అవినీతి – పార్ట్ 2

ప్రజల జీవితం లో విడదీయరాని భాగంగా మారుతున్న అవినీతిని కూకటి వేళ్ళతో పెకిలించాలంటే, అసలు అవినీతికి మూలం ఎక్కడ ప్రారంభమవుతుంది.. ఎక్కడ ప్రేరేపితమవుతుంది.. ఎలా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది.. వంటి అంశాల్ని మనం అవలోకించాలి లోతుగా అర్థం చేసుకోవాలి చివరగా ఎలా ఈ భూతాన్ని అంతం చేయగలమో ఆ చర్యలను కలసికట్టుగా చేపట్టాలి.  

శ్వాస పీల్చకుంటే ఎలాగైతే మనిషి చనిపోతాడో, అలాగే  ప్రభుత్వ కార్యకలాపాల్లో అవినీతిని నిరోధిస్తే, దేశంలో దాదాపు 75% మంది రాజకీయ నాయకులు, వారి కార్యకర్తలు చచ్చిపోతారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వారందరిలో 98% మంది అవినీతి పరులే ఉంటారు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అవినీతి కొరకు, అవినీతి వల్ల అవినీతే చేయడం కోసం ఈ దేశంలో ఎంతో మంది రాజకీయ నాయకులు & కార్యకర్తలు పుట్టుకువస్తున్నారు.

నేపథ్యం   

ప్రభుత్వ కార్యకలాపాలు ప్రజల కోసం జరుగుతుంటాయి కాబట్టి ప్రజల అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం, అట్టడుగున వార్డ్ దగ్గర ప్రారంభించి అత్యున్నత దేశాధ్యక్ష స్థాయి వరకు ప్రతీ దశలో ఉద్యోగులను ప్రజల అవసరాలు తీర్చేందుకు నియమించింది. అదే సమయంలో ప్రజల ఆకాంక్షలు తెలుసుకోవడానికి, ప్రజల నాడిని ప్రభుత్వాలకు తెలియచేసేందుకు ప్రజల నుండి కూడా ఒక వ్యక్తిని ఎన్నుకునేందుకు అవకాశం కల్పించింది మన రాజ్యాంగం.

అంటే అధికారికంగానే వ్యవస్థ లోని ప్రతీ స్థాయిలో ఒక ఉద్యోగి, ఒక ప్రజా నాయకుడు ఉంటారు. ఉదాహరణకు గ్రామాల్లో వార్డులుంటాయి ఒక్కో వార్డులో దాదాపుగా 200 జనాభా ఉంటారు. వార్డులకు వార్డ్ మెంబర్ ఉంటారు. వార్డులు అన్నీ కలిపితే గ్రామం. గ్రామం మొత్తానికి కలిపి సర్పంచ్ ఉంటారు. పరిపాలనలో చిట్టచివరి యూనిట్ అయిన గ్రామంలో, ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు దాదాపుగా 10 మంది వరకు ఉంటారు. పరిపాలన సౌలభ్యం కోసం అంటే, విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్తు, త్రాగు నీరు, సాధారణ పరిపాలన, పొలాల ధ్రువపత్రాలు, కులాల ధ్రువపత్రాలు.. వగైరా వగైరా.. వాటన్నింటికి గ్రామ స్థాయి లో ఒకరు లేదా ఇద్దరు ఉద్యోగులు/ ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉంటారు. గ్రామం పైన మండలం స్థాయిలో, డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఒక వైపు ఎన్నుకోబడ్డ నాయకులు మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు. ఎన్నుకోబడ్డ నాయకులు ప్రజల అవసరాలు తీరేలా పనులు చేయాలి ఉద్యోగులచేత చేయించాలి…

మనం గుర్తించవలసిన విషయం ఏమిటంటే, ప్రజల కనీస అవసరాలు తీరడంలో ఎలాంటి ఆలస్యం, అలసత్వం ఉండకూడదు అన్నదే ప్రభుత్వ ప్రాధాన్యం. రాజ్యాంగం వ్రాసినప్పుడు, చట్టసభల్లో నిర్ణయాలు తీసుకుంటున్నపుడు ఇలాంటి ఎన్నో జాగ్రత్తలతో, ముందుచూపుతో వ్యవహరించడం జరుగుతుంది.  

