్చింది అంబేడ్కర్. చివరకు దళితులకు కేవలం ప్రత్యేక రిజర్వేషన్లతో సరిపెట్టవలసి వచ్చింది.
పూణే ఒడంబడిక తరువాత అణగారిన జాతులపట్ల, గాంధీజీ & కాంగ్రెస్ ల విధానం తేటతెల్లమవడంతో, మూక్ నాయక్ పత్రిక లో What did congress and Gandhiji do for Untouchables…? అనే వ్యాసం ప్రచురించారు అంబేడ్కర్. ఈ వ్యాసం అచ్చయిన తరువాత గాంధీజీ హరిజన్ పత్రిక ద్వారా కులవ్యవస్థ ప్రక్షాళన, హరిజనుల ఆలయ ప్రవేశం వంటి అంశాలు ప్రబోధించారు.
కోలాబా జిల్లాలోని మహద్ అనే పట్టణం లోని చెరువు నీటి ఉపయోగం పై దళితులపై సవర్ణ హిందువులు ఆంక్షలు విధించడం తెలిసి, అంబేడ్కర్ దళితులను సంఘటితపరచి, చెరువు వద్దకు వెళ్ళి నీళ్ళు త్రాగి,తన అనుచరులను కూడా నీటిని వాడుకోవచ్చనీ, దళితులు నీటిని ముట్టుకున్నంత మాత్రాన చెరువు మైల పడిపోదనీ, ఇతర దళితులకు ప్రబోధిస్తుండగానే, ఆ ప్రాంతం లోని మూఢ భావజాలం గల హిందువులు కర్రలతో, రాళ్ళతో అంబేడ్కర్ పై, అక్కడ ఉన్న మిగతా వారిపై దాడికి తెగబడ్డారు. అంబేడ్కర్ అనుచరులు తేరుకుని సరైన బదులిద్దామని సిద్ధపడుతుంటే, ఆయన వారిస్తూ, “మనం పోరాడుతున్నది సమస్య పైనే గానీ, వ్యక్తులపై కాదు, రేపు సమస్య తీరిపోతే, ఈ వ్యక్తులందరితో మనం జీవనం చేయవలసిఉంటుంది.” అంటూ హింసను నివారించారు. అంతేకాక 1927 ఆగస్ట్ లో మొత్తం హిందూ సమాజాన్ని ఉద్దేశించి అంబేడ్కర్ చేసిన చారిత్రాత్మక ప్రసంగం ఎంతోమంది విద్యాధిక హిందువులను కదిలించింది. ఆ ప్రసంగంలో “దళిత ప్రజలగూర్చి శ్రద్ధ వహించే మతం గూర్చి వారు ప్రాణాలైనా ఇస్తారు కానీ వారి బాగోగుల్నీ పట్టించుకొని మతం లో వారు ఎందుకు కొనసాగాలి…? ఈ నిమ్న జాతులవారు హిందువులా కాదా ముందు తేల్చండి” అంటూ హుంకరించారు. అంతేకాక “మతం మార్చుకుంటే సమస్య తీరిపోతుందని మాకు తెలుసు అయినా మేం హిందుత్వ పరిధిలోనే జీవించాలనుకుంటున్నాం…. అస్పృశ్యులను సాంఘిక సమానత్వపు స్థాయికి ఉద్దరించడమే సంస్కృతి కి అర్థం … మతం – బానిసత్వం ఒకదానితో ఒకటి పొసగవు… మీరు చెప్పే మోక్షానికి ఏమేమి కావాలో స్పష్టంగా చెప్పండి… అగ్రకులంలో జన్మించినంత మాత్రాన సర్వ అవగుణాలు ఉన్న వ్యక్తి ఏ విధంగా మోక్షానికి అర్హుడో వివరించండి… అస్పృశ్యత ఇదే విధంగా కొనసాగితే ఇతర మతాల దాడులలో హిందూత్వం మరణిస్తుంది… హిందూమతం పునరుజ్జీవనం చెండాలన్నా జీవించి నిలబడాలన్నా… అస్పృశ్యత మరణించాలి” అంటూ ఎంతో మంది విద్యాధికుల కళ్ళు తెరిపించి సంస్కరణవాదాన్ని ఆవిష్కరించారు.
మహద్ చెరువు నీటికోసం అంబేడ్కర్ సత్యాగ్రహ పోరాటం తరువాత అంటరానితనం నేరం చట్ట అమలుకు మరిన్ని చర్యలు తీసుకోబడ్డాయి. 1932లో మదరాసు అసెంబ్లీ లో దళితుల దేవాలయ ప్రవేశం చట్టం చేయబడింది.
