మొదటి భాగం లో పంచాయతీ కార్యదర్శి తన రోజు ప్రారంభమవగానే ఎదుర్కోవలసిన కొన్ని సమస్యలు ప్రస్తావించాను. వాటికి కొనసాగింపు.
ఊరికి రెండో మూడో కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ కాంపొస్ట్ షెడ్స్, తెలంగాణా రాస్ట్రం లో ప్రతీ గ్రామం లో దాదాపుగా చెరువు శిఖం ప్రాంతాల్లో ఉంటాయి. ఏ కాస్త వర్షం వచ్చినా చెరువు నిండుతుంది. దాంతో షెడ్ లోకి నీళ్ళు వస్తాయి చెత్త ఎరువు గా మారే ప్రక్రియ ఆగిపోతుంది. దాంతో పంచాయతీ కార్యదర్శి మీద చిందులేసే అత్యున్నత స్థాయి అధికార్లు ముఖ్యంగా కాంపొస్ట్ షెడ్ నిర్మాణం కోసం రెవెన్యూ వాళ్ళు భూమి ఎల్లోకేషన్ చేసినప్పుడు మాట్లాడని ఐఏఎస్ ఆఫీసర్లంతా, పంచాయత్ రాజ్ అధికారులంతా ఇప్పుడు ఎరువుగా మారట్లేదని తెగ బాధపడి పోతుంటారు.
గ్రామంలో వీధులు ఊడ్వడం, ఇంటింటికీ వెళ్ళి చెత్త సేకరించడం, మురుగు కాలువలు శుభ్రం చేయడం, చెట్లకు నీళ్ళు పోయడం, పాదులు తీయడం, కరెంటు, మంచి నీళ్లకు సంబంధించిన పనులు అన్నీ చేసే పారిశుద్ధ్య కార్మికులే కాంపొస్ట్ షెడ్ లో కూడా పని చేయాల్సి రావడం వల్ల సరిగా ఎరువు తయారు కావడం లేదు అని ఏ ఒక్కరూ గుర్తించటం లేదు. షెడ్ లో పని చేసేందుకు సెపరేట్ గా ఒక స్కిల్డ్ వర్కర్ కావాలని ఒక్కరూ అడగటం లేదు.. పైగా అందరూ కార్యదర్శులమీద అరిచేవాళ్లే. మొత్తానికి ఈ కాంపొస్ట్ షెడ్ కు చెత్త పంపించేసిన తరువాత, కార్యదర్శి పంచాయతీ ఆఫీసుకు వెళ్ళి ఎవరైనా ప్రజలు ఏదైనా అవసరం కోసం వచ్చారేమో అని చూసుకుని ఎవరైనా వస్తే వారి అవసరం ప్రకారం, ఇంటి అనుమతో, మరేదైనా పర్మిషనో.. ఇచ్చేసి, ట్రాక్టర్ డ్రైవర్ ను పిలిపించి ట్రాలీ పక్కన పెట్టించి ట్యాంకర్ ను ట్రాక్టర్ కు అటాచ్ చేయించి ట్యాంకర్ లో నీళ్ళు నింపించి చెట్లకు నీళ్ళు పోసేందుకు రోడ్ల మీద పడాలి.
పనిలో పనిగా, నర్సరీకి వెళ్ళి, అక్కడ చిన్న చిన్న చెట్లు బతికాయా లేదా చూసి, అక్కడ వన సేవక్ ఉంటే మాట్లాడి, డబ్బులు ఆలస్యమయినా ఆ వనసేవక్ ను పని మానకుండా ఒప్పించి, నర్సరీ బాగుంది అనుకుని, రోడ్లమీద చెట్లకు నీళ్ళు పోయించడానికి బయలుదేరాలి. ఇంతలో ఒక దగ్గర చెట్టు ఆకులు అన్నీ మాయమై పోయి ఉంటాయి. చెట్టు విరిగి పోయి ఉంటుంది. చెట్లకు రక్షణగా పెట్టిన ట్రీ గార్డ్ కింద పడిపోయి ఉంటుంది.. సపోర్టింగ్ స్టిక్ విరిగి పోయి ఎక్కడో పడిపోయి ఉంటుంది. దాదాపు అర కిలోమీటర్ వరకు ఇలాంటి దారుణం జరిగి ఉంటుంది. ఏం జరిగిందో అని త్వరత్వరగా ఎవరినో రిక్వెస్ట్ చేసి బండి ఎక్కి పోయి చూస్తే, సర్పంచ్ గారి చుట్టాల వారి మేకలు, బర్రెలు చెట్లను నాశనం చేస్తూ దర్జాగా వెళ్తుంటాయి. పట్టరాని కోపంతో ఆ మేకల కాపరిని పట్టుకుని తిడితే, రెండు నిమిషాల్లో సర్పంచ్ నుండో, ఉప సర్పంచ్ నుండో, ఇంకా ఎవడేవడి నుండో ఫోన్ కాల్ వస్తుంది.. చెవులలోంచి రక్తాలు కారెంతగా బూతులు తిట్టబడతాయి. ఆ చెట్లు ఆ ఊరికి ఉపకారం చేస్తాయని ఎంత మొత్తుకున్నా వినకుండా ఫోన్లో మాట్లాడిన అధికార మదాంధుడు అడ్డమైన తిట్లు తిట్టేస్తాడు.