మరి జరుగుతున్నదేమిటి ..?

మరి ఇంత పకడ్బందీగా రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసినపుడు, ప్రజల జీవితాలు సాఫీగా సాగిపోవాలి. పరిపాలన ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జరగాలి. కానీ ప్రజలకు అందవలసిన ఎన్నో సౌకర్యాలను ఎన్నుకోబడ్డ ప్రతినిధులే అడ్డుకుంటూ ఉండటం, తద్వారా ప్రజలు ఇబ్బందులు పడటం అనేది ఎన్నో సందర్భాలలో ప్రతీ దిన పత్రికలో చూడటం నిత్యకృత్యమై పోయింది. ఇంకొంచెం తరచి చూస్తే, ప్రజలకు అందవలసిన సౌకర్యాలను నాయకులే ప్రత్యక్షంగా అడ్డుకుంటున్నారా.. అంటే కాదు అనే సమాధానం వస్తుంది. కానీ నాయకుల పేరు చెప్పి, వారి అనుచరులు, రాజకీయ పార్టీల కార్యకర్తలు ప్రజలను ఇబ్బందులపాలు చేసే పనులు చేస్తుంటారు అనేది అందరూ ఒప్పుకునే సత్యం.

  • నాసిరకంగా ప్రభుత్వ పనులు చేసేసి కమీషన్లు బుక్కేయడం,
  • ప్రజలకు సౌకర్యాన్ని కలిగించే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సైడ్ డ్రెయిన్లు, బిల్డింగులు, సిసి రోడ్లు ఇలా అన్నింటిలో వేలు పెట్టి నాణ్యత లేని విధంగా పనులు చేసి డబ్బులు, పర్సంటేజీలు నొక్కేయడం,
  • రోడ్లను ఆక్రమించేసి ఇష్టం వచ్చినట్టుగా నిర్మాణాలు చేసేయడం,
  • రోడ్ల మీద ఎటువంటి పర్మిషన్లు లేకుండా పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టేయడం,
  • కాలనీలల్లో, గ్రామాల్లో ఎన్నో సందర్భాలల్లో రోడ్లను బ్లాక్ చేసేసి టెంట్లు వేసేసి న్యూసెన్సు క్రియేట్ చేసేయడం, ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే, ప్రజలకు ఇబ్బందులు కలుగచేసే పనులు, దేశంలోని దుర్మార్గపు పనులు చేసే వాళ్ళందరూ దాదాపు ఏదో ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలే..!

అసలు రాజకీయ పార్టీలకు కార్యకర్తల అవసరం ఏమిటి అన్నది మనందరి మెదళ్ళలో మెదిలే మిలియన్ డాలర్ల ప్రశ్న. కార్యకర్తల అవసరం ఏమిటీ అనే విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చూస్తే.. .. ..  జిల్లా పరిషత్తు నాయకులు, ఎమ్మెల్యేలు ఎంపీలు వంటివారు ఎన్నికల్లో పోటీ చేసినపుడు అన్ని ఇళ్లను, ఊళ్ళను చుట్టి రావడం కష్టం కాబట్టి ఎన్నికల సమయంలో కార్యకర్తల అవసరాన్ని కాదనలేం. ఎన్నికలు అయిపోయి, ఏదో ఒక పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింతరువాత, ఇంకా కార్యకర్తల పని ఏమిటి..? అంటే, నాయకులు ఊళ్ళల్లోకి వస్తే, జెండాలు కట్టాలి, తోరణాలు కట్టాలి, హారతులు పట్టాలి, జయకారాలు కొట్టాలి.. అంటే వ్యక్తి కేంద్రీకృత స్వామ్యం ఏర్పరిచేందుకు కార్యకర్తలను నాయకులు మెయింటెయిన్ చేస్తారు. మరి నాయకులకు వంగి వంగి దండాలు పెట్టె ఈ కార్యకర్తలకు బ్రతుకు తెరువు ఏమిటి..? అంటే, ప్రభుత్వ పనులను అధికారికంగా వ్యవస్థలు (పంచాయతీ /మునిసిపాలిటీ/జిల్లా పరిషత్) చేయవలసిన పనులను ఈ కార్యకర్తలకు నాయకులు అప్పనంగా నిబంధనలకు వ్యతిరేకంగా అప్పగించేస్తారు.

