లోకహితం కోసం విషం తాగిన వాడు… అందుకే ‘శవం’ కాకుండా ‘శివం’ అయ్యాడు…

Whatsapp Collection and some part is modified

లోకహితం  కోసం విషం తాగిన వాడు…అందుకే ‘శవం’ కాకుండా ‘శివం’ అయ్యాడు…

*******************************************************
వారంతా అమృతం కోసం పాలసముద్రాన్ని మధిస్తున్నారు. 

దేవతలను అమరులుగా చేసేందుకు ‘అమృతం’ కావాలి. ‘అమృతం’ కోసం ప్రయత్నిస్తే వద్దన్నా వచ్చేది ‘హాలాహలం’. 

‘హాలాహలం’ కాలకూట విషం. అది నిలువునా దహిస్తుంది… ప్రాణులని చంపేస్తుంది. 

ఆ తర్వాత అమృతం వస్తే ఎంత..? రాకపోతే ఎంత….? హాలాహలం వరకు మాత్రం ఎవరైనా హరించేస్తే ఎంత బాగుంటుంది…? కానీ ఎవరు హాలాహలాన్ని తీసుకుంటారు ఎవరు అంత ధైర్యం చేస్తారు ..? ఈ ప్రాణికోటి కోసం ఎవరు నిలబడతారు ..?

అప్పుడు ఒక ‘బైరాగి’ ముందుకొచ్చాడు. అతడు బేసి కన్నుల వాడు.

గోచిపాత వాడు.

అతను మంచుని, మంటని ఒక్కటిగా లెక్క చేసే తిక్క శంకరయ్య.

చర్మమే ఆయన దుస్తులు……

భస్మమే ఆయన ఆభరణం ….. 

స్మశానమే ఆయన ఇల్లు…… 

భూతాలు ఆయన మిత్రులు ……..

“లోకాల… కోసం నేను విషాన్నిమింగేస్తాను.” అన్నాడు. 

“రేపు రాబోయే అమృతం కోసం….. నేడు నేను హాలాహలం తాగేస్తాను” అన్నాడు. 

హాలాహల విషమంటే మాటలా…? విషం దహించి వేస్తుంది…… ఆవిరులు ఊపిరిని ఆపేస్తాయి….. అయినా విషాన్ని ఖుషీగా తాగేస్తానంటున్నాడు తిక్క శంకరయ్య. విషాన్ని తాగేస్తా అన్నప్పుడు ఆవేశంగాలేదు ఆ వదనం.. ప్రశాంతంగా అనంతమైన ఆనందంతో అంటున్నాడు శివయ్య…

ఈ విషయాన్ని పోతన చాలా బాగా అందంగా వివరిస్తాడు రెండు పద్యాలలో…

శిక్షింతు హాలాహలమును 
భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ 
రక్షింతు ప్రాణికోట్లను 
వీక్షింపుము  నీవు నేడు వికచాబ్జముఖీ   
అని శివుడు హాలాహలాన్ని మింగడానికి సిద్ధమవుతూ పార్వతి వైపు చూశాడట. 

మింగెడివాడు విభుండని 
మింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ 
మింగుమనే సర్వమంగళ 
మంగళ సూత్రంబు నెంత మదినమ్మినదో  
అని కళ్ళతోనే మీ ఇష్టం స్వామీ అని అన్నదట పార్వతీ దేవి. 

"నాకోసం విషాన్ని తాగుతున్నావా తండ్రీ?"   ఆప్యాయంగా అనుకుంది పాము. 
అంతే చర చర బిర బిర వచ్చి విషం మంటలను తనవంతుగా తగ్గించేందుకు ఆ శంకరయ్య గొంతుకు, మెడచుట్టూ  చుట్టుకుంది.
 విషం గొంతు దిగితే చతుర్దశ భువనాలు ధ్వంసమైపోతాయి. కాబట్టి అది గొంతు దిగకుండా భార్య ‘పార్వతి’ వచ్చి ఆయనలో తాను సగమైంది. 
గొంతును అదిమి పట్టుకుంది.
"జగత్తు కోసం విషం తాగుతున్న ఓ చక్కనయ్యా... నీకు చల్లదనాన్ని పంచుతా". అంటూ చంద్రుడు శంకరయ్య తలపై కూచుని వేదన తగ్గించే చల్లదనాన్నిచ్చాడు. 
శిరోభారం తగ్గించేందుకు గంగ చిరుజల్లులు కురిపించసాగింది. ..
కాలకూట విషం, జగత్తును నశింపచేసే విషం....  గొంతులోకి దిగుతూ ఉంది. 
శంకరయ్య నీల కంఠుడయ్యాడు... గరళ కంఠుడయ్యాడు.... స్థితి కంఠుడయ్యాడు. 
తల తిరుగుతోంది. మత్తు ఆవహిస్తోంది. విషం తన పని తాను చేసుకునేందుకు శ్రమిస్తోంది.. శివుడితోనే పోరాడుతోంది.. 
శివయ్యకూ తెలుసు.. నిద్ర పడితే.. విషం అరుగుతుంది.. అరిగితే లోకాలకు ప్రమాదం... అంటే నిద్ర పట్టకూడదు.. యోగా శక్తితో తపశ్శక్తితో నిద్రించకుండా ధ్యానిస్తున్నాడు....    
రాత్రి గడిస్తే కానీ విషయం అవగతం కాదు. .. 
"అయ్యో మాకోసం త్యాగం చేస్తున్నావు తండ్రీ  నీకోసం మేముంటాము" అంటూ, 
సప్త లోకాలు, చతుర్దశ భువనాలు, ముక్కోటి దేవతలు, శతకోటి జనాలు, అశేషకోటి జీవాలు రాత్రి తెల్లవార్లూ అతడిని కనిపెట్టుకుని శివయ్యనే తలుస్తూ  నిద్ర మాని జాగారం చేశాయి.

‘సమాజం’ కోసం పనిచేసేవాడికి ‘సమాజమే’ తోడు. ‘లోకహితం’ కోరేవాడికి లోకమే హితం చేకూరుస్తుంది. ‘జనం’ కోసం విషం తాగిన వాడు. అందుకే ‘శవం’ కాకుండా ‘శివం’ అయ్యాడు. 
నిద్రమాని జాగారం చేసిన రాత్రి శివరాత్రి అయ్యింది.

ఓం నమఃశివాయ  

Leave a Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s