సామాజిక రుగ్మతలకు, మత ప్రమేయం లేని పరిష్కారమార్గాల కోసం అంబేద్కర్ ప్రయత్నించారు. దళితులకు ఆలయ ప్రవేశం వంటి తాత్కాలిక ఉపశమన చర్యలు కాక మూలం నుండి సమస్య పరిష్కారం అవ్వాలని ఆకాంక్షించారు. సమానత్వానికి తావు లేని ఏ స్వతంత్ర్య పోరాటం అయినా అర్థవంతం కాదని అంబేద్కర్ వాదించారు. ప్రజలకు సమానత్వమే లేనప్పుడు, గ్రామ స్వరాజ్యం పేరిట ఏర్పడే గ్రామ పంచాయతీలు తిరిగి ‘ నయా నిరంకుశ రాజరికాలు‘ గా మారే ప్రమాదముందని హెచ్చరించారు.
అస్పృశ్యతకు సంబంధించి గాంధీ దృక్పథం లో రాజకీయ అవసరాలు కూడా ఉన్నాయి. అంటే హరిజనులందరూ కాంగ్రెసునే సమర్థించాలని కోరుకున్నారు. కానీ అంబేద్కర్ కు ఒకటే లక్ష్యం అదే నిస్వార్థమైన సామాజిక సమానత్వం. హరిజన్ పత్రికలో పలు వ్యాసాలలో గాంధీ కులవృత్తుల వ్యవస్థకు వత్తాసు పలిక్తే,.. అంబేద్కర్ కులవృత్తుల వ్యవస్థ అప్రజాస్వామికమైందనీ, మనిషిలోని సృజనాత్మక శక్తులను అణచి వేస్తుందనీ, నీచంగా పరిగణించబడే వృత్తులను అనుసరించేవారు కనీస జీవన హక్కులను కోల్పోయే ప్రమాదముందనీ,ఆ కుంటుంబాలలో జన్మించే వ్యక్తుల మేధాశక్తి, అత్యంత క్రూరంగా శాశ్వతంగా అణచివేయబడుతుందనీ, యదార్థ వాదనను అందరికీ అర్థమయ్యే విధంగా వినిపించారు.
భారత దేశంలో వ్యవస్థీకృతమై ఉన్న అసమానతలు, కులవ్యవస్థ ఆధారిత వివక్ష తొలగించబడాలంటే, ఇంకా ఎన్నో ఏళ్ళు పడుతుందని అప్పటివరకూ నిరంతర ప్రయత్నం చేయాలని నొక్కి చెప్పారు అంబేద్కర్.
నిజానికి భారత దేశంలోని మిగతానాయకులతో పోలిస్తే, అంబేద్కర్ ఎంచుకున్న సామాజిక సమానత్వం-సమరసత లక్ష్యం ఎంతో సంక్లిష్టమయ్యిందీ, కంటకాకీర్ణమయ్యిందీ మరియు విస్తృతమయ్యింది.. స్వాతంత్ర్య లక్ష్యం కోసమే అయితే కేవలం విధర్మీయులతో, విదేశీయులతో పోరాడవచ్చు, కానీ సామాజిక సమానత్వం కోసం తన దేశవాసులతోనే, నాయకులతోనూ,సంస్కార గంధం లేని విద్యాధికులతోనూ, అంబేద్కర్ పోరాటం చేయవలసి వచ్చింది. ఈ పోరులో ఎటువంటి సమర్థకులు, మిత్రులు, అనుచరుల మద్ధతు లేకపోయినా, మహోన్నత, ఉదాత్త లక్ష్యం కోసం జీవితాంతం పరితపించి, అణగారిన వర్గాలను చీకటి నుండి బయటకు తెచ్చిన సూర్యుడు, ధీశాలి, కారణజన్ముడు, సిసలైన భారతరత్నం అంబేద్కర్.
ప్రాతః స్మరణీయుడు అంబేద్కర్.
hasanmukhi 2013 April
చాలా ఉపయోగకరమైన వ్యాసం ఇది.
ఆర్ధిక విషయాల గురించి, పాకిస్తాన్ భావన గురించి ఆర్య ద్రావిడ సిద్ధాంతం గురించి అంబేద్కర్ గారి ఆలోచనలు జోడిస్తే ఇంకాస్త సమగ్రంగా ఉండేది.
LikeLike