అధికారులు ఎవరైనా వీళ్ళు చెప్పిన వ్యక్తులకు పనులు ఇవ్వకపోతే, పనిష్మెంట్ లాగా దూర ప్రాంతాలకు, అటవీ ప్రాంతాలకు, పెద్దగా అభివృద్ధి జరగని ప్రాంతాలకు బదిలీ చేసేస్తూ ఉంటారు. ఇక ఈ కార్యకర్తలు ఆ పనులను లాభం ఆశించి, అవినీతి చేస్తూ నాసిరకంగా పనులు చేసి, ప్రజల కట్టిన పన్ను సొమ్మును చెమట పట్టకుండా, షర్టు నలగకుండా సులభంగా మింగేస్తూ ఉంటారు. ఇక సులభంగా డబ్బు సంపాదించాలనుకునే అధికారులు, ఉద్యోగులు కూడా ఈ ఎన్నుకోబడ్డ నాయకుల మెప్పు పొందేందుకు వారు చెప్పిన పనులు చేస్తూ, వాడు పడేసే ఎంగిలి మెతుకులకు ఆశగా ఎదురుచూస్తూ నిబంధనలను, ప్రజాస్వామ్య స్ఫూర్తిని తుంగలో తొక్కేస్తూ ఉంటారు.

అవినీతికి తావివ్వకుండా పనిచేస్తాం అని ప్రమాణ స్వీకారం చేసే ఈ ప్రజా ప్రతినిధులు తమ సౌకర్యం కోసం, స్వార్థం కోసం ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఈ కార్యకర్తలు అనే అడ్డు గోడను నిలబెట్టారు. కార్యకర్తలు బతికి ఉండటం కోసం అవినీతి చేయమని ప్రోత్సహిస్తారు. వీళ్ళను చూసి ప్రజలు కూడా నిబంధనలకు పాతరేసి, తప్పుడు మార్గంలో వెళ్లాలని ప్రయత్నిస్తుంటారు. ఈ తప్పుడు పనులన్నింటికి పైరవీలు చేసేది ఈ రాజకీయ పార్టీల కార్యకర్తలే..

రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్యం లో అతి కింది స్థాయి పరిపాలన యూనిట్ అయిన వార్డు/గ్రామం వరకు ప్రజలు ఎన్నుకొన్న ప్రతినిధులు ఉండగా, నాయకుల వెనక పనీ పాటా లేకుండా గాలి తిరుగుడు తిరిగే కార్యకర్తలు అనే చీడ పురుగులను తయారు చేసి సమాజం మీదికి వదిలిందెవరు అన్నది జవాబు తెలియని ప్రశ్న.    

అవినీతి పెరగడానికి కర్ణుడి చావుకు లక్ష కారణాల్లాగా ప్రయివేటు రంగం వృద్ధి చెందడం కూడా ఒక కారణం. ప్రయివేటు లో డబ్బులు తీసుకుని సర్వీసు ఇవ్వడం, డబ్బులు పెరిగిన కొద్దీ క్వాలిటీ పెరుగుతుంది అనే ఒక భావన వల్ల కూడా … ప్రభుత్వ ఉద్యోగులు, క్వాలిటీ సర్వీస్ ఇస్తామనే పేరుతో, తొందరగా పని జరుగుతుంది అని ఆశ పెట్టి ప్రజలను జలగల్లాగా పీడించుకుని తింటూ ఉంటారు.