ఎంతో ఇష్టంగా పెంచుకున్న చెట్లు నాశనం అవుతుంటే చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయత ఒకవైపు, వాడు తిట్టిన తిట్లకు వాడిని ఏమీ చేయలేకపోయానే అనే ఉక్రోషం ఒకవైపు, పొరపాటున ఎవరైనా ఉన్నతాధికారులు వచ్చి ఈ చెట్లను చూస్తే ఉద్యోగం గతి ఏమవుతుందో అనే భయం ఒకవైపు.. .. సందట్లో సడేమియాలాగా పనీపాటా లేని, ఊళ్లోని యువకుడో, డబ్బులకు కక్కుర్తి పడే రిపోర్టరో ఫోటో తీసి ఎంత రచ్చ చేస్తాడో అనే బాధ ఒకవైపు .. .. .. అన్నీ ఒకేసారి చుట్టుముట్టెస్తే, విపరీతమైన ఫ్రస్ట్రేషన్.. కోపం.. తలనొప్పి,..బీపీ .. లాంటివన్నీ సెక్రేటరీల ఆరోగ్యాలను ఎంతగానో దెబ్బతీస్తున్నాయి.
హరిత హారం కోసం కేవలం సెక్రేటరీనే కష్టపడాల్సి వస్తోంది.. .. కొన్ని సందర్భాలలో మాత్రమే ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ సహాయం చేస్తారు.. మిగతా 80 శాతం గ్రామాల్లో అటు సర్పంచ్, ఇటు ఉపాధి హామీ సిబ్బంది అందరు కలసి ఇబ్బందులు పెట్టడమే తప్ప చెట్లను బ్రతికించే పని ఎవరూ చేయరు. క్షేత్ర స్థాయిలోని వాస్తవాలను గుర్తించని జిల్లాస్థాయి అధికారులు ఎప్పుడూ కార్యదర్శులను బలి చేసేందుకు మొగ్గు చూపుతూ ఉంటారు.
ఒకప్పుడు సెక్రేటరీగా ఎంపీవో గా పనిచేసిన వారు కూడా గతాన్ని మరచిపోయి కార్యదర్శుల కష్టాలను గమనించకుండా నోటి కొచ్చినట్టు మాట్లాడటమే వైచిత్రి. గ్రామాల్లో ఎవరైనా వ్యక్తులు సెక్రేటరీలను ఇష్టమొచ్చిన బూతులు తిడుతూ ఉంటే మండల జిల్లా స్థాయి అధికారులు ఒక్కరూ పట్టించుకోరు. ఆ తిట్లు కార్యదర్శుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని గుర్తించరు. సీఆర్పీసీ 353 సెక్షన్ ప్రకారం ప్రభుత్వోద్యోగులను ఎవరయినా పని చేయకుండా అడ్డుకున్నా తిట్టినా ఏ రకంగా హింసించినా అది నేరం. కానీ కేసు పెడతామని పోలీస్ స్టేషన్ కు వెళదామంటే తోటి సెక్రేటరీలు కూడా మద్ధతివ్వని దుస్థితి కార్యదర్శులది.
మిగతా సమస్యలు పార్ట్ – 3 లో.
click here for Part-1: https://wp.me/p1jCX2-d4