ఏ దేశం లో, ఏ రాష్ట్రం లో కూడా యూనిఫార్మ్ లేని ఉద్యోగుల పట్ల ఎవరూ చూపించని ధాష్టీకం ఇది. ఇన్ని గంటలే పనిచేయాలి అని ఎన్నో కంపెనీ చట్టాలు చెబుతున్నా, వేటిని లక్ష్యపెట్టక ప్రత్యక్షంగా, పరోక్షంగా హింసిస్తున్న పాలన ఇది. ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రత్యక్షంగా, రాత్రి పది గంటల వరకు పరోక్షంగా పని చేయిస్తూ పంచాయతీ సెక్రేటరీల జీవితాలను తిత్తిలా మారుస్తున్న నరక వేదన ఇది. కనీసం ముగ్గురు చేయవలసిన పనిని ఒక్కడి చేత చేయిస్తున్నా అడగడానికి ఎవడికీ మనసురాని దైన్య స్తితి ఇది. తెలంగాణ రాష్ట్రం లోని పంచాయతీ కార్యదర్శుల దుస్థితి ఇది.
పైన చెప్పిన అంశాలలో ఏ ఒక్కటీ అబద్ధం కాదు. కేవలం డిపార్ట్మెంట్ అధికారులే కాదు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, ప్రెస్ రిపోర్టర్లు, ఎన్నికల్లో ఓడిపోయి ఆ కసిని ఉద్యోగులమీద తీర్చుకోవాలనుకునే పని పాటా లేని ఛోటా మోటా లీడర్లు.. ఇలా ఎంతో మందితో హింసించబడుతున్నా.. ఎవరికీ దయరాని దయనీయ ఉద్యోగం పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం.
ఉదయం వీధులను శుభ్రం చేయించడంతో ప్రారంభమవుతుంది. శుభ్రం చేసేందుకు మల్టీ పర్పస్ వర్కర్లుంటారు. కానీ వారు సమయానికి రారు ఎందుకంటే, వారికి మూడు, నాలుగు నెలలుగా జీతాలు ప్రభుత్వం చెల్లించటం లేదు. వర్కర్ల ఇంటి వద్దకు వెళ్ళి తీసుకొద్దామనుకున్నా, వర్కర్ల కుటుంబ సభ్యులతో జీతం ఆలస్యం విషయం లో నానా మాటలు పడి వాళ్ళను కన్వీన్స్ చేసి పనిలోకి పంపడం తో తల ప్రాణం తోకలోకి వస్తుంది. వాళ్ళు పని చేస్తుంటే ఆ రోజు నాటి డేట్ వచ్చేలాగా ఫోటో తీసి, దాన్ని ఎంపీవో గ్రూపులోకి, ఎండీవో గ్రూపులోకి పంపాలి.
అంతేకాక ఘనత వహించిన రాష్ట్ర ప్రభుత్వం వారు రూపొందించిన యాప్ లో అటెండెన్స్ వేసి, ఆరు ఫోటోలు (ట్రాక్టర్ ట్రాలీ, కాంపొస్ట్ షెడ్, రోడ్లు, డ్రైనేజీ, నర్సరీ, ప్లాంటేషన్, క్రెమెటోరియం) తీసి దానిలో అప్డేట్ చేయాలి. దీంతో రోజులో మొదటి పని పూర్తవుతుంది.
ఈ పని చేసే లోపు మొబైల్ ఫోన్లో నెట్వర్క్ లేకపోయినా, పొరపాటున మనం వెళ్ళే ఆటో/ బస్సు లేటయినా, డీపీవో, డీఎల్పీవో ఆఫీసులనుండి ఓ ఇరవై ఫోన్ కాల్స్ వచ్చేస్తాయి. కార్యదర్శులు గ్రామానికి పోవడం ఆలస్యం అవడం వల్ల భూమండలం ఆగిపోయిందని, భూకంపం వచ్చేసిందని, ఎన్నో తిట్లు తిట్టేయ బడతాయి.
ఇంతలో ట్రాక్టర్ ట్రాలీ తీసుకుని ఓ ఇద్దరు వర్కర్లు ఇంటింటి నుండి చెత్త సేకరించేందుకు బయలుదేరారో లేదో చూసుకోవాలి. పొరపాటున ట్రాక్టర్ లేటయిందో, ఊళ్ళో జనం, పైన చెప్పిన పనీ పాటా లేని చోట మోటా లీడర్లు ఫోన్ కాల్స్ చేసేస్తారు..
ఇక ట్రాక్టరు అన్ని వీధుల్లోకి వెళ్తుంది అని నమ్మకం కలిగాక, కార్యదర్శి రశీదు బుక్ తీసుకుని ఇంటింటికీ వెళ్ళి ఇంటి పన్ను వసూలు చేయాలి. అలా వెళ్ళినపుడు ఆ ఇళ్ళల్లో వాళ్ళ వెకిలి ప్రశ్నలు, చులకన చూపులు.. వీటన్నిటిని తట్టుకుని, ఇంటి పన్ను వసూలు చేసి, ఆ డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోవాలి.
ట్రాక్టర్ ట్రాలీ అన్ని ఇళ్ల, దుకాణాల చెత్త తీస్కుని కాంపొస్ట్ షెడ్ కె వెళ్ళిందా లేదా చూసుకోవాలి. ఆ చెత్త అంతా ఆ కాంపొస్ట్ షెడ్ లోనే వేశారో లేదో చూసుకుని, ఒకవేళ వేయకపోతే, ఆ ట్రాక్టరు డ్రైవరు కాళ్ళు గడ్డాలు పట్టుకుని బ్రతిమలాడి, చెత్త వేరే ఎక్కడో గుంతలో పడేయకుండా కాంపొస్ట్ షెడ్ లో వేయించి ఆ తడిచెత్తను ఎరువులా మార్చే ప్రక్రియ ఫాలో అవుతున్నారో లేదో చెక్ చేసుకోవాలి పంచాయతీ కార్యదర్శి.
చాలా గ్రామాల్లో ఈ కాంపొస్ట్ షెడ్ అనే దారుణం ఊరికి రెండు మూడు కిలోమీటర్ల దూరం లో ఉంటుంది. అప్పుడు ఉంటుంది సెక్రేటరీకి అసలైన బాధ. పొరపాటున మహిళా సెక్రెటరీ అయితే, ఆమెకు ద్విచక్ర వాహనం లాంటిది లేకపోతే, ఆ అమ్మాయి బాధలు పరమాత్ముడికే ఎరుక.
మిగతా బాధలు పార్ట్ -2 లో
Like this:
Like Loading...
Related
Published by Behind the heartbeats
మనసున్న మనిషిని, సహృదయమున్న కవిని, రచయితను. అన్నిటికీ మించి బాధ్యత ఉన్న పౌరుడిని
View all posts by Behind the heartbeats