తమకు నష్టం జరిగినప్పుడు తప్ప, ప్రతీ వ్యక్తీ అవినీతి జరగాలనే కోరుకుంటారు. అవును ఇంతకుముందు వాక్యం మళ్ళీ చదవండి. మనకు బాధ కలిగినా ఒప్పుకోవలసిన సత్యం ఏమిటంటే చాలామంది ప్రజలు అవినీతికర విధానాలకు అనుకూలంగానే ఉంటారు.  తమ ఇంటిలో, సన్నిహితుల్లో ఎవరికైనా మంచి ప్రభుత్వోద్యోగం వస్తే, వీరందరూ అందినకాడికి డబ్బులు నొక్కేయమనే సలహా ఇస్తారు.   ఇవన్నీ చూసి, ఒకరిని చూసి ఇంకొకరు అవినీతి చేయడమే కరెక్టనీ, అవినీతికి పాల్పడని వారు చేతకానివారనే… ఒక భావనను బలంగా వ్యాపింప చేశారు.  వీటన్నిటి వల్ల ప్రజల్లో కూడా ఏదో ఒక మార్గంలో తమ పని జరిగిపోతే చాలు అనే భావజాలం పెరిగిపోతోంది.

          ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డు బాయ్, కాంపౌండర్, మొదలుకొని, ఉన్నత వ్యక్తులదాకా, డబ్బిచ్చినవాళ్ళనే ఎక్కువ గౌరవంతో ట్రీట్ చేసే పరిస్తితులు, గవర్నమెంట్ ఆఫీసుల్లో చిన్న పెన్షన్ మంజూరు పని దగ్గరనుండి పెద్ద పెద్ద కాంట్రాక్టుల వరకు.. అటెండరు నుండి పెద్ద ఆఫీసరు దాకా ప్రతీ ఒక్కరూ నీ పని చేస్తే నాకేంటి అనే వాళ్ళే. పోలీసులు, మీడియా, కోర్టులు, కాలేజీలు, సివిల్ ఇంజనీరింగ్ వర్కులు.. .. ఇలా ఏ వ్యవస్థ తీసుకున్నా అవినీతి ఏదో ఒక రూపంతో మనకు ఎదురవుతూనే ఉంటుంది.

ఇలాంటి వాటిని చూసి.. చూసి ప్రజలు కూడా అవినీతికి పాల్పడటమే కరెక్ట్ అనే దృఢ నిర్ణయానికి వచ్చేశారు. నిత్యం నీతి నిజాయితీల గూర్చి ఊదరగొట్టే కొన్ని టివి చానళ్ళయితే మరీ ఘోరం.. అవినీతికి పాల్పడే వారిని బ్లాక్ మెయిల్ చేసి బిల్డింగులు, ప్రయివేటు సామ్రాజ్యాలే నిర్మించేశారు.. అంటే, తాడి తన్నే వాడి తల తన్నే వాళ్ళన్నమాట.. ఇంకొంచెం అర్థమయేలా చెప్పాలంటే మోసగాళ్లకే మోసగాళ్ళు అన్నమాట. పైనుండి ప్రతీ ఒక్కడికీ జస్టిఫైయింగ్ లాజిక్ ఒకటి ఉంటుంది తాము చేసేదే కరెక్ట్ అని.            

ప్రభుత్వం కూడా ఎన్నికైన ప్రతినిధులకు కనీస గౌరవ వేతనం కూడా ఇవ్వకపోవడం కూడా అవినీతి పెరగడానికి కారణం. ఎవరైనా నాయకుడు/రాలు నిజంగా, నిజాయితీగా పని చేయాలనుకుని, తన సమయాన్ని పూర్తిగా ప్రజా సేవకే కేటాయిస్తే, తాను, తన భార్యా పిల్లలు/కుటుంబం జీవనం ఎలా గడపాలి.. ఎలా కడుపు నింపుకోవాలి అనేవి విశ్వంలో ఉన్న బ్లాక్ హోల్ లాంటి ప్రశ్నలు.  

మరి రాజకీయ పార్టీ కార్యకర్తల చీడ మనను వదిలేదెట్లా.. ..

ఇప్పటికే ప్రభుత్వాలు పరిపాలనలో టెక్నాలజీ వాడకం ప్రారంభించాయి. ఏ విధంగా అయితే, అంబులెన్స్ వస్తుంటే ఇప్పుడు అందరూ దారి వదిలే ప్రయత్నం చేస్తున్నారో, అదేవిధంగా ప్రజలకు సౌకర్యాలను కల్పించే పనులలో టెక్నాలజీని ఎక్కువ స్థాయిలో వినియోగించి,ప్రజలకు అవగాహన కల్గించి పారదర్శకతను పెంచాలి.

  • ప్రజలకు ఆఫీసులలో పని జరిగే విధానాన్ని చిన్నప్పటినుండే విద్యలో భాగంగా తెలియచేయాలి.
  • ప్రతీ ఆఫీసు ముందర, ఆ ఆఫీసులో ప్రతీ పని ఏవిధంగా జరుగుతుందో డిస్ప్లే చేయాలి.
  • ప్రతీ కార్యాలయంలో ఒక ఫ్రంట్ ఆఫీస్ ఏర్పాటు చేయాలి. ఏ దరఖాస్తు వచ్చినా ఈ ఫ్రంట్ ఆఫీసు వారే దరఖాస్తులో ఉన్న పనిని కార్యాలయంలోని ఉద్యోగులకు అలాట్/అసైన్ చేసే విధానం రావాలి. వారి పని ఎన్నిరోజుల్లో అయిపోతుందో దరఖాస్తు ఇచ్చినపుడే దరఖాస్తుదారునికి వ్రాసి ఇవ్వాలి.
  • ప్రతీ ఒక్క పనికి కాల పరిమితి ఏర్పాటు చేయాలి. ఆ కాల పరిమితిలో ఉద్యోగి ఆ పని చేయలేకపోతే ఆ వ్యక్తి జీతంలో కోత  విధించే టెక్నాలజీని తీసుకురావాలి.
  • జరిగే ప్రతీ పని సమాజంలో మన బంధువులకో, మిత్రులకో, హితులకో,  కుటుంబసభ్యులకో మంచి చేస్తుందనే భావన ప్రతీ ఉద్యోగిలో కలుగ చేయాలి. ప్రతీ మనిషి నా బంధువే అనే అటువంటి అవగాహన కలిగించాలి. 
  • సరైన సమయంలో అప్పగించిన పని పూర్తి చేయకపోవడం కూడా ఆవినీతే అవుతుందని అవగాహన కలిగించాలి.  
  • పని జరగడానికి ఎలాంటి మధ్యవర్తుల/రాజకీయ పార్టీల కార్యకర్తల అవసరం లేదనే విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి.
  • ఏదైనా ప్రభుత్వ టెండర్ తీసుకున్న వ్యక్తి/సంస్థ సరైన సమయంలో సరైన క్వాలిటీ తో పని చేయలేకపోతే వారిని బహిరంగంగా శిక్షించే వ్యవస్థ తీసుకురావాలి.
  • మన దేశంలో ప్రధానంగా జరిగే అవినీతి ప్రజలకు సంబంధించిన ఇంజనీరింగ్ పనులలోనే జరుగుతుంది. ఇంజనీరింగ్ అధికారులను పూర్తిగా విజిలెన్స్ మరియు సర్వేయలెన్స్ క్రిందికి తీసుకురావాలి.   
  • ప్రజలకు సంబంధించిన ప్రతీ ఇంజనీరింగ్ పని జరుగుతున్న ప్రదేశంలో, ఆ పనిలో వాడే మెటీరీయల్ ఎంతెంత వాడతారు, ఎన్ని పాళ్లలో కలుపుతారు ఎంత నాణ్యతగా నిర్మిస్తారు అనే విషయాన్ని ప్రజలందరికీ తెలిసేలా పెద్ద హోర్డింగ్ పెట్టించాలి. ఏ వ్యక్తి అయినా సరే పని జరిగే ప్రాంతంలో తనిఖీ చేసుకునే విధంగా పారదర్శకంగా వ్యవహరించాలి.
  • ఎన్నికల్లో గెలిచినవాడు/గెలవాలనుకున్న ప్రతీ వాడు, ఇంజనీరింగ్ పనులు చేసి డబ్బులు మిగిలించుకోవాలనే కలలతోనే వస్తారు.   
  • ఎట్టి పరిస్తితుల్లోనూ ఎన్నికల్లో డబ్బు పంచనివ్వకుండా, ఎలాంటి తాయిలాలు ఇవ్వజూపకుండా, మద్యం పారనీయకుండా విజిలెంట్ వ్యవస్థ ను ఏర్పరుచుకోవాలి. దీనికోసం ప్రజల భాగస్వామ్యం విస్తృతంగా కావాలి.
  • ఎటువంటి ఉచిత పథకాలు ప్రకటించకుండా రాజకీయ పార్టీలను కట్టడి చేయాలి. ఏదైనా పార్టీ తమ మేనిఫెస్టో లో ఉచిత పథకాలు ప్రకటిస్తే, వెంటనే ఎన్నికల సంఘం ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి.
  • రాజకీయ నాయకుణ్ణి హీరోగా, దేవుడిగా చూసే సంస్కృతి పోవాలి. అతడు కూడా అందరిలాంటి ఒక ప్రొఫెషనల్ మాత్రమే అనే భావన నెలకొనాలి. ఈ అనవసర వ్యక్తిస్వామ్య భక్తి మిగతా కార్యకరలందరిలో తాము కూడా అదేవిధంగా నీరాజనాలు అందుకోవాలి అని ఊరిస్తూ ఉంటుంది.      
  • ఎన్నికల్లో గెలిచిన నాయకుడికి అతిగా గౌరవ మర్యాదలు ఇవ్వటం, విపరీతమయిన ప్రచారం కల్పించి అనవసర హైప్ క్రియేట్ చేయడం, వారి ఆదేశాలు అర్థవంతమైనవి కాకున్నా వాటిని గుడ్డిగా అమలు పరచటం వంటి చర్యలను తగ్గించాలి.
  • అసలు ప్రభుత్వ కార్యాలయాల దైనందిన కార్యకలాపాలలో రాజకీయ నాయకులు తల దూర్చకుండా చట్టం చేయాలి. కేవలం విధాన నిర్ణయాలు తీసుకోవడం వరకే వారిని పరిమితం చేయాలి. ప్రతీ వ్యక్తికి గౌరవమిచ్చే వ్యవస్థను పెంపొందించుకోవాలి.    
  • విధాన నిర్ణయాలు తీసుకునే వారు, అమలు పరచేవారు, న్యాయ వ్యవస్థ అనే మూడు స్తంభాలపై దేశ ప్రజాస్వామ్యం నడుస్తుందనే మౌలిక విషయాన్ని మరచిపోకుండా వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి.      

ఉపసంహారం

ఎట్లా అయితే ఉద్యోగుల ప్రమేయం లేకుండానే గెలవగలం అని పొలిటికల్ పార్టీలు నిరూపించాయో… అదే విధంగా, క్షేత్ర స్థాయిలో కార్యకర్తల అవసరం లేకుండా గెలిచే స్ట్రాటజీని పొలిటికల్ పార్టీలు డెవెలప్ చేసుకోవాలి. యుద్ధం అయిపోగానే సైన్యం అంతా ఏ విధంగా అయితే తమ తమ రెజిమెంట్లకు తిరిగి వెళ్లిపోతుందో, వరద తగ్గగానే నది ఎలా శాంతిస్తుందో, ఎన్నికలు అయిపోగానే రాజకీయ పార్టీల కార్యకర్తలు తమతమ పనులకు తిరిగి వెళ్లిపోవాలి. ఏదో ఒక పని చేసి దేశ జీడీపీ పెంచే బాధ్యత తీసుకోవాలి. అంతే తప్ప పెండ మీది పురుగుల్లా, పరాన్న జీవుల్లా ఫ్రీ గా వచ్చే తిండికి, మద్యానికి ఆశపడి నాయకుల వెనక తిరిగినన్నాళ్ళు సమాజం బాగుపడదు.

ఎన్నికలప్పుడు కాకుండా మిగతా సమయాల్లో, ఎన్నికయిన ఏ పదవి లేకుండా రాజకీయ పార్టీలల్లో తిరిగే వ్యక్తులను సమాజమే శిక్షించడం ప్రారంభించాలి. పనిచేయని వాడికి తినే హక్కు లేదనే నినాదాన్ని విస్తృతంగా  ప్రచారం చేయాలి. జోగిని వ్యవస్థ పట్ల, కుల వివక్ష పట్ల ఎటువంటి ద్వేషం సమాజంలో పెరిగిందో, అటువంటి ఏహ్య భావనను రాజకీయ పార్టీలలో తిరిగే కార్యకర్తల పట్ల సమాజంలో కలుగ చేయాలి. ఏ పని చేయకుండా దేశ సంపదను పెంచకుండా ఉండే ఏ ఒక్క వ్యక్తి నేరస్తుడితో సమానమని, సమాజంలో స్వేచ్చగా తిరగనీయకూడదు. జైళ్ళలో వేసి మానసిక వైద్యులతో కౌన్సిలింగ్ ఇప్పించి, సరిహద్దులలో దేశ రక్షణ చేసే సైనికులకు సేవ చేయించాలి.       

ఎప్పుడయితే కార్యకర్తల ప్రమేయం తగ్గిపోతుందో, అప్పుడు ప్రజలు స్వేచ్చగా ఆలోచించి ఎన్నికలలో ఓటు వేయగలుగుతారు. ఎప్పుడయితే ఎన్నికలలో ప్రజలను ప్రలోభాలకు గురి చేయడం కోసం ఖర్చు చేయవలసిన మొత్తం తగ్గిపోతుందో, ఎప్పుడయితే ఖర్చు లేని ఎన్నికలు జరుగుతాయో, అప్పుడు నిజంగా ప్రజాసేవ చేద్దామనుకుని అదే వ్యాపకంగా పని చేసేవాళ్ళు నాయకులు గా వస్తారు. ప్రజా జీవనం లో కూడా అవినీతి పాలు బాగా తగ్గుతుంది. ప్రజలకు కూడా లంచాల బాధ తగ్గి, ప్రాడక్టివిటీ పెరుగుతుంది. నిజంగా దేశం నందనవనమవుతుంది. ప్రజలు కట్టే టాక్సులు ప్రజల మేలు కొరకే వినియోగించబడతాయి. నాణ్యమైన పనులు జరుగుతాయి కాబట్టి పది కాలాల పాటు ఉండే పనులు జరుగుతాయి దానివల్ల ప్రజల నుండి వసూలు చేసే పన్నులు కూడా గణనీయంగా తగ్గి పోతాయి. తద్వారా ఒక సుందర స్వర్గ భారత సీమ ఆవిష్కృతమవుతుంది.

జై హింద్.

హసన్ముఖి. జులై 2022.

అవినీతి పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

https://wp.me/p1jCX2-2c

Leave a Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s